
- పూర్తిస్థాయి ప్రారంభానికి దగ్గర్లో మెగా టెక్స్‌టైల్ పార్క్
- మాస్టర్‌ప్లాన్‌కు ఆమోదం.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి అడుగులు
- భద్రకాళి ఆలయంలో మాడవీధులు, రాజగోపురాలు
- సిటీ చుట్టూ చకచకా ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ పనులు
- కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అభివృద్ధి వైపు సిటీ పరుగులు
వరంగల్, వెలుగు: ఓరుగల్లులో ఏండ్లకేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తూ, రూ.వందల కోట్ల నిధులు విడుదల చేస్తుండటంతో పనులు ఊపందుకుంటున్నాయి. ప్రాజెక్టులన్నీ పూర్తయితే నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణ వచ్చాక బీఆర్‍ఎస్ పదేండ్ల పాలనలోనూ జిల్లాకు చెందిన మేజర్ ప్రాజెక్టులు.. ఎన్నికల హామీలు, ప్రచారాలకే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ సర్కార్ రాగానే అవన్నీ ఒక్కొక్కటిగా ఊపందుకుంటున్నాయి.
ఓరుగల్లు ప్రజల 40 ఏండ్ల కల నెరవేరుతున్నది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వచ్చే ఏడాది మార్చిలో ఓపెనింగ్‍కు సిద్ధమవుతున్నది. కాజీపేట కేంద్రంగా 2010లో పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ (పీఓహెచ్), 2016లో వ్యాగన్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్‍గా అప్‍గ్రేడ్ అవగా.. దాని పనులకు 2023 జులై 8న ప్రధాని మోదీ వరంగల్ జిల్లా పర్యటనలో శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ రాగానే విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. దీంతో ఎట్టకేలకు గతేడాది నవంబర్ 28న కోచ్ ఫ్యాక్టరీకి కేంద్రం గ్రీన్‍సిగ్నల్ ఇచ్చింది. రూ.716 కోట్లతో మొదలుపెట్టిన నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. కోచ్‍లు, ఇంజిన్లు, వ్యాగన్లు ఇక్కడే తయారు చేయనున్నారు. దాదాపు 5 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 5 వేల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
మామునూరులో ఎగరనున్న విమానాలు..
ఓరుగల్లు ప్రజల ఏండ్ల తరబడి కలగా ఉన్న మామునూర్ ఎయిర్‍పోర్టులో విమానాలు ఎగరడం ఖాయమైంది. దాదాపు 30 ఏండ్లుగా రాజకీయ పార్టీలకు ఎన్నికల హామీగా వస్తున్న విమానాశ్రయం ఏర్పాటు.. కాంగ్రెస్ సర్కార్ ఆధ్వర్యంలో నెరవేరుతున్నది. ఇన్ని రోజులు దీనికి ఉన్న అడ్డంకులను అధిగమించడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. జీఎంఆర్ సంస్థతో ఉన్న 150 కిలోమీటర్ల నిబంధనను క్లియర్ చేయించడమే కాకుండా ఎయిర్‍పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి గ్రీన్‍సిగ్నల్ తీసుకురావడంలో విజయవంతమైంది. అంతేకాకుండా విమానాశ్రయ ఏర్పాటుకు రైతుల నుంచి 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్ల నిధులు విడుదల చేసింది. భూములిచ్చే రైతులతో పలుమార్లు గ్రామసభలు, సమావేశాలు నిర్వహించి..వారిని సైతం ఒప్పించింది. దీంతో త్వరలోనే ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
త్వరలో టెక్స్‌టైల్ పార్కులో ఉద్యోగాలు..
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ పనుల పేరుతో 2016లో దాదాపు 1,357 ఎకరాలు సేకరించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం.. 2017 అక్టోబర్‍లో పనులకు శంకుస్థాపన చేసింది. ఏడాదిలో పార్క్ పనులు పూర్తి చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా 65 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పింది. కానీ 2023లో అధికారం కోల్పోయే సమయం వరకు కూడా పనులు పూర్తి చేయలేదు. రైతులకు ఇస్తామన్న ప్లాట్లు, ఇండ్లు కేటాయించలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్ పార్కులోని కంపెనీల నిర్మాణ పనులను స్పీడప్ చేయగా.. భూములిచ్చిన 1,398 మంది రైతుల కోసం రాజీవ్‍గాంధీ టౌన్‍షిప్ ఏర్పాటు చేసి అందరికీ ప్లాట్లు కేటాయించింది. మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తున్నది. పార్క్‌లోని కైటెక్స్ కంపెనీ ఇప్పటికే 25 వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 4,170 కోట్లు
గ్రేటర్ వరంగల్ అభివృద్ధి కోసం మాస్టర్‍ప్లాన్ తీసుకొస్తామని నాటి బీఆర్ఎస్ సర్కార్ పదేండ్లు ఊరించింది. కానీ తేనేలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మాస్టర్ ప్లాన్‌కు ఆమోదముద్ర వేసింది. సిటీలో అండర్‍గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని ఎన్నికల టైమ్‌లో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పనుల కోసం ఏకంగా రూ.4,170 కోట్లు కేటాయించారు. 2057 నాటికి పెరగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని పనులకు శ్రీకారం చుట్టేలా అడుగులు పడ్తున్నాయి.
టూరిస్ట్ స్పాట్‍గా భద్రకాళి టెంపుల్
ఓరుగల్లు ఇలవేల్పుగా భావించే భద్రకాళి అమ్మవారి ఆలయంలో మాడవీధుల నిర్మాణం, రాజగోపురాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.30 కోట్లు కేటాయించింది. పనులు చకచకా నడుస్తున్నాయి. భద్రకాళి చెరువును సైతం పరిశుభ్రంగా ఉంచేలా దాదాపు రూ.10 కోట్లతో పూడికతీత పనులు చేపట్టారు. ఆలయం, చెరువు, పద్మాక్షి ఆలయం వైపు గుట్టలు ఉన్న నేపథ్యంలో .. దీన్ని టెంపుల్ కమ్ టూరిజం స్పాట్‍గా అభివృద్ధి చేయాలని భావించారు. మరో రూ.70 కోట్లతో చెరువు మధ్యలో ఐలాండ్స్ ఏర్పాటు చేయడమే కాకుండా చెరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జి వంటి నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్నారు. రూ.కోటి 20 లక్షలతో ఆలయంలో వేద పాఠశాల నిర్మిస్తున్నారు. ఇవేగాక అర్చకుల నివాసం, భోజనాల తయారీ గదులు తదితర కొత్త ప్రాజెక్టులు మొదలుపెడ్తున్నారు.
జీడబ్ల్యూఎంసీకి రూ.187 కోట్లు
గ్రేటర్ వరంగల్ సిటీ చుట్టూరా ఇన్నర్, ఔటర్ రింగు రోడ్ల పనులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కోచ్ ఫ్యాక్టరీ, టెక్స్‌టైల్ పార్క్, మామునూరు ఎయిర్‌పోర్టును అనుసంధానం చేసేలా రింగురోడ్లు అవసరం కావడంతో.. గత ప్రభుత్వం నిధుల్లేక ఐదేండ్ల క్రితం ఆపేసిన పనులకు రూ.120 కోట్ల నిధులు కేటాయించింది. తద్వారా రోడ్ల కోసం భూములు ఇచ్చినవారికి పరిహారం అందించనుంది. ఇవేగాక గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)లో పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపు కోసం రూ.187 కోట్లు ఇచ్చింది.