
శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్స్‌పై పలు బాలల చిత్రాలు తెరకెక్కించిన భీమగాని సుధాకర్ గౌడ్ తాజాగా రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ‘ఆపద్భాంధవుడు’. పెంచల్ రెడ్డి, డి లీలావతి నిర్మించారు. పెంచల్ రెడ్డి, సుధాకర్ గౌడ్, ఝాన్సీ, ప్రతిమ, నాగేశ్వరరావు కీలక పాత్రల్లో నటించారు.
నందమూరి హరి ఎడిటర్ వర్క్ చేస్తుండగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ ‘పెంచల్ రెడ్డి జీవితం ఆధారంగా దీన్ని రూపొందించాం. ఇందులో తన పాత్రలో తానే నటించడం విశేషం. నేను ఆయన మిత్రుడిగా నటించాను. ఇది సజీవ పాత్రలతో సాగే షార్ట్ ఫిలిం. దీన్ని బయోపిక్‌లా, లైవ్‌గా, సరికొత్త పద్ధతిలో తెరకెక్కించాం.
ఈ లఘు చిత్రం ప్రేక్షకుల్లో, సమాజంలో చైతన్యం తీసుకొస్తుంది’అని చెప్పాడు. పెంచల్ రెడ్డి మాట్లాడుతూ ‘నేను చేసే సేవా కార్యక్రమాలు నాకు ఎంతో ఆత్మ సంతృప్తిని ఇస్తున్నాయి. నా జీవిత కథను సజీవ చిత్ర రూపంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సుధాకర్ గౌడ్‌కి థ్యాంక్స్’ అని చెప్పారు.