
హైదరాబాద్/ముషీరాబాద్, వెలుగు: సిటీలోని ఫుట్‌పాత్‌ల పరిస్థితిపై సీపీ సీవీ ఆనంద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫుట్‌పాత్‌లు ఉన్నా వాటిపై నిర్మాణాల కారణంగా నడవడానికి వీలులేకుండా ఉన్నాయన్నారు. ఫుట్‌పాత్‌లపై దుకాణాలు, చెట్లు, టాయిలెట్లు ఉండటంతో పాదచారులు నడవలేకపోతున్నారని పేర్కొన్నారు. దీంతో రోడ్డుపై నడుస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని, వాటిని నివారించేందుకు సిటీలో పెలికాన్(పాదచారుల కోసం) సిగ్నళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ట్యాంక్‌బండ్‌పై పెలికాన్ సిగ్నల్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాదచారుల ప్రాణాలు కాపాడేందుకు అధునాతన పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేశామన్నారు. సిటీలో చాలా మందికి ట్రాఫిక్ రూల్స్, ప్రమాదాల నివారణపై అవగాహన లేదన్నారు. ట్రాఫిక్ పోలీసులు, వలంటీర్లు సిగ్నల్స్ వద్ద అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉన్నప్పటికీ నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని సిటిజన్లు ఉపయోగించుకోవడం లేదన్నారు. ఇలాంటి ప్రాంతాల్లోనూ రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నారని వాపోయారు. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 121 మంది పాదచారులు చనిపోయినట్లు చెప్పారు. సిటిజన్లు రోడ్డు దాటేందుకు పెలికాన్ సిగ్నల్స్ ఉపయోగపడతాయని చెప్పారు. కార్యక్రమంలో ట్రాఫిక్ చీఫ్ సుధీర్‌బాబు, ట్రాఫిక్ డీసీపీలు పాల్గొన్నారు.