వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు ముస్లింలపై బీజేపీ క్రూరత్వమే: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు ముస్లింలపై బీజేపీ క్రూరత్వమే: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఢిల్లీ: వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుతో బీజేపీ ముస్లింలపై క్రూరత్వాన్ని ప్రదర్శించిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్లో మండిపడ్డారు. రాజ్యాంగంలోని సెక్యులరిజానికి బీజేపీ తూట్లు పొడిచిందని, 75 ఏళ్లుగా ఆయా వర్గాల ప్రజలకు రక్షణ కల్పిస్తున్న బిల్లును సవరించడం అన్యాయం అని ఆయన విమర్శించారు. ఇప్పటివరకు వక్ఫ్ బోర్డ్ భూముల్ని ముస్లింలు వారి సంక్షేమం కోసం ఉపయోగించేవారని, కానీ వక్ఫ్ ఆస్తులపై కన్నేసిన బీజేపీ ముస్లిమేతరులతో వక్ఫ్ను కంట్రోల్ చేయాలని చూస్తోందని చెప్పారు. సెక్షన్ 40 సవరణ చేయడం అంటే వక్ఫ్ బిల్లు ఉన్నా లేనట్లేని విమర్శించారు. 

రాజ్యాంగంలోని పలు ఆర్టికల్స్ వక్ఫ్ బోర్డ్కు రక్షణ కల్పిస్తున్నాయని, ఎన్నికల ముందు తాము చెప్పినట్లుగానే పలు వర్గాలను టార్గెట్ చేస్తూ బీజేపీ సవరణలు తెస్తుందని ఆయన తెలిపారు. ఇప్పుడు ముస్లిం, తర్వాత సిక్కు,  జైనులు.. ఇలా అన్ని వర్గాలను టార్గెట్ చేయబోతోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్ సాక్షిగా చెప్పారు.

వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024లో ప్రతిపాదిత సవరణలు ఏమిటి?
వక్ఫ్ (సవరణ) బిల్లు 2024 ఆస్తి నిర్వహణపై వక్ఫ్ బోర్డుల అధికారాన్ని పరిమితం చేయడం, ప్రభుత్వ పర్యవేక్షణను పెంచడం ఈ సవరణ బిల్లు లక్ష్యం. మూల్యాంకనం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వక్ఫ్ ఆస్తులను తప్పనిసరిగా నమోదు చేయాలి. చట్టం ప్రారంభానికి ముందు లేదా తర్వాత వక్ఫ్ ఆస్తులుగా గుర్తించిన ప్రభుత్వ ఆస్తులు వక్ఫ్ ఆస్తులుగా పరిగణించబడవు. జిల్లా కలెక్టరే.. ఆస్తి వక్ఫ్ బోర్డ్దా లేదా ప్రభుత్వ భూమినా.. అనే విషయాన్ని నిర్ణయిస్తారు. వారి నిర్ణయం అంతిమంగా ఉంటుంది. కలెక్టర్ రెవెన్యూ రికార్డులను అప్‌డేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తారు. కలెక్టర్‌ నివేదిక అందే వరకు వక్ఫ్‌ ఆస్తులను గుర్తించరు.

వక్ఫ్ బోర్డు నిర్ణయాలకు సంబంధించిన వివాదాలు ఇప్పుడు హైకోర్టులను ఆశ్రయించవచ్చు. మౌఖిక ప్రకటనల ఆధారంగా ఆస్తిని వక్ఫ్‌గా పరిగణించే నిబంధనలను బిల్లు తొలగిస్తుంది. కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా నియమించబడిన అధికారులచే నియమించబడిన ఆడిటర్లచే వక్ఫ్ ఆస్తుల ఆడిట్‌లను ఆదేశించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ , రాష్ట్ర బోర్డులలో మహిళా ప్రాతినిధ్యం ఉండేలా సవరణలు కూడా కోరుతున్నాయి.