టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదిరి జంటగా కలిసి నటించిన చిత్రం 'అనగనగా ఒక రాజు' . భారీ అంచనాలతో జనవరి 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేంది. సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాలతో పోటీపడుతూ.. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. 'జాతి రత్నాలు' సినిమాతో బాక్సాఫీస్ వద్ద నవ్వుల రికార్డు సృష్టించిన నవీన్.. మరో సారి ప్రేక్షకులను తన వినోదంతో మెప్పిస్తున్నారు.
మొదటి రోజు ఎన్ని కోట్లంటే?
విడుదలైన తొలి రోజు నుంచే 'అనగనగా ఒక రాజు' కామెడీ ఎంటర్టైనర్ మూవీగా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ కు సొంతం చేసుకుంది. సంక్రాంతి బరిలో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు భారీ సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ, 'రాజు' గారు తన సత్తా చాటారు. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 22 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. షేర్ రూపంలో చూసుకుంటే దాదాపు రూ. 12 కోట్లకు పైగా సాధించినట్లు సమాచారం. నవీన్ పొలిశెట్టి కెరీర్‌లోనే ఇది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
కథా నేపథ్యం
రాజు (నవీన్ పొలిశెట్టి) ఒక జమీందారు మనవడు. కానీ అతని తాత ఆస్తులన్నీ తన గర్ల్‌ఫ్రెండ్స్‌కు రాసిచ్చేసి, మనవడికి కేవలం 'జమీందారు' అనే పేరు మాత్రమే మిగులుస్తాడు. చిల్లి గవ్వ లేకపోయినా రాయల్టీ మాత్రం తగ్గని రాజు, తన బంధువుల పెళ్లిలో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక.. ఏడు తరాలు గుర్తుండిపోయేలా పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు. ఈ క్రమంలోనే ఒంటి నిండా బంగారంతో మెరిసిపోయే చారులత (మీనాక్షీ చౌదరీ)ను చూసి, ఆమెను పెళ్లి చేసుకుంటే తన లైఫ్ సెటిల్ అయిపోతుందని భావించి ప్రేమలో దించుతాడు. కానీ, పెళ్లయిన తర్వాత తెలిసిన ఒక చేదు నిజం రాజు జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే చిత్ర ప్రధాన ఇతివృత్తం.
వన్-మ్యాన్ షో.. నవీన్ మార్కు కామెడీ!
ఈ సినిమాకు ప్రధాన బలం నవీన్ పొలిశెట్టి టైమింగ్. ఈ చిత్రానికి స్వయంగా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన నవీన్, ప్రతి సీన్‌లోనూ తన వన్ లైనర్స్‌తో థియేటర్లను హోరెత్తించారు. ఫస్ట్ హాఫ్ అవుట్ అండ్ అవుట్ కామెడీతో సాగిపోగా, సెకండ్ హాఫ్‌లో కాస్త కంప్లైంట్స్ ఉన్నప్పటికీ, నవీన్ - మీనాక్షీ చౌదరీల కెమిస్ట్రీ సినిమాను నిలబెట్టింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , శ్రీకర స్టూడియోస్ నిర్మాణ విలువలు సినిమాకు సంక్రాంతి శోభను అద్దాయి.
సంక్రాంతి విన్నర్?
నైజాం, ఆంధ్రా అనే తేడా లేకుండా అన్ని చోట్లా 'అనగనగా ఒక రాజు' మంచి ఆక్యుపెన్సీతో దూసుకుపోతోంది. "రాజుగారు అసలైన సంక్రాంతి సంబరాలు తెచ్చేశారు.. ఇంటిళ్లి పాది నవ్వుల సునామీ తెచ్చారు అంటూ మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లాంగ్ వీకెండ్ కావడం, పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో రానున్న రోజుల్లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
