
మంచిర్యాల జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గురువారం (సెప్టెంబర్ 25) ఒకేసారి మూడు ఎలుగు బంట్లు రైతులపై దాడి చేశాయన్న వార్త కలకలం రేపింది. అటవీ శివారు ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
జిల్లాలోని దుబ్బపల్లి అటవీ శివారులో ఇద్దరు రైతుల పై మూడు ఎలుగుబంట్లు దాడి చేశాయి. అడవిలో నుంచి తప్పించుకుని వచ్చిన ఎలుగు బంట్లు.. వ్యవసాయ క్షేత్రాలకు ప్రవేశించాయి. ఒకదాని వెనుక ఒకటి పడుతూ చేలల్లో పరిగెడుతూ భయాందోళనకు గురిచేశాయి.
నేన్నల్ మండలం దుబ్బపల్లి అటవీ సమీపంలోని పత్తి చేనుకు వ్యవసాయ పనుల కోసం వెళ్లిన అర్ష మారయ్య, గావిడి మల్లేష్ అనే రైతులపై మూడు ఎలుగుబంట్లు దాడి చేశాయి. ఈ దాడిలో రైతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే మంచిర్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రైతులు చేలకు వెళ్తున్న క్రమంలో జాగ్రత్త పడాలని సూచించారు. ఒంటరిగా వెళ్లవద్దని.. పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.