పీలే ఆట కోసం యుద్ధం ఆగింది

పీలే ఆట కోసం యుద్ధం ఆగింది

పీలే..సాకర్ దిగ్గజం. మెస్సీ, రొనాల్డో, నెయ్ మార్ జూనియర్ లాంటి దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్లకే ఆరాధ్య ఫుట్బాల్ ప్లేయర్ పీలే. సాకర్ అంటే గుర్తుకు వచ్చేది పీలే పేరు. అంతలా తనదైన ముద్ర వేశాడు. దాదాపు 20 ఏళ్ల పాటు..ఫుట్బాల్ క్రీడలో ప్రేక్షకులను అలరించాడు. మూడు వరల్డ్ కప్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు..ప్రపంచ ఫుట్బాల్లోనే అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. 

పీలే అసలు పేరు..

1940 అక్టోబర్ 23న పీలే జన్మించాడు. అతని అసలు పేరు ఎడిసన్‌ అరాంట్స్‌ డో నాసిమియాంటో.  అమెరికా సైంటిస్ట్  థామస్‌ ఆల్వా ఎడిసన్‌పై ఉన్న ప్రేమతో అతని తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారు. పీలే అనే పేరు స్కూళ్లో  నిక్‌ నేమ్‌. స్కూల్లో వాస్కోడాగామా ఫుట్‌బాల్‌ జట్టు గోల్‌కీపర్‌ బైల్‌  పీలే ఫేవరెట్‌ ఆటగాడు. అయితే బైల్‌ పేరును పీలే గా తప్పుగా పలికేవాడు. దాంతో క్లాస్‌మేట్స్‌ అతడిని పీలేగా పిలవడం ప్రారంభించారు. అలా పీలేకి ఆ పేరు వచ్చింది.కాలాక్రమేణా అదే అతని పేరుగా స్థిరపడింది. పీలే కుటుంబ అత్యంత పేద కుటుంబం. అతని తండ్రి డాండినో కూడా ఫుట్‌బాలర్‌ కావడంతో పీలేకు ఫుట్ బాల్ పై ఆసక్తి పెరిగింది. బౌరు పట్టణంలో పెరిగిన పీలే పేదరికాన్ని అధిగమించేందుకు చిన్నతనంలో చాయ్‌ దుకాణంలో సర్వర్‌గా పనిచేశాడు. అయితే ఫుట్బాల్పై ఉన్న ప్రేమతో..సాక్సులో పేపర్లు నింపి బాల్గా చేసుకుని ఫుట్బాల్ ఆడేవాడు. చిన్నతనంలో అనేక ఫుట్‌బాల్‌ క్లబ్‌లకు ఆడాడు. తొలిసారిగా రేడియం  అనే స్థానిక ఇండోర్‌ ఫుట్‌బాల్‌ టీమ్లో చోటు దక్కించుకున్నాడు. 14 ఏళ్ల వయసులోనే సీనియర్లతో ఆడాడు. ఇండోర్‌ ఫుట్‌బాల్‌లో ప్లేయర్లతో ఆడటం ఒక సవాల్.  మెరుపు వేగంతో బంతిని గోల్ పోస్టులోకి పంపాల్సి ఉంటుంది. దీంతో పీలే  రాటుదేలిపోయాడు. అదే ఏడాది డాది పీలే జట్టు ఇండోర్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌ షిప్‌ను  గెలుచుకొంది. ఆ టోర్నీలో పీలే 15 గోల్స్‌ చేయడం విశేషం.  1961, 62,63,64, 65, 1968లో ఆరుసార్లు తన క్లబ్ కు బ్రెజిల్ లీగ్ టైటిల్ ను అందించాడు. తన కెరీర్ లో న్యూయార్స్ కాస్మోస్ తరపున రెండేళ్లు యూఎస్ లో ఫుట్ బాల్ ఆడాడు.

తొలి వరల్డ్ కప్లోనే బ్రెజిల్ను విజేతగా నిలిపాడు..

పీలే 15 ఏళ్ల వయసులో తొలి లీగ్ మ్యాచ్ ఆడాడు. 1956లో పీలేను  చిన్ననాటి కోచ్‌ డి బ్రిటో  శాంటోస్‌ నగర ఫుట్‌బాల్‌ క్లబ్‌కు పరిచయం చేశాడు. 1957 లీగ్‌ సీజన్‌లో అత్యధిక గోల్స్ చేసి బ్రెజిల్‌ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 16 ఏళ్ల వయసులోనే  తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన పీలే..ఫస్ట్ మ్యాచ్లోనే గోల్‌ సాధించాడు. దీంతో బ్రెజిల్‌ తరఫున అతిపిన్న వయసులో గోల్‌ చేసిన ఆటగాడిగా పీలే నిలిచాడు. 1958 ఫిఫా వరల్డ్ కప్లో బ్రెజిల్ తరపున ఆడిన పీలే...జట్టును విజేతగా నిలిపాడు. మోకాలి గాయంతోనే స్వీడన్కు చేరుకున్న పీలే..మూడో మ్యాచ్‌ సమయానికి కోలుకుని బరిలోకి దిగాడు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో తొలి ప్రపంచకప్‌ గోల్‌ సాధించాడు. సెమీస్‌లో ఏకంగా హ్యాట్రిక్‌ గోల్స్ కొట్టాడు.  ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ నమోదు చేసిన కుర్రఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు ఫైనల్లో రెండు గోల్స్‌ చేసి బ్రెజిల్‌ను విన్నర్ గా నిలిపాడు. తన కెరీర్ లో నాలుగు ప్రపంచకప్‌లలో బ్రెజిల్ కు తరపున ఆడిన పీలే 1958, 1962, 1970లలో ప్రపంచకప్‌లు అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క ఆటగాడిగా పీలే చరిత్ర సృష్టించాడు.  అయితే 1966లోనే ఫుట్బాల్కు వీడ్కోలు పలకాలని అనుకున్నా... మళ్లీ జట్టులోకి వచ్చి 1970 వరల్డ్ కప్లో ఆడాడు. ఆ వరల్డ్ కప్లో జట్టును మరోసారి విజేతగా నిలిపాడు.  ఉత్తమ ఆటగాడిగా గోల్డెన్ బాల్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక 1971లో యుగోస్లేవియాతో  చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. మొత్తంగా ఫిఫా ప్రపంచకప్‌లలో పీలే 14 మ్యాచుల్లో 12 గోల్స్ సాధించాడు. 

పిలే ఆట కోసం యుద్ధం ఆగింది
పీలే ఆటను చూసేందుకు 1969లో నైజీరియాలో జరిగిన అంతర్యుద్ధం 48 గంటల పాటు ఆగిపోయింది. ఆ ఏడాది సావోపోలో క్లబ్‌ శాంటోస్‌, నైజీరియాకు చెందిన స్టేషనరీ స్టోర్స్‌ ఎఫ్‌సీ మధ్య ఓ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ లాగోస్‌లో జరిగింది. నైజీరియాలో ఆ సమయంలో భీకరమైన అంతర్యుద్ధం జరుగుతోంది. కానీ పీలే మ్యాచ్‌ చూసేందుకు రెండు వర్గాలు 48 గంటలపాటు యుద్ధాన్ని ఆపేశాయి. ఆ  మ్యాచ్‌ 2-2తో డ్రా అయింది.

ఒకే ఏడాదిలో 126 గోల్స్..

1959లో పీలే 126 గోల్స్‌ కొట్టి రికార్డు సృష్టించాడు.  కెరీర్‌ మొత్తంలో పీలే 1,363 మ్యాచ్‌లు ఆడాడు. 1,281 గోల్స్‌ సాధించాడు. అధికారికంగా ఆడిన 831 మ్యాచ్‌ల్లో 767 గోల్స్‌ చేశాడు. 1999లో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ  అథ్లెట్‌ ఆఫ్‌ ది సెంచరీ అవార్డును పీలే అందుకున్నాడు. ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఫుట్‌బాల్‌ వరల్డ్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌  వరల్డ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సెంచరీ అవార్డు పీలేను వరించింది. 2000 ఏడాదిలో డీగో మారడోనాతో కలిసి ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది సెంచరీ అవార్డు కూడా దక్కించుకున్నాడు.