సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మహిళ బీసీ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ గ్రామానికి చెందిన పలువురు లీడర్లు, అభ్యర్థులు శనివారం తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిరసనకు దిగారు. వేరే సామాజిక వర్గానికి చెందిన ఆమె కన్వర్టెడ్ క్రిస్టియన్ గా బీసీ (సి)సర్టిఫికెట్ తో నామినేషన్ వేశారని ఆరోపించారు.
అనంతరం తహసీల్దార్ వద్దకు వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చిలుక స్రవంతికి జారీ చేసిన బీసీ (సి) సర్టిఫికెట్ రద్దు చేయాలని అభ్యర్థులు గుండా తిరుమల, ఉట్కూరు భూలక్ష్మి, ఉట్కూరి తిరుమల, గుండా మురళి, కొమురయ్య, శ్రీనివాస్ గౌడ్, నేతలు కర్క శంకర్ రెడ్డి, కాదాసి చంద్రమౌళి, రామచంద్రారెడ్డి, బొంగోని శంకరయ్య డిమాండ్ చేస్తూ.. తహసీల్దార్ కు వినతిపత్రం అందించారు.
దీనిపై ఇన్ చార్జ్ తహసీల్దార్ సిరిపురం గిరి వివరణ ఇస్తూ.. అభ్యర్థి స్రవంతి కన్వర్టెడ్ క్రిస్టియన్ గా మారినట్టు అందజేసిన ఆధారాలు పరిశీలించి విచారణ జరిపిన రూల్స్ మేరకే బీసీ (సి) సర్టిఫికెట్ జారీ చేసినట్టు స్పష్టత ఇచ్చారు.
