ధరలు పెరిగినా ప్రజలు పండగ షాపింగ్ చేస్తున్నారు

 ధరలు పెరిగినా ప్రజలు పండగ షాపింగ్ చేస్తున్నారు

న్యూఢిల్లీ:ప్రపంచమంతటా ఆర్థికమాంద్యం సంకేతాలు కనిపిస్తున్నాయి. మనదేశంలో అన్నింటి ధరలూ పెరుగుతున్నాయి. అయినప్పటికీ జనం మాత్రం పండగ షాపింగ్ ​బాగా చేస్తున్నారు. జేబు నుంచి డబ్బు తీయడానికి వెనుకాడటం లేదు. కార్లు, ఇండ్లు, టీవీలు, ప్రయాణాలు,నగల కోసం మస్తు ఖర్చుపెడుతున్నారు. ఇండియాలో ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఫెస్టివల్​ సీజన్​ మొదలయింది. ఇది దాదాపు డిసెంబరు వరకు కొనసాగుతుంది. దసరా, దీపావళి కారణంగా అక్టోబరు–నవంబరు మధ్యలో సేల్స్​పతాకస్థాయికి చేరుతాయి. ఈ సీజన్​లో ఇప్పటికీ ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ సేల్స్​విలువ 27  బిలియన్​ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. 2019 కోవిడ్​ లెవెల్స్​ ఆదాయంతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. పోయిన సంవత్సరంతో  పోల్చినా 25 శాతం ఎక్కువని వివరించాయి. కాన్ఫెడరేషన్​ ఆఫ్​ ఆలిండియా ట్రేడర్స్​(సీఏఐటీ) లెక్కల ప్రకారం 2019లో ఆఫ్​లైన్​ సేల్స్​ విలువ 8.5 బిలియన్​ డాలర్ల వరకు ఉండగా, ఇది ఈసారి 15.2 బిలియన్​ డాలర్లకు పెరగవచ్చు. అమెజాన్‌‌, ఫ్లిప్​కార్ట్ ఆన్​లైన్​ షాపింగ్​ కంపెనీల అమ్మకాల విలువ 11.8 బిలియన్​ డాలర్ల వరకు ఉండొచ్చని మార్కెట్​ కన్సల్టెన్సీ రెడ్​సీర్​ తెలిపింది. 

కరోనా ఎఫెక్ట్​ తగ్గడంతో..
2019 లో దాపురించిన కరోనా ఎఫెక్ట్​ దాదాపు తొలగిపోవడంతో ఈసారి షాపులన్నీ కళకళలాడుతున్నాయి. ఎకానమీ పుంజుకోవడంతో చాలా మంది జీతాలు పెరగడం, ఉద్యోగాలు రావడంతో జనంలో ఉత్సాహం కనిపిస్తోందని రెడ్​సీర్​ అసోసియేట్​ పార్ట్​నర్​ సంజయ్​ కొఠారీ చెప్పారు. 2018 నుండి ఆన్‌‌లైన్ కొనుగోలుదారులు  నాలుగు రెట్లు పెరిగి దాదాపు 20 కోట్ల మందికి చేరారని అన్నారు. మొబైల్ హ్యాండ్‌‌సెట్‌‌లు, ఫ్యాషన్ గార్మెంట్స్ వంటి వస్తువులకు చిన్న పట్టణాల్లోనూ విపరీతంగా డిమాండ్​ ఉందని అన్నారు. ఇటువంటి అమ్మకాలు కనీసం వచ్చే మూడు నెలల వరకు బలంగా ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు.‘‘కొవిడ్​ వ్యాప్తి చెందినప్పటి నుండి మేం నగరం నుండి బయటకు వెళ్ళలేదు. ఈ సంవత్సరం పండుగల సమయంలో సరదాగా గడపాలని నిర్ణయించుకున్నాం’’ అని ఒడిశా రాజధాని భువనేశ్వర్‌‌కు చెందిన 53 ఏళ్ల మనోజ్ కుమార్ దాస్ అన్నారు. చాయ్​ అమ్ముతూ దాస్​ నెలకు దాదాపు 30 వేల రూపాయలు  సంపాదిస్తున్నారు. ఈ సంవత్సరం తన కుటుంబానికి కొత్త బట్టలు కొనుగోలు చేయడంతో పాటు, ఏడు రోజుల సెలవుల కోసం 50,000 రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు చెప్పారు. 

బట్టలు, నగలు,  కార్లు ఎక్కువ కొంటున్నరు

ఈసారి జనం బట్టలు, నగలు, కార్లకు బాగా ఖర్చు చేస్తున్నారని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఒడిశా,  కేరళ రాష్ట్రాల వ్యాపారులు చెప్పారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో డిమాండ్ భారీగా పెరిగిందన్నారు. నగరాలతో పోలిస్తే తక్కువ వేతనాల పెరుగుదల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ బలహీనంగా ఉంది. అక్టోబర్‌‌‌‌లో అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. గుజరాత్​ సిటీ అహ్మదాబాద్‌‌‌‌లోని ఆరు ఆటోమొబైల్ షోరూమ్‌‌‌‌లు నడిపే వీటెక్​ టీవీఎస్​  డైరెక్టర్ మలావ్ షా మాట్లాడుతూ, విద్యాసంస్థలను తిరిగి తెరవడం, ఆఫీసులు మొదలుకావడంతో ఆటో డిమాండ్ బాగుందని అన్నారు. బండ్ల ధరల పెంపు, అధిక పెట్రోల్ ధరలు సవాళ్లే అయినా, అవి పండుగ అమ్మకాలను తగ్గించలేదని షా అన్నారు. వడ్డీరేట్లు పెరిగినప్పటికీ లోన్లు కూడా పెరిగాయని ఆర్​బీఐ పేర్కొంది. ప్రజలు పండుగలు జరుపుకోవడానికి దుస్తులు, బంగారం, నగలు, కార్లపై ఎక్కువ ఖర్చు చేస్తున్నందున, మహమ్మారి ముందు కాలంతో పోలిస్తే అమ్మకాలు 70శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు సీఏఐటీ గ్రూప్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. పెళ్లిళ్ల సీజన్ కూడా కలసి వచ్చిందని అన్నారు. పెరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలతో వినియోగదారుల నమ్మకం మెరుగుపడిందని, రెండేళ్ల తర్వాత మహమ్మారి భయం లేకుండా దేశం పండుగలను జరుపుకుంటున్నదని ఆయన అన్నారు. 

ఆటోకు బూస్ట్​..
టూవీలర్లు సహా ఆటో అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ నెలలోని నవరాత్రుల్లో 57శాతం పెరిగాయి.  2019లో మహమ్మారి ముందు కాలంతో పోలిస్తే అమ్మకాలు దాదాపు ఐదు రెట్లు ఎక్కువ అని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ తెలిపాయి. దేశంలోని ఏడు ముఖ్య నగరాల్లో సెప్టెంబర్ క్వార్టర్​లో ఇండ్ల అమ్మకాలు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే దాదాపు 70 శాతం పెరిగాయని జేఎల్​​ఎల్​ కన్సల్టెన్సీ నివేదిక పేర్కొంది. రష్యా–-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇన్​ఫ్లేషన్​, వడ్డీరేట్లు పెరగడంతో ప్రపంచంలోని ఇతర చోట్ల ఆర్థికపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశంలో రిటైల్​బూమ్ కనిపిస్తోంది. గ్లోబల్ అవుట్‌‌పుట్‌‌లో మూడింట ఒక వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలు వచ్చే ఏడాది మాంద్యంలోకి వెళ్తాయని ఐఎంఎఫ్​ అంచనా వేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌‌లో ఇన్​ఫ్లేషన్​ ఐదు నెలల గరిష్ట స్థాయి 7.41శాతానికి చేరింది. మే నుండి రెపోరేట్లు దాదాపు 150 బేసిస్ పాయింట్లు పెరిగాయి. కన్జూమర్​ డిమాండ్‌‌లో పెరుగుదల వల్ల జీడీపీ మరింత పెరుగుతుందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు.