నాకేం తెల్వదు.. లాయర్‌‌‌‌ దంపతుల హత్యలపై పోలీసులతో పుట్ట మధు

నాకేం తెల్వదు.. లాయర్‌‌‌‌ దంపతుల హత్యలపై పోలీసులతో పుట్ట మధు


గోదావరిఖని, వెలుగు: హైకోర్టు అడ్వకేట్‌‌‌‌‌‌‌‌ దంపతులు గట్టు వామన్‌‌‌‌‌‌‌‌రావు, నాగమణి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసుల విచారణలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పుట్ట మధు పదే పదే చెబుతున్నట్టు తెలిసింది. శనివారం, ఆదివారం రెండ్రోజులు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌తో పాటు స్థానిక పోలీసు అధికారులు రెండు టీమ్‌‌‌‌లుగా ఏర్పడి విచారించినా ఏం చెప్పలేదని సమాచారం. ‘వామన్‌‌‌‌‌‌‌‌ రావు, నాగమణి నన్ను బాగా డిస్టర్బ్‌‌‌‌ చేస్తుండడంతో నేను పడుతున్న బాధను చూడలేక నా మీద ప్రేమతో ఈ హత్యలు చేసి ఉండొచ్చు. హత్యలకు నాకు సంబంధం లేదు. నేనూ ఓ ప్రేక్షకుడినే’ అని మధు సమాధానమిస్తున్నట్టు తెలిసింది. దీంతో టెక్నికల్‌‌‌‌ అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. మధు తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన 2002 నుంచి ఇప్పటి వరకు జరిగిన బ్యాంకు ఆర్థిక లావాదేవీలు, భూముల కొనుగోలు, పుట్ట లింగమ్మ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌కు వస్తున్న నిధులు, వాటి లెక్కలను ఆరా తీస్తున్నారు. వామన్‌‌‌‌‌‌‌‌రావు దంపతుల హత్యకు ముందు బ్యాంకుల నుంచి డ్రా చేసిన రూ.2 కోట్లు వ్యవహారంపైనా దృష్టి పెట్టారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని రెండు బ్యాంకులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 6 బ్యాంకుల్లో జరిగిన లావాదేవీల స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్లను తెప్పించుకున్నట్టు తెలిసింది.

వామన్‌‌‌‌రావ్‌‌‌‌.. పుట్ట మధు పేరే చెప్పారా?

ఈ ఏడాది ఫిబ్రవరి 17న రామగిరి మండలం కల్వచర్ల గ్రామ శివారులో అడ్వొకేట్‌‌‌‌‌‌‌‌ దంపతులపై దాడి జరగ్గా కొన ఊపిరితో ఉన్న వామన్‌‌‌‌‌‌‌‌ రావు తన పేరు, ఊరు చెబుతూ తనపై దాడి చేసింది కుంట శ్రీను అంటూ ఆ తర్వాత మరో పేరు కూడా చెప్పినట్టు పోలీసులు గుర్తించారు. ఆ పేరు స్పష్టంగా వినబడకపోవడంతో ఆ వీడియో, ఆడియోను ఫోరెన్సిక్‌‌‌‌‌‌‌‌ ల్యాబ్‌‌‌‌‌‌‌‌కు పంపగా ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్ఎల్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో మధు పేరు చెప్పినట్టు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. గుంజపడుగు గ్రామంలో ప్రధాన నిందితుడు కుంట శ్రీనుకు సంబంధించినదిగా చెబుతున్న ఇంటి నిర్మాణంతో పాటు మంథనిలో కూడా సుమారు రూ. 4 కోట్లతో ఓ భవనం నిర్మాణంలో ఉందని, వీటికి డబ్బులు ఎవరు ఖర్చు చేస్తున్నారన్న వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం.   

వామన్‌‌‌‌‌‌‌‌రావు తండ్రితో పోలీసుల చర్చలు

తన కొడుకు, కోడలు హత్య కేసులో మధు, ఆయన భార్య శైలజ ప్రమేయం ఉందని వామన్‌‌‌‌‌‌‌‌రావు తండ్రి కిషన్‌‌‌‌‌‌‌‌రావు గత నెల 16న ఐజీ నాగిరెడ్డికి లెటర్‌‌‌‌ రాశారు. దాంట్లోని పలు అంశాల ఆధారంగా మధును విచారించాలని పోలీసులు భావించగా గన్‌‌‌‌‌‌‌‌మెన్లకు చెప్పకుండా సెల్‌‌‌‌ ఆఫ్ చేసుకుని 9 రోజులు మధు అజ్ఞాతంలో  ఉన్నారు. ఆధారాలను సేకరించేందుకు పోలీసులు కిషన్‌‌ రావుతో ఆదివారం కమిషనరేట్ ఆఫీసులో చర్చించారు. సోమవారం కూడా రమ్మని చెప్పారు. కాగా, తీవ్రంగా గాయపడ్డ తన కొడుకును పెద్దపల్లి మెయిన్​ హాస్పిటల్‌‌‌‌కు ట్రీట్​మెంటు కోసం తీసుకెళ్లారని, కానీ వామన్‌‌‌‌రావుకు ట్రీట్​మెంట్ చేయొద్దని పెద్దపల్లి డాక్టర్లకు పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఫోన్ చేశాడని వామన్‌‌‌‌రావు తండ్రి చెప్పారు. అందుకే డాక్టర్లు సరైన ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందించలేదని, దీంతో తన కొడుకు చనిపోయాడని ఆరోపించారు. 

పక్కా ఆధారాలతో అరెస్టుకు సిద్ధం

వామన్‌‌‌‌రావు తండ్రి కిషన్‌‌‌‌‌‌‌‌ రావు ఇచ్చిన ఆధారాలకు తోడు టెక్నికల్‌‌‌‌‌‌‌‌గా సేకరించిన ఆధారాలతో మధును అరెస్టు‌‌‌‌ చేయనున్నట్టు తెలుస్తోంది. మధు సామాజిక వర్గానికి చెందిన ఒకరిద్దరు పోలీసులు ఆయనతో క్లోజ్‌గా ఉండేవారని, వారినీ విచారిస్తే నిజాలు తెలుస్తాయని కిషన్‌‌‌‌‌‌‌‌ రావు చెబుతున్నారు. దీంతో పోలీసులనూ విచారించే అవకాశం కనిపిస్తోంది. మధు సిఫార్సు‌‌‌‌ లెటర్‌‌‌‌‌‌‌‌తో నెల క్రితం మంథనికి సీఐగా పోస్టింగ్ తెచ్చుకున్న మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డిని వరంగల్ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌కు అటాచ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

శైలజను విచారించిన పోలీసులు

పుట్ట మధు భార్య, మంథని మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌ పుట్ట శైలజ ఆదివారం రామగుండం కమిషనరేట్ పోలీసుల ముందు హాజరయ్యారు. బ్యాంకు నుంచి ఎక్కువ డబ్బులు ఎందుకు డ్రా చేశారు, ఎవరికి ఇచ్చారు, ఇండ్లు ఎట్లా కట్టిస్తున్నారని ఆమెను పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం. 2018 సంవత్సరంలో ఎన్నికలప్పుడు సుపారీ ఇచ్చి ఒకరిని హత్య చేయాలనే విషయంలో వచ్చిన కాల్‌‌‌‌‌‌‌‌ డేటా వాయిస్‌‌‌‌‌‌‌‌లో శైలజ పేరు ప్రస్తావనకు రావడాన్ని కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. సోమవారమూ విచారణకు రావాలని నోటీసు‌‌‌‌ ఇచ్చినట్టు సమాచారం. రామగుండం కమిషనరేట్‌‌‌‌‌‌‌‌లో తన భర్తను కలవాలని శైలజ కోరగా పోలీసులు అంగీకరించలేదు.

ప్రశ్నలు.. రాతపూర్వక జవాబులు

రూ. 2 కోట్లు డ్రా చేసి ఏం చేశారు, ఎవరికి ఇచ్చారని, గన్‌‌‌‌‌‌‌‌మెన్లను వదిలిపెట్టి అజ్ఞాతం లోకి ఎందుకు వెళ్లారని,  వామన్‌‌‌‌రావు దంపతుల హత్యతో సంబంధమేంటని రెండ్రోజులుగా మధును ప్రశ్నించగా తొలి రెండు ప్రశ్నలకు జవాబు చెప్పి హత్యలతో తనకు సంబంధం లేదని రాసి ఇస్తున్నట్టు  తెలిసింది. మరోవైపు ఫిబ్రవరి 17న మధ్యాహ్నం 2.30కు హత్య జరగ్గా ఆ రోజు పొద్దున మంథని మండలం దుబ్బపల్లి వద్ద హత్య కేసులో ప్రధాన నిందితుడు శ్రీనుతో మధు అర గంట పాటు కారులో మాట్లా డటాన్ని పోలీసులు సీరియస్‌‌‌‌‌‌‌‌గా తీసుకు న్నారు. ఏం మాట్లా డారో తెలుసుకునేందు కు శ్రీనును పోలీసు‌‌‌‌ కస్టడీకి తీసుకునేందు కు ఆలోచిస్తున్నట్టు సమాచారం.