స్కీముల కోసం ఎమ్మెల్యేల చుట్టూ.. క్యాంప్ ఆఫీసులకు పోటెత్తుతున్న జనం

స్కీముల కోసం ఎమ్మెల్యేల చుట్టూ.. క్యాంప్ ఆఫీసులకు పోటెత్తుతున్న జనం
  • బీసీలకు లక్ష సాయం, గృహలక్ష్మి, దళితబంధు కోసం భారీగా అర్జీలు
  • అధికారుల చేతుల్లో ఏం లేకపోవడంతో ఎమ్మెల్యేల వద్దకు
  • దరఖాస్తు చేసేటోళ్లు లక్షల్లో.. సర్కార్ ఇచ్చేది కొందరికే
  • తలపట్టుకుంటున్న ఎమ్మెల్యేలు
  • ఎలక్షన్ల వేళ ఎఫెక్ట్ పడుతుందని గుబులు
  • తమను మళ్లీ గెలిపిస్తే అడిగినోళ్లందరికీ ఇస్తామని చెబుతున్న కొందరు లీడర్లు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వ పథకాల కోసం జనం ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. తమ చేతుల్లో ఏం లేదని ఆఫీసర్లు చెబుతుండటంతో.. నియోజకవర్గ ఎమ్మెల్యేల ఇండ్లకు, క్యాంప్ ఆఫీసులకు ప్రజలు క్యూ కడుతున్నారు. ఎక్కడైనా మీటింగులకు, ఇతరకార్యక్రమాలకు వెళ్లినా పథకాలు ఇప్పించాలంటూ అప్లికేషన్లు ఇస్తున్నారు. అర్హులైన తమకు స్కీములిస్తేనే ఓట్లు వేస్తామని కొన్నిచోట్ల తేల్చి చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. దరఖాస్తు చేసినోళ్లు ఎక్కువగా ఉండటం.. ప్రభుత్వం తక్కువ మందికే ఇస్తుండటంతో లబ్ధిదారులను ఎంపిక చేయలేకపోతున్నామని వాపోతున్నారు. 

ఎవరిని ఎట్లా మేనేజ్ చేయాలో అర్థంగాక, ఎవరిని కాదంటే ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కొన్ని పథకాలను నాలుగున్నరేండ్లుగా అమలు చేయని రాష్ట్ర సర్కార్.. ఇప్పుడు ఎన్నికలకు ముందు వాటిని తెరపైకి తీసుకువచ్చింది. దీంతో ఆయా పథకాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఏ పథకమైనా సరే.. ఎమ్మెల్యే సిఫార్సులతోనే లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని కలెక్టర్లు చెబుతుండటంతో జనం వాళ్ల దగ్గరికే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎమ్మెల్యే చెప్పాల్సిందే..

స్కీములకు లబ్ధిదారుల ఎంపికను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఎమ్మెల్యేలకే అప్పగించింది. దళితబంధు, గృహలక్ష్మి, బీసీలకు, మైనార్టీలకు రూ.లక్ష సాయం ఇవన్నీ ఎమ్మెల్యే చెప్పినోళ్లకే ఇవ్వనున్నారు.ఇప్పటికే బీసీలకు అందించే ఆర్థిక సాయాన్ని.. ఎమ్మెల్యే సిఫార్సు చేసిన వాళ్లకే ఇస్తున్నారు. మిగతా స్కీములు కూడా అదే పద్ధతిలో చేస్తున్నారు.దీంతో గ్రామాల్లో అర్హులైన వాళ్లంతా ఎక్కడ ఎమ్మెల్యే మీటింగ్ పెట్టినా అక్కడకు వెళ్లి.. వినతి పత్రం ఇస్తున్నారు. తమకు పథకం ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు ఊర్లో బీఆర్ఎస్ లీడర్లను పట్టుకుని.. సంబంధిత నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి మరీ పథకాల కోసం పైరవీ చేయించుకుంటున్నారు.

కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు

రాష్ట్ర ప్రభుత్వం ఆగమాగం అమలు చేస్తున్న మూడు స్కీములకు కుప్పలు తెప్పలుగా అప్లికేషన్లు వస్తున్నాయి. బీసీలకు లక్ష రూపాయల సాయానికి 5 లక్షల 20 వేల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మందికి లోపే ఆర్థిక సాయం అందింది. రానున్న నెల, రెండు నెలల్లో ఇంకో 30 వేల మంది నుంచి 40 వేల మందికే ఇచ్చేలా బడ్జెట్ ఉంది. దీంతో దాదాపు నాలుగు లక్షలకు పైగా బీసీలకు సాయం అందే అవకాశం కనిపించడం లేదు. ఇక గృహలక్ష్మి స్కీమ్​ విషయానికొస్తే ఇప్పటికే అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో తీసుకున్న అప్లికేషన్లు 17 లక్షలు దాటినట్లు సంబంధిత ఆఫీసర్లు చెబుతున్నారు. 

ప్రభుత్వం మాత్రం నియోజకవర్గానికి మూడు వేల మందికే అది కూడా విడతల వారీగా ఇవ్వనుంది. ఇలా ఎన్నికల దాకా మూడున్నర లక్షల లోపు మందికే సాయం అందే పరిస్థితి. మిగిలిన 14 లక్షల నుంచి 15 లక్షల మందికి సాయం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. చెప్పినోళ్లకే ఇచ్చుడు కష్టంగా మారిందని.. నిధుల కొరత ఉన్నందున ఇంకింత మంది అర్హులకు ఇవ్వడం కుదరదని పేర్కొంటున్నారు. 

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. ఇప్పటి వరకు దళితబంధు పథకాన్ని 38 వేల కుటుంబాలకే ఇచ్చారు. ఈసారి నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున 1.30 లక్షల మందికి ఇస్తామని చెబుతున్నారు. దీంతో పదిహేను లక్షలకు పైన దళిత కుటుంబాలు ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్‌‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఈ మూడు స్కీమ్‌‌లను అమలు చేసి ఉంటే.. ఈ సమస్య వచ్చేది కాదని ఆఫీసర్లు చెబుతున్నారు. ఏటా సక్రమంగా నిధులు కేటాయించుకుని అమలు చేస్తే ఇప్పటికే లక్షల మందికి లబ్ధి జరిగేదని అంటున్నారు.

ఎమ్మెల్యేలకు దడ

స్కీముల లొల్లి ఎఫెక్ట్‌‌ ఎన్నికల్లో పడుతుందే మోనని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. బీసీలు, మైనార్టీలు, దళితులు, ఇండ్లు లేనోళ్లు.. తమకు పథకాలు ఇప్పించాలని ఎమ్మెల్యేలను అడుగుతున్నారు. ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా ఎమ్మెల్యేలకు పథకాల వినతులు తప్పడం లేదు. ఎవరినైనా కాదంటే ఎన్నికల్లో తమకోసం పనిచేస్తారో లేదోనని, బీసీలు, దళితులు, మైనార్టీల ఓటు బ్యాంకు దారుణంగా దెబ్బతిం టుందని ఎమ్మెల్యేలు బుగులు పడుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఎలక్షన్లలో తమతో తిరగాలని, తమను గెలిపించాలని, అప్పుడు అడిగినోళ్లందరికి ఇస్తామని చెప్తున్నారు. దీంతో జనాలు కూడా.. ‘‘స్కీమ్ ఇప్పిస్తే మీతోనే ఉంటాం. పార్టీ కోసం పనిచేస్తాం. ఎలక్షన్లలో గెలిపిస్తాం” అని రివర్స్‌‌లో చెబుతున్నారు. ‘‘స్కీములే ఓడించేట్లు ఉన్నయ్.. ఇవి ఇప్పుడు పెట్టకున్నా మంచిగుంటుండే” అంటూ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే వాపోయారు.