చేప ప్రసాదానికి... పోటెత్తారు

చేప ప్రసాదానికి... పోటెత్తారు
  • వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచీ వచ్చిన జనం
  • బత్తిన సోదరులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని
  • మొదటి రోజు 65 వేల మందికి చేప ప్రసాదం
  • ఇయ్యాల ఉదయం 9 గంటల వరకు కొనసాగనున్న పంపిణీ

హైదరాబాద్, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్  గ్రౌండ్ లో చేప ప్రసాదం కోసం శుక్రవారం జనం బారులు తీరారు. ఉదయం 8 గంటలకు బత్తిన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్  యాదవ్  చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా జనం వచ్చి చేప ప్రసాదం తీసుకున్నారు. ఈ ఏడాది ఎక్కువగా  పదేండ్లలోపు చిన్నారులకు తల్లిదండ్రులు చేప ప్రసాదం వేయించారు. మొత్తం 32 క్యూలైన్ల ద్వారా ప్రసాదం పంపిణీ చేశారు. క్యూలైన్ దగ్గరకు చేరుకునే సమయంలో చేప కోసం రూ.40 చెల్లించి జనం టోకెన్  తీసుకొన్నారు. మొదటిరోజు అర్ధరాత్రి వరకు దాదాపు 70 వేల మంది చేప ప్రసాదం తీసుకున్నారని అధికారులు తెలిపారు. బత్తిన సోదరులతో పాటు వారి కుటుంబ సభ్యులు 250 మంది చేప ప్రసాదం పంపిణీ చేశారు. శనివారం ఉదయం 9 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగనుంది. తరువాత రెండు రోజుల పాటు దూద్ బౌలిలోని బత్తిన నివాసం వద్ద చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. 175 ఏళ్లుగా ఏటా మృగశిర కార్తె రోజు బత్తిన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 

వీఐపీలకు ప్రత్యేకంగా పంపిణీ

ముందుగా వీఐపీలకు ప్రత్యేకంగా క్యూలైన్లతో పాటు స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేసి చేప ప్రసాదం పంపిణీ చేశారు. అయితే వీఐపీ పాసుల జారీ కూడా అనుమానంగానే కనిపించింది. వేల మందికి వీఐపీ పాస్ లు జారీ చేశారు. అందులో సాధారణ జనానికి కూడా వీఐపీ పాసులు ఎలా అందాయన్నది అర్థంకావడంలేదు. వీఐపీలకు రెండు చోట్ల స్పెషల్  కౌంటర్లు పెట్టి చేప ప్రసాదం పంపిణీ చేశారు.

అగర్వాల్​ సమాజ్​ సేవలు భేష్

బషీర్​బాగ్: చేప ప్రసాదం కోసం వచ్చే ఆస్తమా పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులకు 24 గంటల పాటు ఉచితంగా ఫుడ్ అందిస్తున్న అగర్వాల్ సమాజ్ సేవలు అభినందనీయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో అగర్వాల్ సమాజ్ ఏర్పాటు చేసిన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్​ను మంత్రి సందర్శించారు. ఉచితంగా ఫుడ్, తాగునీరు అందించంతోపాటు, మెడికల్ క్యాంప్​ను​ నిర్వహించడం బాగుందన్నారు. భవిష్యత్తులో  మరిన్ని సేవలు అందించాలన్నారు. తలసాని శ్రీనివాస్ వెంట హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, అధికారులు ఉన్నారు.

చేపపిల్లలు లేవంటూ  సిబ్బంది కక్కుర్తి

చేప ప్రసాదం పంపిణీ అంతా ఫ్రీగా చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ మత్స్య శాఖ ఒక్కో చేపకు రూ.40 వసూలు చేసింది. రూ.40 ఇచ్చి తీసుకుందామని అనుకున్నా మధ్యాహ్నం తరువాత చాలా కౌంటర్ల వద్ద చేపపిల్లలు దొరకలేదు. చేపపిల్లలు ఉన్నప్పటికీ కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించి షార్టేజ్  అని చూపారు. అదే సమయంలో ఒక్కో చేపపిల్లని రూ.100 వరకు విక్రయించి అక్రమంగా డబ్బులు దండుకున్నారు. కొన్ని కౌంటర్లలో చిల్లర లేదని చెబుతూ రూ.100, రూ.200, రూ.500 నోట్లు తీసుకుని తిరిగి ఇవ్వలేదు. కాగా, ప్రభుత్వం అరకొరగా ఏర్పాట్లు చేసిందని ప్రసాదం తీసుకున్న వారు విమర్శించారు. కిలోమీటరు వరకు క్యూలైన్లు ఏర్పాటు చేసినా ఒక్కచోట కూడా టాయిలెట్లు పెట్టలేదని మండిపడ్డారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల వారు మాత్రమే జనానికి ఆహారం అందించారు.

ఇంత మంది వస్తారనుకోలే

చేప ప్రసాదం కోసం ఇంతమంది వస్తారనుకోలేదు. బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉన్నవారికి ఈ మందు బాగా పనిచేస్తుందని తెలిసిన వారు చెప్పారు. ఇక్కడకు రావడం ఇదే తొలిసారి.
- గన్ జుంబ్, జుహాంగ్ సిటీ, చైనా

మరిన్ని ఏర్పాట్లు చేస్తే బాగుండేది
ఇంకా కొన్ని ఏర్పాట్లు చేసుంటే బాగుండేది. క్యూలైన్ కు దగ్గర్లో టాయిలెట్లు లేవు. గంటల తరబడి లైన్లలో నిలబడి ఇబ్బందులు పడ్డాం. క్యూలైన్లను కిలోమీటర్ కాకుండా వందమీటర్ల లోపు పెడితే బాగుండేది. మొదటిసారి చేప ప్రసాదం కోసం వచ్చాను.

 - సంపత్, పుణె