పొగలో బతికేకంటే.. బాంబులేసి ఒక్కసారే చంపేయండి: కేంద్రంపై సుప్రీం ఫైర్

పొగలో బతికేకంటే.. బాంబులేసి ఒక్కసారే చంపేయండి: కేంద్రంపై సుప్రీం ఫైర్
  • ఢిల్లీ పొల్యూషన్ నియంత్రణలో ఫెయిల్ అవడంపై ఆగ్రహం
  • దేశ రాజధాని నరకం కన్నా దారుణంగా తయారైందని వ్యాఖ్య

దేశ రాజధాని డిల్లీలో కాలుష్య నివారణకు సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవడంపై కేంద్రాన్ని తప్పుబట్టింది సుప్రీం కోర్టు. సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ప్రజల్ని బలవంతంగా పొగ గూటిలో బతకాల్సిన స్థితిలోకి నెట్టేస్తున్నారు. ఈ బతుకు కంటే ఒకేసారి 15 సంచుల్లో బాంబులు తెచ్చి అందర్నీ చంపేయండి. ఈ పొల్యూషన్‌లో బాధలు పడే కన్నా ఒక్కసారిగా ప్రాణాలు వదిలేయడం నయం. ఇంత దారుణమైన పరిస్థితులున్నా ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య పంతాలేంటి?’ అని వ్యాఖ్యానించింది. కాలుష్యాన్ని కంట్రోల్ చేయలేకపోతే ఈ పనైనా చేయండంటూ కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాపై అసహనం వ్యక్తం చేసింది.

నరకం కన్నా దారుణంగా దేశ రాజధాని

ఢిల్లీలో ఏం జరుగుతోందో అందరికీ తెలుసని, ప్రతి ఏటా ఇలానే కొనసాగుతోందని, ఏ మాత్రం చర్యలు తీసుకోకుంటే ఇది వచ్చే ఏడాది కూడా రిపీట్ అవుతుందని ధర్మాసనం చెప్పింది. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం తమ పంతాలను పక్కన పెట్టి పది రోజుల్లో పక్కా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. శాశ్వత ప్రాతిపదికన ఢిల్లీ అంతటా ఎయిర్ ప్యూరిఫైయింగ్ టవర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. ఢిల్లీలో నీటి కాలుష్యం కూడా దారుణంగా ఉందని, దేశ రాజధాని నరకం కన్నా దారుణంగా ఉందని కోర్టు ఆగ్రహించింది.

ప్రజల జీవితాలు చీప్‌గా కనిపిస్తున్నాయా?

పొల్యూషన్‌తో అల్లాడుతున్న ప్రజలకు ఎంత పరిహారం ఇచ్చినా తక్కువేనని వ్యాఖ్యానించింది. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ ట్రాజెడీలో బాధితులకు ఇచ్చిన పరిహారం… ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో ఈ తరహా ఘటనల్లో ఇచ్చిన దానితో పోలిస్తే ఏ మూలకూ సరిపోదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ప్రజల జీవితాలు చీప్‌గా కనిపిస్తున్నాయా అంటూ ప్రశ్నించింది. ప్రజలకు సేవ చేయలేకుంటే సీఎస్‌లుగా ఆ కుర్చీల్లో కూర్చోవడానికి అనర్హులంటూ ఢిల్లీ, పంజాబ్, హర్యానాల ప్రభుత్వ కార్యదర్శులపై మండిపడింది.

ప్రపంచం మనల్ని చూసి నవ్వుతోంది

ఢిల్లీ – ఎన్సీఆర్ పరిధిలో ప్రజలు కాలుష్యం కోరల్లో బాధలు పడకుండా చేయడంలో కేంద్రం సహా ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఘోరంగా ఫెయిల్ అయ్యాయని సుప్రీం అభిప్రాయపడింది. రైతులు పొలాల్లో తుక్కును తగలబెట్టకుండా ఆపడంలో పంజాబ్, హర్యానా, యూపీల వైఫల్యాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ రెండు రాష్ట్రాల తీరు వల్ల ఢిల్లీలో లక్షలాది ప్రజలు ఊపిరాడక అల్లాడుతున్నారని, వారి జీవిత కాలం తగ్గిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పొల్యూషన్ కారణంగా ఊపిరితిత్తుల జబ్బులు, కేన్సర్లు వచ్చి ప్రజలు చనిపోతుంటే చూస్తూ ఉంటారా అని ప్రశ్నించింది. రైతులు పంట తుక్కును దహనం చేయకుండా కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారని, దీనికి ప్రభుత్వాలకు ఫైన్ ఎందుకు వేయకూడదో చెప్పాలంటూ ఈ రాష్ట్రాల సీఎస్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తుక్కు తగలబెట్టడాన్ని కంట్రోల్  చేయలేకపోతున్నామని ప్రపంచం మనల్ని చూసి నవ్వుతోందన్నారు జస్టిస్ అరుణ్ మిశ్రా.