పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ

పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ

కాగజ్ నగర్, వెలుగు : కొమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో ప్రాణహిత, పెన్ గంగ నదులు ఉగ్రరూపం దాల్చడంతో సరిహద్దు గ్రామాల ప్రజలు అవస్థ పడుతున్నారు.  తీర ప్రాంతాల్లోకి వరద చొచ్చుకుపోవడంతో పంటలు నీట మునిగాయి. సిర్పూర్ ​నియోజకవర్గానికి సరిహద్దుగా ఉన్న ప్రాణహిత, పెన్ గంగ, వర్థ నదులు ఎనిమిదేండ్ల తర్వాత తీవ్ర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. శుక్రవారం తుమ్మిడిహెట్టి వద్ద ప్రకృతివనం నీట మునిగింది. నదీ తీరాన ఉన్న శివ సంత్ కార్తీక మహారాజ్ హనుమాన్ ఆలయం చుట్టూ వరద చేరింది.  సిర్పూర్ టి మండలం వెంకట్రావ్ పెట్ వద్ద పెన్ గంగపై ఉన్న అంతర్రాష్ట్ర హై లెవెల్ బ్రిడ్జి దాదాపుగా మునిగిపోయింది. బ్యాక్ వాటర్ ఉధృతితో పారీగాం వద్ద బ్రిడ్జి మీదకు నీళ్లు చేరి రాకపోకలు నిలిచి మూడు రోజులు గడిచిపోయాయి. దిందా వాగు ఉప్పొంగడంతో నాలుగు రోజులుగా రాకపోకలు బందయ్యాయి. సిర్పూర్ టి, కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్​ మండలాల్లోని నదీ పరివాహక ప్రాంతంలోని చేన్లు మునిగిపోయాయి. గుండాయిపేట్ లోని గోవింద్ గూడ  సమీపానికి వరద రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

సాగర్​26 గేట్లు ఎత్తే ఉంచిన్రు

హాలియా:  శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జునసాగర్‌‌‌‌కు 4,25,156 క్యూసెక్కుల వరద వస్తుండటంతో శుక్రవారం కూడా డ్యాం 26  క్రస్టు గేట్లను 10 ఫీట్లు మేరకు ఎత్తి 3,75,388 క్యూసెక్కులను వదిలారు. సాగర్ ఫుల్​కెపాసిటీ 590 అడుగులు కాగా 587.10 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, 305.5646 టీఎంసీలుగా ఉంది. వరద పోటెత్తుతుండడంతో డ్యాం భద్రతను నల్గొండ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యవేక్షించారు. లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. కాగా,  సాగర్ నుంచి ఎడమ కాలువకు 7602 క్యూసెక్కులు, కుడికాల్వకు 6500, ఎస్ఎల్బీసీకి 2400, వరదకాల్వకు 300, మెయిన్ పవర్ ద్వారా 32967 క్యూసెక్కులు వదులుతున్నారు. గేట్లను ఎత్తడంతో సాగర్​ను చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.   

జూరాలలో 38 గేట్లు ఓపెన్

గద్వాల:  జూరాల దగ్గర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రాజెక్టు పూర్తి కెపాసిటీ 9.657 టీఎంసీలు కాగా..3.864 టీఎంసీల నీటిని ఉంచుకొని 38 గేట్లు ఓపెన్ చేసి  2,44,213 క్యూసెక్కులను వదులుతున్నారు.  ప్రాజెక్టుకు 2.52 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్‌‌‌‌ఫ్లోగా వస్తోంది. నారాయణపూర్ డ్యామ్ దగ్గర 27.370 టీఎంసీల నీరు నిల్వ ఉంచుకొని 25 గేట్లను ఓపెన్ చేసి 2,33,621 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు 2.20 లక్షల క్యూసెక్కుల 
ఇన్‌‌‌‌ఫ్లో వస్తోంది. 

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

నాగర్​కర్నూల్​:  ఉపనదుల నుంచి శ్రీశైలం రిజర్వాయర్​లోకి భారీగా వరద నీరు చేరుతోంది. బుధవారం రాత్రి నుంచి 10 గేట్లను 15 అడుగుల వరకు ఎత్తి  4 లక్షల36వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణా, తుంగభద్ర, ఇతర ఉప నదులు, వాగుల నుంచి శ్రీశైలం జలాశయానికి దాదాపు 4లక్షల 3 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. కుడి, ఎడమ విద్యుత్​కేంద్రాల్లో కరెంట్​ఉత్పత్తి చేస్తున్నారు. రిజర్వాయర్​పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం  884.60 అడుగులకు చేరింది. రిజర్వాయర్​ పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213  టీఎంసీలుగా ఉంది.