నామినేటెడ్ ​పోస్టులపై ఆశలు..హైదరాబాద్‌‌‌‌కు చక్కర్లు కొడుతున్న పెద్దపల్లి జిల్లా లీడర్లు

నామినేటెడ్ ​పోస్టులపై ఆశలు..హైదరాబాద్‌‌‌‌కు చక్కర్లు కొడుతున్న పెద్దపల్లి జిల్లా లీడర్లు
  •     నెలాఖరులోపు నామినేటెడ్​పోస్టుల భర్తీకి చాన్స్​
  •     ఏదో ఓ పోస్ట్​ దక్కించుకోవాలని లీడర్ల ప్రయత్నాలు 
  •     అధికారం లేకపోయినా పార్టీలో ఉన్నామని హైకమాండ్‌‌‌‌కు విన్నపాలు 
  •     మంత్రులు, ఎమ్మెల్యేలను కాకా పడుతున్న ఆశావహులు

పెద్దపల్లి, వెలుగు: నామినేటెడ్ ​పోస్టులపై పెద్దపల్లి జిల్లా లీడర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈక్రమంలో జిల్లా లీడర్లు హైదరాబాద్‌‌‌‌కు చక్కర్లు కొడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నిస్తున్నారు.  అధికారంలో లేకపోయినా పదేళ్లు పార్టీలోనే ఉన్నామని, ఈసారి ఎలాగైనా నామినేటెడ్​ పోస్టు ఇప్పించాలని హైకమాండ్​, ప్రధాన లీడర్ల చుట్టూ తిరుగుతున్నారు.

ఇటీవల సీఎం రేవంత్‌‌‌‌రెడ్డికి సలహాదారులుగా కొంతమందిని నియమించగా ఆశావహుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. మరోవైపు గత బీఆర్ఎస్​ సర్కార్‌‌‌‌‌‌‌‌లో పెద్దపల్లి జిల్లాకు కీలక పోస్టులు దక్కగా, ఈసారి కూడా అదే సెంటిమెంట్​వర్కౌట్​అయితే తమకు ఏదో ఒక పోస్టు దక్కే చాన్స్​ ఉందని భావిస్తున్నారు.  దీంతో పలువురు హైదరాబాద్‌‌‌‌లోనే మకాం పెట్టారు.  

గతంలో కీలక పోస్టులు 

బీఆర్ఎస్​ సర్కార్​హయాంలో పెద్దపల్లి జిల్లాకు కీలక పోస్టులు దక్కాయి. ప్రెస్​అకాడమీ చైర్మన్​, ఫిషరీస్​, ఆర్టీసీ, పోలీస్​హౌజింగ్ బోర్డు, టీఎస్‌‌‌‌పీఎస్‌‌‌‌సీ, బుద్ధవనం ట్రస్టు, ఐడీసీ తదితర పోస్టులు పెద్దపల్లి జిల్లా లీడర్లకు దక్కాయి. ఈక్రమంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాగానే ఆయా నామినేటెడ్​ పోస్టుల కోసం సీనియర్​ నాయకులతోపాటు యువ లీడర్లు సైతం హైకమాండ్‌‌‌‌ వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. పదేళ్లుగా పార్టీ కోసం కష్ట పడ్డ వారికే నామినేటెడ్​ పోస్టులు ఇవ్వాలని కోరుతున్నారు.  అయితే టికెట్​ఆశించి రాకపోయినా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన నాయకులకు ప్రాధాన్యమివ్వాలని హైకమాండ్​ భావిస్తున్నట్లు సమాచారం.  

ఈక్రమంలో ఇప్పటికే పెద్దపల్లికి చెందిన పలువురు నాయకుల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఉద్యమకారులు సైతం సీఎంను కలిసి విన్నవించారు. ఎన్ఎయూఐ నుంచి బల్మూరి వెంకట్‌‌‌‌కు ఎమ్మెల్సీ ఇవ్వడంతో మరికొంతమంది రాష్ట్ర లీడర్లు సైతం ఆశతో ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్​ అనుబంధ  సింగరేణి కార్మిక సంఘం ఐఎన్​టీయూసీకి చెందిన లీడర్లు కూడా పార్టీ పెద్దలను కలిశారు. 

మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు 

నామినేటెడ్​ పోస్టులు ఆశిస్తున్న నాయకులు జిల్లా మంత్రి శ్రీధర్​బాబుతోపాటు ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఠాకూర్​ మక్కాన్​సింగ్​ చుట్టూ తిరుగుతున్నారు. మంత్రితోపాటు ఎమ్మెల్యేలు తమ గెలుపు కోసం పనిచేసిన నాయకులకు ఎలాగైనా నామినేటెడ్ పోస్టులు ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే కొంతమంది నాయకులు డైరెక్ట్​గా హైకమాండ్‌‌‌‌తో కలిసినట్లు సమాచారం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నుంచి రాష్ట్ర స్థాయి ఎన్ఎస్‌‌‌‌యూఐ, యువజన కాంగ్రెస్​ పదవులు నిర్వహించిన నాయకులున్నారు.

వారు కూడా నామినేటెడ్​ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. పెద్దపల్లి  నియోజకవర్గంలో ఎమ్మెల్యే విజయరమణారావుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న నాయకులు నామినేటెడ్​ పోస్టు తనకే వస్తుందని ఆశతో ఉన్నారు.  మంథని నుంచి మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఆశావహులు నమ్మకంతో ఉన్నారు.