మా లక్ష్యం యువతకు జాబ్స్.. పరిశ్రమల స్థాపనకు ఇన్వెస్టర్లను కలుస్తున్న: ఎంపీ వంశీకృష్ణ

మా లక్ష్యం  యువతకు జాబ్స్.. పరిశ్రమల స్థాపనకు ఇన్వెస్టర్లను కలుస్తున్న: ఎంపీ వంశీకృష్ణ
  • యూఎన్​లో ప్రసంగం.. ఎప్పటికీ మరిచిపోలేను
  • పెద్దపల్లి ప్రజల ఆశీర్వాదంతోనే అవకాశం దక్కింది
  • రామగిరి ఖిల్లాను టూరిస్ట్ హబ్​గా మారుస్తామని వ్యాఖ్య

పెద్దపల్లి/బెల్లంపల్లి/కోల్​బెల్ట్, వెలుగు: యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ పని చేస్తున్నదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. పెద్దపల్లిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పెద్దపల్లి ప్రజల ఆశీర్వాదంతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రతినిధిగా మాట్లాడాను. ఇది నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్న. గతంలో మా తాత, మాజీ కేంద్ర మంత్రి కాకా గడ్డం వెంకటస్వామి ఎన్నో పోరాటాలు చేశారు. కార్మికులకు పింఛన్ సౌకర్యం కల్పించారు. అప్పట్లోనే ఆయన జెనీవాలోని ఐఎల్​వోలో కార్మికుల పక్షాన ప్రసంగించారు. ఆయన వారసుడిగా 40 ఏండ్ల తర్వాత నాకు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ‘ఆర్థిక వ్యవస్థ, ప్రస్తుత సవాళ్లు’అనే అంశం మీద ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన. ఆ అనుభవాలను నన్ను గెలిపించిన పెదపల్లి ప్రజలతో పంచుకున్న. ప్రజల ఆశీస్సులు ఉంటే రాబోయే రోజుల్లో పెద్దపల్లి అభివృద్ధికి ఇంకా కృషి చేస్తా’’అని వంశీకృష్ణ అన్నారు.

బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ చొరవతో జాబ్​మేళా

స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ నేతృత్వంలో మెగా జాబ్​మేళా నిర్వహించడం అభినందనీయమని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సింగరేణి, నోబెల్ ఎంపవర్​మెంట్ సొసైటీ జాబ్​మేళా నిర్వహించింది. ఉద్యోగాలు పొందిన వారికి గడ్డం వినోద్​తో కలిసి ఎంపీ వంశీకృష్ణ నియామకపత్రాలు అందజేశారు. జాబ్​మేళాకు 3 వేలకు పైగా నిరుద్యోగులు హాజరు కాగా.. 1,500 మంది ఉద్యోగాలు పొందారని ఎంపీ వంశీకృష్ణ అన్నారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో కష్టపడితేనే ఎవరైనా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని -బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతోనే జాబ్​మేళా చేపట్టినట్లు తెలిపారు. ‘‘70 కంపెనీలతో ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. సింగరేణి సంస్థను కాపాడిన ఘనత గడ్డం వెంకటస్వామి కుటుంబానికే దక్కుతుంది. ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేస్తా’’అని వినోద్ అన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్టు, ప్లానింగ్) వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, డీసీపీ భాస్కర్, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ పాల్గొన్నారు.

పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నా..

దుబాయ్​లో ఇన్వెస్టర్లతో మాట్లాడి పెద్దపల్లి, మంచిర్యాలలో పెట్టుబడులు పెట్టాలని కోరినట్లు ఎంపీ వంశీకృష్ణ అన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడమే ఎజెండాగా తాను పోటీ చేశానని, ఆ దిశగా ఎన్నో రంగాల్లో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నానన్నారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీ కూడా పూర్తయిం ది.  పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్​లో జాబ్ మేళా, స్కిల్ డెవలప్​మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కేంద్రాన్ని ఒప్పించి రామ గుండం ఎయిర్​పోర్ట్ సాధిస్తాం’’అని వంశీకృష్ణ అన్నారు. రామగిరి ఖిల్లాను టూరిస్ట్ హబ్ గా మారుస్తామని, తాజాగా రోప్ వే కూడా శాంక్షన్ అయిందని, రూ.5 కోట్ల ఫండ్ తో ఖిల్లాను డెవలప్ చేయడానికి ప్రయత్నా లు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో దిశ కమిటీ మెంబర్ సయ్యద్ సజ్జాద్, రమేశ్ గౌడ్, సదానందం, ఐలయ్యయాదవ్, శ్రీనివాస్, సతీష్, సంతోష్, కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.