కొత్త డీపీఆర్ ఓకే.. అయినా ఆటంకాల అడ్డుగోడ

కొత్త డీపీఆర్ ఓకే..  అయినా ఆటంకాల అడ్డుగోడ
  • 2021లో రూ.12 కోట్ల డీపీఆర్ పంపిన పాలకవర్గం
  •  ప్రతిపక్షాల ఆరోపణలతో సర్కార్ ​రిజెక్ట్
  •  కొత్త డీపీఆర్ రూ.5.85 కోట్లకు ఓకే
  •  అయినా ప్రారంభం కాని భవన నిర్మాణ పనులు 
  • పార్కింగ్ లేకుండా బిల్డింగ్ ఎలా అంటూ సాగదీత 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి మున్సిపల్ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందని ఆశించిన ప్రజలకు మరోసారి నిరాశే ఎదురవుతోంది. కొత్త డీపీఆర్ రూ.5.85 కోట్లతో ఆమోదం లభించినా, నిర్మాణం విషయంలో పెద్దపల్లి మున్సిపల్ అధికారులు, స్థానిక లీడర్లు మరోసారి అడ్డుపుల్ల వేశారు. పార్కింగ్ స్థలం లేకుండా బిల్డింగ్ కడితే ఎలా అని సందేహాలు వెలిబుచ్చుతున్నారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ అధికారులు.. మున్సిపాలిటీ క్యాంపస్​లోని ఆర్అండ్ బీ, లైబ్రరీ బిల్డింగ్​లను కూల్చేసి, ఆ స్థలాన్ని కూడా తీసుకున్నట్లయితే పార్కింగ్​కు ఇబ్బంది ఉండదనే ప్రపోజల్ తీసుకొచ్చారు. వెంటనే రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ, విద్యాశాఖకు దరఖాస్తు పెట్టారు. దీనికి క్లియరెన్స్ వచ్చే వరకు మరెన్ని ఏండ్లు పడుతుందోనని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. 

2016లోనే శంకుస్థాపన..

పెద్దపల్లిలో మున్సిపల్ బిల్డింగ్​ కోసం 2016లోనే శంకుస్థాపన చేశారు. నిర్మాణం కోసం అధికారులు రూ.3.85 కోట్లతో డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించింది. వెంటనే మున్సిపాలిటీ అధికారులు ఆగమేఘాల మీద పాత బిల్డింగ్​ను కూల్చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బిల్డింగ్ నిర్మాణలో అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి.

అప్పుడు అలా ఆగింది..

గత మున్సిపల్ పాలకవర్గానికి, ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డికి పడకపోవడంతోనే మున్సిపల్​బిల్డింగ్​ విషయంలో సాగతీత జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ లోపు 2018 ఎన్నికలొచ్చాయి. ఎమ్మెల్యేగా మరోసారి మనోహర్​రెడ్డి గెలిచారు. మున్సిపల్ పాలకవర్గం కూడా కొత్తది ఏర్పాటైంది. ప్రస్తుత పాలక వర్గంలో పాత వారెవరూ లేరు. అలాగే మున్సిపల్ చైర్ పర్సన్​గా ఎమ్మెల్యే కోడలు మమతారెడ్డిని ఏకగ్రీవం చేశారు. ఈ క్రమంలోనే బల్దియా బిల్డింగ్ నిర్మాణం రెండోసారి తెరమీదకొచ్చింది. పాత డీపీఆర్​ని రద్దు చేసి కొత్త డీపీఆర్ కి శ్రీకారం చుట్టారు. 2021లో కొత్త డీపీఆర్ రూ.12 కోట్లతో ప్రభుత్వానికి పంపించినట్లు తెలిసింది. రూ.3.85 కోట్లతో ఉన్న డీపీఆర్ రూ.12 కోట్లకు చేరుకోవడాన్ని ప్రతిపక్షాలు విమర్శించగా.. ప్రభుత్వం డీపీఆర్​ను రిజెక్ట్ చేసింది. దీంతో మరోసారి రూ.5.85 కోట్లతో డీపీఆర్ పంపించగా సర్కార్ ఆమోదించింది.

రూ.3.85 కోట్లు ఏమయ్యాయో?

ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పెద్దపల్లి నగర పంచాయతీని మున్సిపాలిటీగా అప్​గ్రేడ్ చేశారు. అనంతరం 2016 ఏప్రిల్​లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పెద్దపల్లి పర్యటనలో భాగంగా పెద్దపల్లి మున్సిపల్ బిల్డింగ్​కు భూమి పూజ చేశారు. అలాగే పెద్దపల్లి అభివృద్ధి కోసం రూ.50 కోట్లు మంజూరు చేశారు. రూ.50 కోట్లను వివిధ అభివృద్ధి పనుల కోసం పాత పాలకవర్గం కేటాయింపులు చేసింది. అందులో భాగంగా మున్సిపల్​ బిల్డింగ్ కోసం రూ.3.85 కోట్లతో డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. కాంట్రాక్టు కేటాయింపులు కూడా జరిగాయి. అయితే నిర్మాణం మాత్రం జరుగలేదు. కేటాయించిన రూ.3.85 కోట్లు ఏమయ్యాయో క్లారిటీ లేదు. ఇటీవల ప్రతిపక్ష కౌన్సిలర్లు పలు మార్లు నిధులన్నీ ఇతర పనులకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి తీర్మానాలు లేకుండా మున్సిపాలిటీపై ఎమ్మెల్యే ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అభివృద్ధి పనులు చేయడానికి ఫండ్స్ లేవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ బిల్డింగ్ నిర్మాణాన్ని సాగదీస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

పార్కింగ్ స్థలం కోసమే వెయిటింగ్

మున్సిపల్ బిల్డింగ్​కు శంకుస్థాపన జరిగిన ప్రదేశంలోనే నిర్మాణం చేపడుతాం. గతంలో నిర్ణయించిన విధంగా కాకుండా బిల్డింగ్ రీడిజైన్ చేశాం. ప్రస్తుతం రీ డిజైనింగ్​లో జీ ప్లస్ ఫోర్ తో డీపీఆర్ చేశాం. కాబట్టి నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగింది. పార్కింగ్ స్థలం కోసం ఆర్అండ్ బీ, లైబ్రరీ స్థలాలను అడిగాం. అది క్లియర్​ కాగానే కన్ స్ట్రక్షన్ ప్రారంభమవుతుంది.

- తిరుపతి, మున్సిపల్ కమిషనర్, పెద్దపల్లి