
రొటో మ్యాక్ పెన్నులు చాలా ఫేమస్. ఈ పెన్నులను తయారుచేసే కంపెనీ ‘రొటో మ్యాక్ గ్లోబల్’ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కంపెనీ, దానిలోని డైరెక్టర్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును దాదాపు రూ.750 కోట్ల మేర మోసం చేసినట్లు సీబీఐ అభియోగాలను దాఖలు చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని ఏడు బ్యాంకుల కన్సార్టియానికి ‘రొటో మ్యాక్ గ్లోబల్’ కంపెనీ దాదాపు రూ.2,919 కోట్ల రుణ బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపింది. ఇందులో 23 శాతం లోన్స్ ను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి కంపెనీ తీసుకుందని సీబీఐ పేర్కొంది. ఈనేపథ్యంలో కంపెనీ డైరెక్టర్లు సాధనా కొఠారి, రాహుల్ కొఠారి లపై ఐపీసీ 120బీ, 420 సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేశారు.
రూ.26వేల కోట్ల సేల్స్ కేవలం వారికేనట..
2012 జూన్ 28న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఈ కంపెనీకి రూ.500 కోట్ల విలువైన నాన్ ఫండ్ బేస్డ్ క్రెడిట్ లిమిట్ ను మంజూరు చేసింది. అయితే ఆ నిధులను వినియోగించుకొని తిరిగి బ్యాంకుకు చెల్లించకపోవడంతో.. 2016 జూన్ 30న ఆ అకౌంట్ ను నిరర్ధక ఆస్తి (ఎన్పీఏ) గా ప్రకటించారు. కంపెనీకి చెందిన విదేశీ వ్యాపార లావాదేవీల అవసరాల నిమిత్తం తాము రూ.743 కోట్ల విలువ చేసే 11 లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ)ను జారీ చేశామని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు తెలిపింది. ఇంకా రూ.750 కోట్ల రుణబకాయిలను రొటో మ్యాక్ గ్లోబల్ కంపెనీ తమకు చెల్లించాల్సి ఉందని బ్యాంకు వివరించింది. కంపెనీ జరిపిన మొత్తం సేల్స్ లో 92 శాతం (రూ.26,143 కోట్లు) ఒకే వ్యక్తికి చెందిన వ్యాపార సంస్థలోని నాలుగు వేర్వేరు టీమ్ లకు జరిపినట్లు సీబీఐ తెలిపింది.
రొటో మ్యాక్ ప్రస్థానం ఇదీ..
రొటో మ్యాక్ కంపెనీ అధినేత విక్రమ్ కొఠారి. ఆయన 1992లో ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కేంద్రంగా రొటో మ్యాక్ పెన్నుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. విక్రమ్ తండ్రి మాన్షుక్‌భాయ్ గుజరాత్ నుంచి కాన్పూర్ కు వలస వచ్చి.. దుకాణాలకు కొబ్బరి నూనె సరఫరా చేసే వ్యాపారం చేసేవారు. 1973 నుంచి పాన్ పరాగ్ పాన్ మసాలా అమ్మకాలతో బడా వ్యాపారిగా ఎదిగారు. మొదట్లో విక్రమ్ తన సోదరుడితో కలిసి పాన్ పరాగ్ వ్యాపారాన్ని చూసుకునేవారు. ఒకానొక టైంలో అప్పటి ప్రధాని చేతుల మీదుగా బెస్ట్ ఎక్స్‌పోర్టర్ అవార్డును కూడా విక్రమ్ కొఠారి అందుకున్నారు. అయితే కుటుంబ విభేదాలతో విక్రమ్ కొఠారి రొటొమాక్ కంపెనీ వ్యవహారాలకే పరిమితం అయ్యారు. 1995, -2005 సంవత్సరాల మధ్యకాలంలో రొటో మ్యాక్ పెన్నులు, స్టేషనరీ ఉత్పత్తుల వ్యాపారంతో దాదాపు వంద కోట్ల రూపాయల ఆదాయాన్ని విక్రమ్ కొఠారి ఆర్జించారు. దీంతో ఆయనకు ‘ఇండియాస్ పెన్ కింగ్’ అనే బిరుదు వచ్చింది. ఆ సమయంలో సల్మాన్ ఖాన్, రవీనా టాండన్‌లు రొటో మ్యాక్ బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరించేవాళ్లు.