
- గతంలో అక్కడున్న పేదలను ఖాళీ చేయించి ఇండ్లు కట్టిన సర్కారు
- అందులో అందరికీ ఇల్లు ఇస్తమని హామీ.. కొందరికే తాళాలు
- మిగతా వాటిల్లో వచ్చి చేరిన ఇతరులు
- ఇదేమిటంటూ ఆందోళనకు దిగిన లబ్ధిదారులు
సర్కారు కట్టించి ఇస్తామన్న ఇండ్లపై రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడో ఏండ్ల కింద హామీ ఇచ్చిన సర్కారు ఇంకెప్పుడు ఇండ్లు ఇస్తుందంటూ నిరసనలకు దిగుతున్నారు. హైదరాబాద్శివార్లలోని హస్తినాపురం డివిజన్ నందనవనంలో కట్టిన ఇండ్ల వద్ద స్థానికులు సోమవారం ఆందోళనకు దిగారు. పక్కా ఇండ్లు కట్టిస్తామని చెప్పి తమ గుడిసెలను ఖాళీ చేయించారని, ఇప్పుడు వేరే ఎవరెవరికో ఇండ్లు ఇస్తున్నారని మండిపడ్డారు.
ఏళ్లుగా ఎదురుచూపులే..
నందనవనం ప్రాంతంలో వందల మంది పేదలు గుడిసెలు వేసుకుని ఉండేవాళ్లు.1998లో వారంతా అప్లికేషన్ పెట్టుకోవడంతో 2003లో ఉమ్మడి రాష్ట్ర సర్కారు పట్టాలు ఇచ్చింది. సర్కారు పక్కా ఇండ్లు కట్టిస్తామని కొంత సొమ్ము డీడీ కట్టాలని చెప్పగా.. 2006లో 512 కుటుంబాలు డీడీ కట్టాయి. తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. మళ్లీ 2012లో జేఎన్ఎన్యూఆర్ఎం (జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రినోవేషన్ మిషన్) కింద మరోసారి సర్కారు నోటీసులు ఇచ్చింది. తర్వాత రాష్ట్ర సర్కారు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఒక్కొక్కరు రూ.80 వేల చొప్పున డీడీ కట్టాలని, అదే స్థలంలో పక్కా ఇండ్లు కట్టిస్తామని చెప్పి గుడిసెలను ఖాళీ చేయించింది. దాంతో 512 మంది మళ్లీ డీడీలు కట్టారు. వారందరికీ 2018 నవంబర్‌లో బెనిఫిషియరీ సర్టిఫికెట్ ఇచ్చారు. బ్లాక్ నంబర్, ఇంటి నంబర్ చెప్పారు. ఇండ్లు దాదాపుగా పూర్తయినా లబ్ధిదారులకు అప్పగించలేదు. వారంతా ఆందోళనకు దిగడంతో నెల రోజుల కింద కొందరికి తాళాలు ఇచ్చి గృహ ప్రవేశం చేయించారు. మిగతా వారికి స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. అయితే కొన్ని ఇండ్లలో వేరే ప్రాంతాల వారు వచ్చి ఉంటున్నట్టు లబ్ధిదారులు గుర్తించారు. ఇదేమిటని వెళ్లి అడిగితే.. వాటిలో చేరినవారు తమకే ఇండ్లను కేటాయించారంటూ దాడికి దిగుతున్నారని లబ్ధిదారులు చెప్తున్నారు. దీంతో సోమవారం నందనవనంలో ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే తాను ఇస్తానని అడ్డుపడకపోతే.. తమకు ఇండ్లు వచ్చేవని, ఇప్పుడు వేరే ఎవరో ఇండ్లలో చేరారని మండిపడ్డారు.
మన్సూరాబాద్ డివిజన్లలోనూ ఇలానే..
ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ డివిజన్ ఎరుకల నాంచారమ్మ బస్తీలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. ఇక్కడ 288 ఇండ్లు కోల్పోగా.. మొదట్లో 154 కుటుంబాల వారు ఆందోళన చేశారు. దాంతో వారికి మాత్రమే అక్కడ ఇండ్లను కేటాయించారు. ఇండ్లు కోల్పోయిన మిగతా వాళ్లకు ఇవ్వలేదు. వీళ్లు తర్వాత ఆందోళనలు మొదలుపెట్టారు. తరచూ ప్రభుత్వ ఆఫీసుల ముందు నిరసనలు తెలుపుతున్నారు. కానీ అధికారులు వారిని పట్టించుకోవడం లేదు.
వెంటనే ఇండ్లు ఇయ్యాలె..
మాకు వెంటనే ఇండ్లు ఇయ్యాలే. మా ఇండ్లలో ఎవరో వచ్చి ఉంటున్నరు. ఎలక్షన్ల ముందు మాటలు చెప్పిన నాయకులు ఇప్పుడు కనిపిస్తలేరు. మాకు ఇండ్లు ఇస్తారా, ఇయ్యరా?
– సుహాసిని, లబ్ధిదారురాలు
గుడిసెలో ఉన్నప్పుడైనా నిమ్మలం ఉన్నం
నాకు ముగ్గురు పిల్లలు. నేను ఎక్కడికని పోవాలె. గుడిసె ఖాళీ చేయించినప్పటి నుంచి కిరాయి ఇండ్లల్ల ఉంటున్నం. గవర్నమెంట్ ఇండ్లు ఇంకెప్పుడు ఇస్తది.మా గుడిసెలల్ల ఉన్నప్పుడన్న నిమ్మలం ఉండె. ఇప్పుడు ఊరుకొకరు అయినం.
– రజిని, లబ్ధిదారురాలు