జీతాల్లో కోత ఆర్డినెన్స్​పై సర్కార్ కు నోటీసులు

జీతాల్లో కోత ఆర్డినెన్స్​పై సర్కార్ కు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: చట్టసభల సమావేశాలు జరగనప్పుడు గవర్నర్​కు ఆర్డినెన్స్‌‌ జారీ చేసే అధికారం ఉంటుందని, అది చట్టంతో సమానమని హైకోర్టు గుర్తు చేసింది. ఆ ఆర్డినెన్స్‌‌ ప్రజల ప్రాథమిక హక్కులను భంగం కలిగించేలా ఉన్నా, చట్ట వ్యతిరేకంగా ఉన్నా హైకోర్టు జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేసింది. కరోనా వల్ల లాక్‌‌డౌన్‌‌ విధింపును అడ్డంపెట్టుకుని ఉద్యోగుల జీతాలు, పెన్షన్లల్లో కోత విధించేందుకు ఫైనాన్షియల్‌‌ ఎమర్జెన్సీని విధిస్తూ రాష్ట్ర సర్కార్‌‌ ఆర్డినెన్స్‌‌ విధించడాన్ని సవాల్‌‌ చేస్తూ రిటైర్డు జిల్లా ఫారెస్ట్‌‌ ఆఫీసర్‌‌ జి.రమణగౌడ్‌‌ దాఖలు చేసిన రిట్‌‌ను చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌ శుక్రవారం విచారించింది. ఆర్థిక ఎమర్జెన్సీని ఎందుకు విధించాల్సివచ్చిందో, పిటిషనర్‌‌ లేవనెత్తిన అంశాలపై వివరణతో కౌంటర్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

పెన్షన్‌‌లో కోత పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదు

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌‌, అందుకు అనుగుణంగా ఈ నెల 16న వెలువరించిన జీవో 2ను సవాల్‌‌ చేసిన రిట్‌‌ తరఫున సీనియర్‌‌ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదించారు. విపత్తులు సంభవించినప్పుడే ఫైనాన్షియల్‌‌ ఎమర్జెన్సీని విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని, కరోనా అనేది వైరస్‌‌ మాత్రమేనని, విపత్తు కాదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు విపత్తుల నిర్వహణ చట్ట నిబంధనలకు విరుద్ధంగాఉన్నాయని, తక్షణమే జీవోపై స్టే ఇవ్వాలని కోరారు. ఆర్డినెన్స్‌‌ రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితులు ఏమీ లేవన్నారు. పెన్షన్‌‌లో కోత పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదని, ఇలా చేయడం ప్రాథమిక హక్కుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడమే అవుతుందన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఇక్కడ వ్యక్తుల హక్కుల గురించి చెబుతున్నారని, అక్కడ ప్రజల హక్కులు ఉన్నాయని కామెంట్​ చేసింది. పెన్షన్‌‌లో కోత విధింపు చెల్లదని ఏ యాక్ట్‌‌లో ఉందో చెప్పాలని కోరింది. ఆర్డినెన్స్‌‌ జారీ చేయాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు గవర్నర్‌‌ ఆమోదముద్ర వేస్తారని, గవర్నర్‌‌కు ఆర్డినెన్స్‌‌ జారీ చేసే అధికారం లేదంటే ఎలాగని ప్రశ్నించింది. దీనిపై సత్యంరెడ్డి కల్పించుకుంటూ, సాధారణ ఆర్డినెన్స్‌‌లకు ఫైనాన్షియల్‌‌ ఎమర్జెనీ ఆర్డినెన్స్‌‌కు చాలా తేడా ఉందని, విపత్తులు సంభవించినప్పుడే ఆర్థిక ఎమర్జెన్సీ చేయాలని చట్టం చెబుతోందన్నారు. విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ గైడ్‌‌లైన్స్‌‌ రిలీజ్‌‌ చేస్తే ఆ తర్వాత ఆర్డినెన్స్‌‌కు వీలుంటుందన్నారు.

కరోనా టెస్టుకు దేశమంతా ఒకటే రేటు
.