కేసీఆర్ వద్దన్నడు..రేవంత్ ముద్దన్నడు..

కేసీఆర్ వద్దన్నడు..రేవంత్ ముద్దన్నడు..

పార్టీ మారిన వెంటనే టికెట్ తెచ్చుకున్న మేయర్ అభ్యర్థి

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ

పీర్జాదిగూడ టీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైంది. టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. పీర్జాదిగూడ మేయర్ టికెట్ ఆశిస్తూ టీఆర్ఎస్ నాయకుడు దర్గా దయాకర్ రెడ్డి గురువారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. కానీ, టీఆర్ఎస్ అధినాయకత్వం దయాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అంతేకాకుండా ఆయనకు సీఎం కేసీఆర్ నుంచి ఎటువంటి హామీ లభించలేదు. దాంతో దయాకర్ రెడ్డి అలిగి వెళ్లిపోయారు. ఈ రోజు ఆయన ఇంటికి కాంగ్రెస్ లీడర్, ఎంపీ రేవంత్ రెడ్డి వెళ్లారు. రేవంత్ రెడ్డి సమక్షంలో దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దయాకర్ రెడ్డి పార్టీలో చేరిన వెంటనే, రేవంత్ రెడ్డి ఆయనకు బీ ఫామ్ స్వయంగా అందజేశారు. అంతేకాకుండా పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను కూడా దయాకర్ రెడ్డికే అప్పగించారు. రేవంత్ సమక్షంలో దయాకర్ రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మంత్రి మల్లారెడ్డి గెలుపులో దయాకర్ రెడ్డి కీలకపాత్ర

పీర్జాదిగూడ నాయకుడు దర్గా దయాకర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఎన్నికల సమయంలో పీర్జాదిగూడ బాధ్యతలు తీసుకొని ఇంటిఇంటికి తిరిగి మల్లారెడ్డిని గెలిపించాలని కోరారు. దయాకర్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని కష్టపడుతున్నారు. నమ్ముకున్న వారికి టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం సరికాదని దయాకర్ రెడ్డి అనుచరులు అంటున్నారు.

సేవ చేస్తే నాయకులవుతారుగానీ..

పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. సీనియర్లను పట్టించుకోని టీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక గుణపాఠం అవుతుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా డబ్బులతో రాజకీయం చేయాలని అనుకునే వాళ్లకు కనువిప్పు కలగాలని ఆయన అన్నారు. ప్రజలకు సేవ చేస్తే నాయకులవుతారుగానీ, డబ్బులు ఖర్చు చేస్తే నాయకులు కారని ఆయన అన్నారు.