ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలి : సీపీ గౌస్ ఆలం

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలి :  సీపీ గౌస్ ఆలం
  •     కరీంనగర్​ సీపీ గౌస్​ ఆలం

తిమ్మాపూర్​, వెలుగు: కరీంనగర్ జిల్లాలో జరిగే పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ గౌస్​ ఆలం తెలిపారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలతో పాటు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను మంగళవారం ఆయన స్వయంగా పర్యవేక్షించారు. రెండో విడతలో ఎన్నికలు జరగనున్న తిమ్మాపూర్, శంకరపట్నం, చిగురుమామిడి, గన్నేరువరం, మానకొండూర్​ మండలాల్లో నామినేషన్ల స్వీకరణను పరిశీలించారు. 

అనంతరం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, నల్లగొండ, పర్లపల్లి, మొగిలిపాలెం, చిగురుమామిడి మండలం రేకొండ, సుందరగిరి, బొమ్మనపల్లి, సైదాపూర్, సోమారం, శంకరపట్నం, తాడికల్ గ్రామాలతో పాటు పలుచోట్ల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున, నేర చరిత కలిగిన వారిని బైండోవర్ చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట రూరల్ ఏసీపీ విజయకుమార్, హుజూరాబాద్ ఏసీపీ మాధవి, సీఐలు సదన్ కుమార్, వెంకట్, ఎస్ఐలు శ్రీకాంత్, తిరుపతి, సాయికృష్ణ, తదితరులు ఉన్నారు.