నిజామాబాద్ జిల్లాను వణికిస్తున్న సీజనల్ వ్యాధులు

నిజామాబాద్ జిల్లాను వణికిస్తున్న సీజనల్ వ్యాధులు
  • ఏటా రూ. 2.55 కోట్లు ఖర్చు.. డ్రైనేజీలు నిండి రోడ్లపైకి మురుగు
  • పారిశుధ్య లోపంతో  వృద్ధిచెందుతున్న దోమలు.. 
  •  విజృంభిస్తున్న మలేరియా, డెంగీ, సీజనల్​ జ్వరాలు
  • పరేషాన్​ అవుతున్న ప్రజలు 

నిజామాబాద్,  వెలుగు: అస్తవ్యస్తమైన పారిశుధ్యంతో ఉమ్మడి జిల్లాలో సీజనల్​ వ్యాధులు ప్రబలుతున్నాయి. యేటా శానిటేషన్ ​మెయింటెనెన్స్​కు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా.. ఎక్కడి సమస్యలు అక్కడే దర్శనమిస్తున్నాయి.  డ్రైనేజీల్లో మురుగు పేరుకుపోయి కాలనీలు కంపుకొడుతున్నాయి. దోమలు విపరీతంగా వృద్ధి చెందుతూ.. మలేరియా, డెంగీ , సీజనల్​జ్వరాలకు వాహకాలుగా మారుతున్నాయి. దీంతో ప్రజలు   జ్వరాలతో సతమతమవుతున్నారు. వెంటనే పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. 

కాలనీలు.. కంపు..

ఉమ్మడి జిల్లాలో 6 మున్సిపాలిటీలు, నిజామాబాద్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉన్నాయి. నిజామాబాద్​ అర్బన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్​వాడ, బోధన్, ఆర్మూర్​, భీంగల్​మున్సిపాలిటీల్లో  పారిశుధ్య సమస్య  తీవ్రంగా ఉంది. డ్రైనేజీల్లో మురుగు పేరుకుపోవడంతో  కాలనీలు కంపుకొడుతున్నాయి.  అర్బన్​ కార్పొరేషన్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు శానిటేషన్ ​మెయింటెనెన్స్​కోసం సుమారు .రూ. 25 కోట్లు కేటాయించి  డ్రైనేజీలు నిర్మించారు. అధికారులు ప్లానింగ్​లోపంతో డ్రైనేజీలు నిర్మించడంతో తరచూ డ్రైనేజీలు జామ్​అవుతున్నాయి. బడ్జెట్​లో డ్రైనేజీల్లో పూడికతీత కు కార్పొరేషన్​ఏటా  రూ. 50 లక్షలు కేటాయిస్తుండగా,   మున్సిపాలిటీ ల్లో రూ. 8 లక్షలు కేటాయిస్తున్నారు. అయినా మురుగు ముందుకు పారడం లేదు.  

రూ. 2.55 కోట్లు ఖర్చు..

దోమల నివారణకు  కార్పొరేషన్​లో  ఏటా రూ. 82.80 లక్షలు ఖర్చు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. 13 ఫాగింగ్ మిషన్లు మెయింటెయిన్​చేస్తున్నారు.  6 మున్సిపాలిటీల్లో 28 వరకు ఫాగింగ్​మిషన్లు ఉన్నా.. 18 మాత్రమే పనిచేస్తున్నాయి.  కార్పొరేషన్ లో రోజుకు రూ. 23 వేలు ఖర్చు చేస్తుండగా.. నెలకు రూ. 6 లక్షల 90 వేలు ఖర్చు చేస్తున్నారు.  మున్సిపాలిటీలో  రోజుకు రూ. 8 వేలు ఖర్చు చేస్తున్నారు.  ఒక్కో మున్సిపాలిటీలో నెలకు రూ. 2.40 ఖర్చు చేస్తుండగా  ఏడాదికి రూ.28.80 లక్షలు ఖర్చవుతున్నాయి . మొత్తం 6 మున్సిపాలిటీల్లో  రూ. 1.72 లక్షలు ఖర్చు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.2.55 కోట్లు ఖర్చు అవుతోంది.

 విజృంభిస్తున్న సీజనల్ ​వ్యాధులు

మున్సిపాలిటీల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమలు కుడుతుండడంతో  చిన్నారులు, వృద్ధులకు విషజ్వరాలు వస్తున్నాయి. నిజామాబాద్ అర్బన్ లో గత సీజన్లో.. రోజూ 600 మంది  విష జ్వరాల బారిన పడ్డారు. జిల్లా వ్యాప్తంగా 500 డెంగీ  కేసులు నమోదు కాగా 30 మందికి పైగా చనిపోయారు.  ఈ ఏడాది తాజాగా 32 డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీ, మలేరియా ప్రబలుతున్నా ఆఫీసర్లు పట్టించుకుంటలేరని, వెంటనే  చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఆఫీసర్లు శ్రద్ధ పెడ్తలేరు..

కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో శానిటేషన్ సమస్యను పరిష్కరించాలి. ఆఫీసర్లు పారిశుధ్యంపై నిర్లక్ష్యంగా ఉంటున్నారు.  ఫాగింగ్ అడపాదడపా చేస్తున్నారు.. తప్ప రెగ్యులర్​గా చేస్తలేరు. పూడికతీతకు నిధులు ఖర్చు చేస్తున్నా.. సమస్యలు పరిష్కారమవుతలేవు. మురుగు పేరుకుపోవడంతోనే దోమలు పెరుగుతున్నాయి.    - న్యాలం రాజు,  కార్పొరేటర్​ 


పారిశుధ్యం సమస్యలు లేకుండా చర్యలు

జిల్లాలోని కార్పొరేషన్​, మున్సిపాలిటీల్లో పారిశుధ్య సమస్యలు  లేకుండా  చర్యలు తీసుకుంటున్నాం. వానాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా, డ్రైనేజీల్లో మురుగుకు ఆటంకం లేకుండా సిబ్బంది చర్యలు చేపట్టారు. స్పెషల్​ఫండ్స్​కేటాయించి  దోమల నివారణకు ఖర్చు చేస్తున్నాం. 
- చిత్రామిశ్రా, అడిషనల్ కలెక్టర్