T20 World Cup 2026: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దూరం.. వరల్డ్ కప్‌కు డౌట్

T20 World Cup 2026: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా  స్టార్ ఆల్ రౌండర్ దూరం.. వరల్డ్ కప్‌కు డౌట్

స్వదేశంలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ దగ్గర పడుతున్న సమయంలో టీమిండియాకు గాయాల సమస్యలు కలవరపెడుతున్నాయి. స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ గాయంతో వరల్డ్ కప్ ఆడతాడో లేదో చెప్పలేని పరిస్థితి. ఈ లిస్ట్ లో మరో క్రికెటర్ చేరిపోయాడు. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా వరల్డ్ ఆడడం అనుమానంగా మారింది. న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో గాయపడిన సుందర్.. ఈ క్రమంలో వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. తాజాగా ఈ స్పిన్ ఆల్ రౌండర్ కోలుకునే అవకాశాలు కనిపించకపోవడంతో న్యూజిలాండ్ తో జరగనున్న ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. 

జనవరి 21న నాగ్‌పూర్‌లో ప్రారంభం కానున్న సిరీస్‌కు ఈ స్పిన్ ఆల్ రౌండర్ కోలుకోలేడని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో సిరీస్ కివీస్ తో జరగబోయే ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు అధికారికంగా దూరమయ్యాడు. "సైడ్ స్ట్రెయిన్ కారణంగా వాషింగ్టన్ సుందర్‌ను న్యూజి లాండ్ తో జరగబోయే టీ20 సిరీస్‌కు దూరం అయ్యాడు". అని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు. ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే.. సుందర్ వరల్డ్ కప్ ఆడడం కూడా కష్టమని తెలుస్తోంది. పక్కటెముకలు గాయంతో ఇబ్బంది పడుతున్న సుందర్ పూర్తిగా కోలుకోవడానికి నాలుగు నుంచి ఐదు వారాల పాటు రెస్ట్ అవసరం కావొచ్చు. అదే జరిగితే సుందర్ ను రీప్లేస్ చేయడం కష్టం. 

తొలి వన్డే ఆడుతూ సుందర్ కు గాయం:
  
ఆదివారం (జనవరి 11) వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో సుందర్ బౌలింగ్ చేస్తూ అసౌకర్యానికి గురయ్యాడు. 5 ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులు ఇచ్చి మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 8వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. మ్యాచ్ తర్వాత సుందర్ కు ఎడమ పక్కటెముకలు గాయం అయినట్టు తేలింది. సుందర్ కు సైడ్ స్ట్రెయిన్ ఉందని మ్యాచ్ తర్వాత స్కాన్ కోసం వెళ్తాడని మ్యాచ్ తర్వాత కెప్టెన్ గిల్ తెలిపాడు. 

ఈ టూర్ లో టీమిండియా ప్లేయర్లకు గాయాల బెడద కొనసాగుతూనే ఉంది. తొలి వన్డేకు ముందు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడి సిరీస్ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. అంతకముందు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ గజ్జల్లో గాయం కారణంగా కివీస్ తో జరగబోయే తొలి మూడు టీ20లకు దూరమయ్యాడు.