
పెద్దపల్లి, వెలుగు : ఆటోలో ప్రయాణికులు మర్చిపోయిన గోల్డ్, నగదు బ్యాగును గంటలోనే బాధితులకు పోలీసులు అందజేశారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ ను అభినందించారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గణేశ్‌నగర్‌కు చెందిన అశోక్‌రెడ్డి తన భార్యతో కలిసి హైదరాబాద్ వెళ్లేందుకు బస్టాండ్ వద్దకు ఆటో ఎక్కారు. తమ వెంట15 తులాల గోల్డ్, రూ.1 లక్ష నగదు బ్యాగును తీసుకెళ్తుండగా.. ఆటోలోనే మర్చిపోయి దిగారు.
బస్టాండ్ లోపలికి వెళ్లిన అశోక్ రెడ్డి తర్వాత చూసుకోగా బ్యాగు కనిపించలేదు. వెంటనే పెద్దపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ గజ్జి కృష్ణ సిబ్బందిని ఎంక్వైరీకి పంపించారు. అశోక్ రెడ్డి ఇంటి వద్ద ఆటో ఎక్కినప్పటి నుంచి దిగిన దాకా రోడ్డుపైన సీసీ ఫుటేజ్ లను చెక్ చేశారు. అప్పటికే ఆటో డ్రైవర్ బ్యాగును బాధితులకు ఇచ్చేందుకు వెళ్తున్నాడు. మార్గ మధ్యలో పోలీసులకు డ్రైవర్ బ్యాగును అప్పగించి నిజాయితీ చాటుకోగా అభినందించారు.