జనం తెగ షాపింగ్​ చేస్తున్నారు

జనం తెగ షాపింగ్​ చేస్తున్నారు

న్యూఢిల్లీ: మహమ్మారి నుండి బయటపడిన జనం తెగ షాపింగ్​ చేస్తున్నారు. ఈసారి పండుగ సీజన్‌‌ కోసం జేబు నుంచి భారీగానే డబ్బును బయటకు తీస్తున్నారు. టీవీ, ఫ్రిజ్​వంటి అత్యవసరం కాని వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా రెడీ అవుతున్నారని డెలాయిట్ గ్లోబల్ స్టేట్ ఆఫ్ కన్జూమర్ ట్రాకర్ రిపోర్టు వెల్లడించింది. దీని ప్రకారం.. ప్రయాణాలు, హోటల్.. రెండింటిపై ఖర్చును పెంచడానికి కన్జూమర్లు సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఆరు నెలల్లో కొత్త లేదా పాత వెహికల్​ను కొనుగోలు చేయాలని కూడా భావిస్తున్నారు. ధరలపై(ఇన్​ఫ్లేషన్​) ఆందోళనలు ఉన్నప్పటికీ, రాబోయే నాలుగు వారాల్లో అన్ని వర్గాల్లోని వయస్సు వాళ్ల ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దుస్తులు, ఎలక్ట్రానిక్స్​, హోం అప్లియెన్సెస్, ఎంటర్​టైన్​మెంట్​, లీజర్​, రిక్రియేషన్​ కోసం డబ్బు ఖర్చు చేస్తామని సర్వేలో పాల్గొన్నవారిలో చాలా మంది చెప్పారు. దీనినిబట్టి రాబోయే పండుగల సీజన్‌‌లో షాపులు కిక్కిరిసిపోవడం ఖాయం. 2022 ఏప్రిల్ తో పోల్చితే 2022 ఆగస్ట్‌‌లో కన్జూమర్లు అత్యవసరం కాని ఖర్చులను (రిక్రియేషన్​, ఎంటర్​టైన్​మెంట్​, రెస్టారెంట్లు,  విశ్రాంతి ప్రయాణాలు వంటి వాటిపై) 30 శాతం పెంచాలని కోరుకుంటున్నారు.  దేశీయ,  అంతర్జాతీయ ప్రదేశాలకు ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నామని పలువురు చెప్పారు. కొన్ని దేశాల్లో ఇతర కొవిడ్ పరిమితుల సడలింపుతో, 88 శాతం మంది భారతీయ కన్జూమర్లు రాబోయే నాలుగు వారాల్లో హాలిడే కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం డబ్బును రెడీ చేసుకుంటున్నారు.

ఆటో కంపెనీలు హ్యాపీ..

రాబోయే పండుగలు, సేల్ ఆఫర్లు భారతీయ ఆటో పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఇండస్ట్రీ రాబోయే ఆరు నెలల్లో మరింత వేగంతో గ్రోత్​ సాధించే అవకాశాలు ఉన్నాయి. వెహికల్​ను కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య పోయిన నాలుగు నెలల్లో  9 శాతం పెరిగింది. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి, 78 శాతం మంది భారతీయ కన్జూమర్లు వచ్చే ఆరు నెలల్లో వెహికల్​ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వీరిలో 84 శాతం మంది కొత్త దానిని కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారు. వెహికల్​ను కొనుగోలు చేయడానికి కారణాలు ఏంటన్న ప్రశ్నకు.. పాత బండ్ల మెయింటనెన్స్​ ఎక్కువ ఉండటం, కొత్త తాజా మోడళ్లలో  కొత్త ఫీచర్లు ఉండటం అని చెప్పారు. ఈ విషయమై డెలాయిట్ టచ్ తోమట్సు ఇండియా ఎల్‌‌ఎల్‌‌పి  గ్లోబల్ స్టేట్ ఆఫ్ కన్స్యూమర్ ట్రాకర్ పార్టనర్,  కన్జూమర్ ఇండస్ట్రీ లీడర్ పోరస్​ డాక్టర్  మాట్లాడుతూ, "పోయిన సంవత్సరంలో కన్జూమర్లు ఖర్చులకు కొంచెం దూరంగా ఉన్నారు.  కోవిడ్​ కారణంగా ఆరోగ్యం, హాస్పిటల్​ ఖర్చులకు ఎక్కువ ఇంపార్టెన్స్​ ఇచ్చారు.  ప్రస్తుత ఇన్​ఫ్లేషన్​పై  ఆందోళనలు ఉన్నప్పటికీ, ఈ పండుగ సీజన్‌‌లో కన్జూమర్లు తమ ఖర్చులను పెంచడానికి సిద్ధంగా ఉన్నారని మా ఇటీవలి వేవ్ 34 ట్రాకర్ సూచిస్తున్నది. మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంతో పోలిస్తే ఇప్పుడు ఆన్​లైన్​ కొనుగోళ్లు  కొంత బలంగానే ఉన్నాయి. కన్జూమర్​ ప్రొడక్టులు,  రిటైల్, ఆటోమోటివ్  ట్రావెల్  హాస్పిటాలిటీ వంటి సంబంధిత రంగాలకు భారీ గిరాకీ ఉంటుందని మా సర్వే చెబుతోంది" అని అన్నారాయన.

ఇంకా చాలా మంది కోలుకోలె!

కరోనా సమయంలో ధనవంతులు మరింత ధనవంతులయ్యారని, చాలామంది కోవిడ్​ ఎఫెక్ట్​ నుంచి ఇంకా కోలుకోలేదని తాజా సర్వే ఒకటి పేర్కొంది.  కేవలం 20 శాతం మంది మాత్రమే అత్యవసరం కాని వస్తువులను కొనగలుగుతున్నారని తెలిపింది.  ఇండియా సంపన్నుల ఆదాయ స్థాయిలను కరోనా తగ్గించలేదని యూబీఎస్​ సెక్యూరిటీస్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ తన్వీ గుప్తా-జైన్ ఒక రిపోర్టులో తెలిపారు. ఇందులోని వివరాల ప్రకారం.. అత్యవసరం కాని వస్తువులను కొనగలిగే 20 శాతం మందిలో గ్రామీణ ప్రాంతాల నుంచి 59 శాతం,  పట్టణ ప్రాంతాల నుంచి 66 శాతం మంది ఉన్నారు.ఈ సర్వే కోసం ఈ ఏడాది ఆగస్టులో 1,500 మంది అధిక- ఆదాయ వినియోగదారుల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. రెస్పాండెంట్లలో సగం కంటే ఎక్కువ మంది పోయిన మూడు నెలల్లో బంగారం/ఆభరణాలను కొనుగోలు చేశారు.   వచ్చే రెండేళ్లలో ఆస్తులు,  కార్లు/టూవీలర్లను కొంటామని చెప్పారు.  70 శాతం కంటే ఎక్కువ మంది రెస్పాండెంట్లు తమ ఆదాయం 2023లో పెరుగుతుందని అంచనా వేశారు. దాదాపు 70 శాతం మంది పండుగ ఖర్చులు పెరుగుతాయని అంచనా వేయగా, 20 శాతం మంది తమ ఖర్చులు మారవని అన్నారు. తొమ్మిది శాతం మంది మాత్రమే తమ పండుగ ఖర్చులు తగ్గవచ్చని భావిస్తున్నారు. 55 శాతం మంది రెస్పాండెంట్లు రాబోయే రెండేళ్లలో వెహికల్​ను  కొనుగోలు చేయాలనుకుంటున్నారు.