అదే చరిత్ర.. అదే పాలన.. అదే వీ6

 అదే చరిత్ర.. అదే పాలన.. అదే వీ6

నిర్బంధాలను ఎదుర్కొంటూనే  వీ6 -వెలుగు జనం గళంగా నిలిచి ఎదిగాయి. తెలిసీ తెలియని అవగాహనతో కేటీఆర్ లాంటివాళ్లు చేసే బెదిరింపులకు లొంగేంత బలహీనంగా తెలంగాణ ప్రజల మీడియా లేదు. పబ్లిక్ సమస్యలను ముందుకు తెచ్చే విషయంలో వెనకడుగు ఉండదు. వీ6 -వెలుగు తెలంగాణ ప్రజల మీడియా. ఉద్యమంలోంచి పుట్టింది.. జనంతోనే పెరిగింది. జనంలోనే ఉంది. జనంతోనే ఉంటది. బెదిరింపులు, బ్యాన్లు, అవమానాలు, కామెంట్లతో భయపెట్టలేరు. జనం గొంతు నొక్కలేరు.

ఎప్పుడో జరిగిన చరిత్రను నచ్చినట్లుగా రాసుకోవచ్చు. కానీ కండ్ల ముందు జరిగిన చరిత్రను, అందులో భాగంగా, దానికి సాక్షిగా ఉన్నవారిని మార్చడం అంత తేలిక కాదు. వీ6 -వెలుగును బ్యాన్ చేస్తామని వార్నింగ్ ఇవ్వడం ద్వారా మంత్రి కేటీఆర్.. తండ్రి వారసత్వాన్ని కొనసాగించే పనిలో ఉన్నారు. అడిగేవాళ్లు, మాట్లాడేవాళ్లు, ప్రజల తరఫున ఉండేవాళ్లు, సమస్యలపై చెప్పేవాళ్లు ఎవరూ ఉండొద్దన్న ఆలోచననే ఆయన బయటపెట్టారు. నిజానికి ఇట్లాంటి ఆలోచనలు కేసీఆర్ సొంతం కూడా కాదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరై సొంత రాష్ట్రం తెచ్చుకున్నాక కేసీఆర్ నాటి పాలకుల వారసత్వాన్నే కొనసాగిస్తున్నారు. ఆ చరిత్ర కేటీఆర్ కు తెలవకున్నా అందులో భాగంగా ఉన్న వీ6కు బాగా తెలుసు.

తెలంగాణ ఉద్యమం కీలకదశలో వీ6 న్యూస్ చానెల్ ఉద్యమానికి, ప్రజలకు బలమైన వాయిస్ గా నిలిచింది. పార్టీలకు, వర్గాలకు అతీతంగా అందరికీ ఒకే వేదికగా నిలిచింది. ఇది సహజంగానే నాటి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారుకు నచ్చలేదు. అడుగడుగునా చానెల్ ను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. అధికారిక కార్యక్రమాలకు అనుమతి లేదంటూ అడ్డుకోవడం నుంచి బెదిరింపుల దాకా అన్ని నిర్బంధాలను వాడింది. ఉన్నది ఉన్నట్లుగా ప్రసారం చేసిన కథనాలపైనా కేసులు పెట్టించి ఒత్తిడి తెచ్చింది. అప్పటి డీజీపీనే నేరుగా వీ6 చీఫ్ ఎడిటర్ అంకం రవిపై కేసులు పెట్టించారు. వ్యవస్థలను దెబ్బతీస్తున్నారంటూ12 పోలీసు స్టేషన్లలో వేర్వేరు కేసులు పెట్టారు. ఏదోరకంగా అరెస్టు చేయించి, లొంగదీసుకోవాలని ప్రయత్నించారు. ఈ అక్రమ కేసులపై హైకోర్టులో న్యాయపోరాటం చేసి వీ6 రక్షణ తీసుకుంది. జనం తరపున పోరాటం కొనసాగించింది. అక్కడితో ఆగకుండా చానెల్ ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్రలు చేసింది. ప్రభుత్వ యాడ్స్ ను నిలిపేసింది. ప్రైవేటు ప్రకటనలూ రాకుండా అడ్డుకుంది. ప్రజా ఉద్యమం కీలకదశలో ఉన్నప్పుడు ప్రలోభాలతో కొత్త ఎత్తులేసింది. భారీగా ప్రభుత్వ ప్రకటనలతో పాటు ఊహించనంత ఆదాయం ఇప్పిస్తామంటూ వలేసింది. నాటి ఆంధ్రా బడా కాంట్రాక్టర్లతోనూ భారీ ఆఫర్లు ఇప్పించింది. సామ దాన భేద దండోపాయాలు ఎన్ని ప్రయోగించినా వీ6 లొంగలేదు. నష్టమైనా, కష్టమైనా ఓర్చుకుంటూ ఎదురునిలిచింది. జనం వాయిస్ గా, ఉద్యమ వేదికగా తెలంగాణకే కట్టుబడింది. అట్ల కట్టుబడినందుకే వీ6 మీద జనం అంతులేని ఆదరణ చూపించారు. ఒక్కరొక్కరుగా మొదలై పదులు, వందలు, వేలు, లక్షలు దాటి కోట్ల మంది ఆదరిస్తూ వచ్చారు. తెలంగాణ వచ్చాకా వీ6 అదే బాట, ఆదరించే జనంతో అదే బంధం. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షం వరకు, సంఘాల నుంచి వేదికల దాకా, అన్ని కులాలు, మతాలు, వర్గాల నుంచి మారుమూల ఊరి మనిషి వరకు అందరికీ ఒకే వాయిస్. వీ6 అంటే 4 కోట్లమంది తెలంగాణకు ప్రతిరూపమైంది. 

కోట్లాది ఫాలోవర్స్​

వెలుగు దినపత్రిక వీ6 స్ఫూర్తిని కొనసాగిస్తూ తక్కువకాలంలోనే జనం పత్రికగా మారింది. ఏమూల ఏ ఇంటికి పోయి అడిగినా వీ6 -వెలుగుకు జనం ఆదరణ ఏంటో తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే వీ6 యూట్యూబ్ చానెల్స్ కు సబ్ స్క్రైబ్ అయిన వాళ్లే దాదాపు కోటి మంది ఉన్నారు. ఇది రాష్ట్ర జనాభాలో పావువంతు. వీ6 ఫేస్ బుక్ పేజీని ఫాలో అయ్యేవాళ్లు 26 లక్షల మందికిపైనే. వెబ్ సైట్, ట్విట్టర్, ఇన్ స్టా, ఈ-పేపర్, డిజిటల్ పేపర్ లాంటి ఇతర వేదికలు అన్నీ కలిపి రోజూ 2 కోట్ల మంది వరకు వీ6- వెలుగును ఫాలో అవుతున్నారు. చిన్న పిల్లలు, ఏ న్యూస్ ఫాలో కానివాళ్లు, ఇతర భాషల వాళ్లను మినహాయిస్తే నాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే ప్రతి ఒక్కరూ వీ6ను ఫాలో అయ్యేవాళ్లే. నిజాయతీగా జనం కోసం నిలబడినందుకు వారిచ్చిన గౌరవం ఇది. ఈ లెక్క ప్రకారం కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకునే సభ్యత్వాల సంఖ్య కంటే వీ6- వెలుగు వార్తల ఫాలోవర్స్ నాలుగు రెట్లు ఎక్కువ. అసలు ప్రశ్నించేవాళ్లే ఉండొద్దనుకునే కేటీఆర్ కు ప్రజల ఆదరణే పునాదిగా నిలబడే వ్యవస్థల విలువ తెలియకపోవచ్చు. అందుకే అట్ల నిలబడిన వీ6 -వెలుగు అంటే అంత ద్వేషం. సొంత మీడియాను, తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకించిన ఆంధ్రా మీడియాను వందల కోట్లతో పోషించే కేసీఆర్ సర్కారు జనంతో నిలబడిన వీ6 -వెలుగును బ్యాన్ చేస్తామనడంలో ఆశ్చర్యమేం లేదు. ఉమ్మడి రాష్ట్ర పాలనలాగే ఇప్పుడూ వీ6కు ప్రకటనలపై అదే నిషేధం. 

ఫేక్​పోస్టులతో బద్నాం చేసే ప్రయత్నం..

నాటి తెలంగాణ ద్రోహులే ఇయ్యాల కేసీఆర్ మిత్రులు. నాడు ఉద్యమకారులపై దాడులు చేసినవాళ్లే ఇయ్యాల కేసీఆర్ కు ఆప్తులు. నాటి తెలంగాణ వ్యతిరేక మీడియానే ఇయ్యాల కేసీఆర్ కు నచ్చే మీడియా. నాడు తెలంగాణ కొట్లాటలో ముందున్నవాళ్లు, అన్ని రకాలుగా నష్టపడ్డవాళ్లు ఇయ్యాల ఆయనకు బద్ధశత్రువులు. ఆయన దృష్టిలో రాష్ట్ర ద్రోహులు. ఏ ఆంధ్రా కాంట్రాక్టర్లను నాటి పాలకులు పోషించారో ఇయ్యాల అదే ఆంధ్రా కాంట్రాక్టర్లతో చేతులు కలపడమే కేసీఆర్ కు తెలిసిన అభివృద్ధి. చాలామంది ఉద్యమకారుల్లాగే వీ6 కూ రకరకాల రూపాల్లో, కేసులు, నోటీసులంటూ ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నా వెనకడుగు వేయలేదు. చివరికి ఏ ఒత్తిళ్లూ పనిచేయవని అర్థమై రాజకీయ ముద్రలు, ఫేక్ పోస్టుల ప్రచారాలతో బద్నాం చేయడానికీ దిగజారారు. 

కట్టని ఇండ్లు కట్టినట్లు, ఇయ్యని స్కీంలు ఇచ్చినట్లు, రాని నీళ్లు వచ్చినట్లుగా చెప్పుకునే మయసభ లాంటి పాలనను కేసీఆర్ సృష్టించారు. ఈ మయసభలో నిజాలను నిజాలుగా చెప్పేవాళ్లకు చోటు ఉండకూడదన్నదే కేసీఆర్, కేటీఆర్ ఉమ్మడి ఆలోచన. సొంత ఫ్యామిలీకి తిప్పలు వచ్చినప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రజలంతా స్పందించాలని వారు కోరుకుంటున్నారు. నీళ్ల నుంచి భూముల వరకు ప్రజలు పడే తిప్పలపై మాత్రం ఎవరూ మాట్లాడొద్దని, దాన్ని మీడియా చూపించొద్దని హుకుంలు జారీ చేస్తున్నారు.

తెలంగాణ హక్కు అయిన కృష్ణా జలాలపై కేసీఆర్ ను ప్రశ్నించినందుకు, తన తమ్ముడులాంటి జగన్ తో కిరికిరి పంచాయితీ పెడుతున్నారంటూ వీ6 -వెలుగుపై మండిపడ్డారు. కొత్త రాజ్యాంగం రావాలన్న కామెంట్లతో జనంలో డ్యామేజ్ అయిందని వీ6 -వెలుగుపైనే ఎదురుదాడికి దిగారు. సమైక్య పాలన నిర్బంధాలకు కేసీఆర్ వారసుడిగా మారినట్లుగానే.. ఆయనకు రాజకీయ వారసుడిగా నిరూపించుకునే ప్రయత్నంలో కేటీఆర్ ఉన్నారు. అందుకే తెలంగాణ ప్రజల మీడియాను 
బ్యాన్  చేస్తామంటున్నారు.

- కె. మురళీ కృష్ణ, సీనియర్ ​జర్నలిస్ట్