ఘోర ప్రమాదం.. ఒకదానికొకటి ఢీ కొన్న 158 కార్లు... ఏడుగురు మృతి

ఘోర ప్రమాదం.. ఒకదానికొకటి ఢీ కొన్న 158 కార్లు... ఏడుగురు మృతి

అమెరికాలోని లూసియానాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  పొగమంచు కారణంగా దాదాపు 158 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఇంటర్‌స్టేట్-55 అనే రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. న్యూ ఓర్లానో దగ్గర్లోని పాంట్ చార్ట్రెయిన్‌ సమీపంలో ఈ కార్లు, భారీ వాహనాలు కుప్పలుతెప్పలుగా పడి ఉండంటం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. పొగమంచు కమ్ముకోవడం వల్ల దాదాపు 30 నిమిషాల వరకు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడం కొనసాగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఓ కారు ఏకంగా వంతెన పైనుంచి నీటిలో పడిపోయినట్లు చెప్పారు. అయితే ఈ ఘటననలో డ్రైవర్ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. 

డ్రైవర్ హైవే పైకి వచ్చి.. సాయం కోరతూ కేకలు పెట్టాడు. దీంతో వెంటనే సహాయక బృందాలు ప్రమాదస్థలానికి చేరుకున్నాయి. అయితే ఈ దుర్ఘటనలో 7గురు చనిపోగా.. 25 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రమాదాల ఫోటోలను కూడా లూసియానా పోలీసులు ఏరియల్ షాట్లను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర రవాణ శాఖతో సమన్వయం చేసుకొంటామని తెలిపారు. అయితే ఈ ప్రమాదం వల్ల దాదాపు 11 మైళ్ల వరకు ఇంటర్‌స్టేట్-55 రహదారిపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. 


పొగమంచు వల్ల ఇంటర్‌స్టేట్‌-10 రహదారిని కూడా మూసేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న వాతావరణ పరిస్థితిపై నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ స్పందించారు. కార్చిచ్చుల పొగ, అలాగే సాధారణ పొగమంచుతో కలిసి వాతావరణ పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాయని వెల్లడించింది. మరోవైపు న్యూ ఓర్లానో ప్రాంతంలోని పొగ మంచు వల్ల అధికారులు చాలావరకు పాఠశాలలను రద్దు చేశారు.