టీఆర్ఎస్ పై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు

టీఆర్ఎస్ పై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు

TRS పై  ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్. ప్రభుత్వం నిజంగా పని చేసి ఉంటే ప్రజల్లో అసంతృప్తి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.  GHMC ఎన్నికలను నిర్వహిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని… తన జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎన్నడూ చూడలేదన్నారు.వరద బాధితులకు పూర్తి సాయాన్ని అందించిన తర్వాతే ఎన్నికలు పెట్టి ఉండొచ్చని, ఇంత హడావుడిగా పెట్టాల్సిన అవసరం లేదన్నారు. గ్రేటర్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలన్నారు.

హైదరాబాదులో రూ. 68 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశామని ప్రభుత్వం చెప్పుకుంటోందని.. ఆ డెవలప్ మెంట్ ఎక్కడ కనిపిస్తోందని ప్రశ్నించారు డీఎస్. నగరంలోని ఫ్లైఓవర్లను కాంగ్రెస్ హయాంలోనే కట్టారని…ప్రస్తుతం వాటి నిర్వహణను కూడా సరిగా చేయడం లేదని ఆరోపించారు. ఒక రాష్ట్రానికి సీఎం అయిన కేసీఆర్… రాష్ట్రం కంటే కేంద్రం గురించే ఎక్కువ ఆలోచిస్తారన్నారు డీఎస్.

దుబ్బాక నియోజకవర్గం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల నియోజకవర్గాలకు ఆనుకునే ఉంటుందని… అక్కడ జరిగిన ఉపఎన్నికలో ప్రజల ఆలోచన ఎలా ఉందో స్పష్టంగా అర్థమైందన్నారు డీఎస్. టీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా పని చేసి ఉంటే ప్రజల్లో వ్యతిరేకత ఎందుకొస్తుందని ప్రశ్నించారు. ప్రజల్లో టీఆర్ఎస్ విశ్వసనీయతను పెంచుకోవాలని సూచించారు. తనను టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో మర్చిపోయిందన్నారు డి.శ్రీనివాస్.