ఓటర్​ నమోదుకు పది రోజులే చాన్స్ .. మార్చి 15లోగా దరఖాస్తు చేసుకునే అవకాశం

ఓటర్​ నమోదుకు పది రోజులే చాన్స్ .. మార్చి  15లోగా దరఖాస్తు చేసుకునే అవకాశం
  • ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆఫీసర్లు
  • తాజాగా 'ఐ ఓట్ ఫర్ షూర్' అనే నినాదంతో ఖమ్మంలో 5కే రన్​నిర్వహణ
  • పార్లమెంట్ ఎన్నికలపై అధికారులు కసరత్తు ముమ్మరం 

ఖమ్మం, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల  నేపథ్యంలో ఒకవైపు ఓటర్లకు అవగాహనా ర్యాలీలు, మరోవైపు పోలింగ్ సిబ్బందికి శిక్షణా తరగతులు, ఇంకోవైపు భద్రతా బలగాల ఆధ్వర్యంలో కవాతు, తనిఖీలతో అధికారులు బిజీబిజీగా ఉన్నారు. ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు, యూత్​ ను ఓటర్లుగా నమోదు చేసేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ అవగాహనా ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తున్నారు.

ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీల యాజమాన్యాల ద్వారా ఓటు నమోదుపై మీటింగ్స్​ పెడుతున్నారు. కొత్త ఓటు నమోదుకు ఈనెల 15 వరకు గడువు ఉందన్న విషయంపై అవగాహన కల్పిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను నమోదు చేయించడంలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ఫస్ట్​ప్లేస్​లో నిలిచింది. 18 ఏళ్లు నిండిన వారు 45 వేల మందికి పైగా మొన్నటి ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. 

అవగాహన పెంచేందుకు 5కే రన్..​ 

ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ, ప్రజల్లో అవగాహన పెంచేందుకు మంగళవారం ఖమ్మంలో 5కే రన్​ నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీప్  కార్యక్రమంలో భాగంగా ‘ఐ ఓట్ ఫర్ షూర్’ అనే నినాదంతో  నిర్వహించిన ఈ రన్​ లో యూత్​తో పాటు వివిధ వర్గాలకు చెందిన వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. సర్దార్ పటేల్ స్టేడియం నుంచి చేపట్టిన 5కే రన్ ను కలెక్టర్ వీపీ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అడిషనల్​ కలెకర్లు సత్యప్రసాద్, మధుసూదన్ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ, వివిధ వర్గాల వారు సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లకారం పార్క్ వరకు రన్​ చేశారు. పరుగులో ప్రతిభ కనబరిచిన నలుగురికి కలెక్టర్ బహుమతులు అందజేశారు. తర్వాత అందరూ కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

పోలింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

ఎన్నికల డ్యూటీలో పాల్గొనే సిబ్బందికి అధికారులు ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నారు. పోలింగ్ రోజు చేయాల్సిన విధులు, బాధ్యతలపై ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ లకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్​, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలల్లో జరుగుతున్న శిక్షణా తరగతులను మంగళవారం కలెక్టర్​ గౌతమ్​ తనిఖీ చేశారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పాలేరు, మధిర, సత్తుపల్లి సెగ్మెంట్, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో ఖమ్మం, వైరా నియోజకవర్గ పీవో, ఏపీవో లకు శిక్షణా కార్యక్రమ ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ పోలింగ్ రోజున నిర్వహించే విధులు,  ఈవీఎం యంత్రాల పట్ల పూర్తి అవగాహన ఉండాలని చెప్పారు. పోలింగ్ ఏజెంట్లకు సీక్రెట్ ఓటింగ్, పోలింగ్  నియమాలపై వివరించాలన్నారు. పోలింగ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహించాలని తెలిపారు.  పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్  పోలింగ్ జరపాలని, మాక్ పోలింగ్​లో 50కి తక్కువ కాకుండా ఓట్లు వేయాలని, రిజల్ట్ చూసిన తర్వాత ఈవీఎం యంత్రాన్ని క్లియర్  చేయాలని, ఆ తర్వాత అసలైన పోలింగ్​ ప్రారంభించాలని సూచించారు.

బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను పోలింగ్ కేంద్రాలలో అమర్చడంపై అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు ఫారం-12ఏ, ఫారం-12 ద్వారా ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్, పోస్టల్ బ్యాలెట్లు పొంది, కచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాని సూచించారు. ఓటర్ హెల్ప్ లైన్, సీ-విజిల్ యాప్ లను డౌన్​లోడ్ చేసుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. 

నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోండి

చండ్రుగొండ/అన్నపురెడ్డిపల్లి/ములకలపల్లి,వెలుగు: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి ఎంపీడీవోలు ఓటర్లను కోరారు. మంగళవారం పలుచోట్ల ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అన్నపురెడ్డిపల్లిలో ఓటర్లతో కలిసి మానవహారం చేపట్టారు. చండ్రుగొండలో ప్రదర్శన నిర్వహించారు. ములకలపల్లి మండలం కమలాపురంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు.