ఇండ్లియ్యమంటే పైసలడుగుతున్నరు..తలసానిని నిలదీసిన జనం

ఇండ్లియ్యమంటే పైసలడుగుతున్నరు..తలసానిని నిలదీసిన జనం
  • డబుల్​ బెడ్రూం ఇళ్లను చూసేందుకు వెళ్లిన
  • మంత్రి తలసానిని నిలదీసిన జనం
  • లక్షలకు లక్షలు కావాలంటే ఏడికెల్లి తెచ్చియ్యాలె
  • ఆ పైసలే ఉంటే ఊర్లనే ఇల్లు కట్టుకుంటుంటిమి
  • నాలుగేండ్ల నుంచి కడతనే ఉన్నరు.. ఇంకెప్పుడిస్తరు?
  • గ్రేటర్​ ఎన్నికలొస్తున్నయనే మళ్లీ ఇప్పుడొచ్చిన్రు
  • ఇళ్లు కావాలంటే టీఆర్​ఎస్​ కార్యకర్తలు దౌర్జన్యం చేస్తున్నరని మండిపాటు
  • నిలదీసిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్ , వెలుగుడబుల్​ బెడ్రూం ఇళ్ల పరిశీలనకు వెళ్లిన మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​కు అడుగడుగునా నిరసన ఎదురైంది. ఇళ్లేవి అని అడిగితే టీఆర్​ఎస్​ కార్యకర్తలు దౌర్జన్యం చేస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లోర్​కొక రేటు పెట్టి ఆ పైసలు కడితేనే ఇళ్లు ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలకు లక్షలు అడిగితే ఏడి నుంచి తేవాలని మండిపడ్డారు. ఇన్ని రోజులు తామెవరికీ గుర్తు రాలేదని, ఇప్పుడు గ్రేటర్​ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే డబుల్​ బెడ్రూం ఇళ్లంటూ మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నేళ్లు వాటిని కడుతూనే ఉంటరని ప్రశ్నించారు. లక్ష డబుల్​ బెడ్రూం ఇళ్లు ఎక్కడో చూపించాలంటూ అసెంబ్లీలో భట్టి సవాల్​ విసిరిన సంగతి తెలిసిందే. దాన్ని స్వీకరించిన తలసాని.. గురువారం ఆయనకు డబుల్​ బెడ్రూం ఇళ్లు చూపించేందుకు తీసుకెళ్లారు.

అడుగడుగునా నిలదీతలే..

గురువారం పొద్దున్నే బంజారాహిల్స్​లోని భట్టి విక్రమార్క ఇంటికి మంత్రి తలసాని శ్రీనివాస్​ వెళ్లారు. అక్కడ భట్టిని పికప్​ చేసుకుని హైదరాబాద్​లోని జియాగూడ, గోడేకిఖబర్​, నాంపల్లి, ఖైరతాబాద్​, నెక్లెస్​రోడ్​లోని అంబేద్కర్​నగర్​, బోయిగూడ, వెస్ట్​మారేడ్​పల్లిల్లో కడుతున్న డబుల్​ బెడ్రూం ఇళ్లను చూపించారు. నాలుగు గంటల పాటు సాగిన పరిశీలనలో జనం నుంచి వాళ్లకు నిరసన ఎదురైంది. డబుల్​ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని అడిగితే లంచాలు అడుగుతున్నారని ఇద్దరు నేతలను లబ్ధిదారులు ప్రశ్నించారు. నెక్లెస్​రోడ్​లోని అంబేద్కర్​నగర్​లో మంత్రి తలసానిని నిలదీశారు. దీంతో టీఆర్​ఎస్​ కార్యకర్తలు, లబ్ధిదారులకు మధ్య గొడవ జరిగింది. లబ్ధిదారులను పోలీసులు అరెస్ట్​ చేశారు. ‘‘డబుల్​ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలంటే డబ్బులు డిమాండ్​ చేస్తున్నరు. ఫస్ట్​ ఫ్లోర్​ అయితే రూ.4 లక్షలు, సెకండ్​ ఫ్లోర్​ అయితే రూ.3 లక్షలు, మూడో ఫ్లోర్​ అయితే రూ.2 లక్షలు అడుగుతున్నరు. అన్ని లక్షలు ఏడి నుంచి తేవాలె. ఆ లక్షలే ఉంటే ఊర్లె తక్కువ రేటుకే జాగా కొనుక్కని బతికేటోళ్లం కదా. ఉన్నోడు మరింత ఉన్నోడైతుంటే.. పేదోడు ఇంకా పేదోడైతుండు’’ అని ఓ మహిళ వాపోయారు. అంబేద్కర్​ నగర్​, గోడేకిఖబర్​లో ఇళ్లు స్టార్ట్​ చేసి నాలుగేళ్లు అవుతోందని, ఇప్పటికీ కడుతూనే ఉన్నారని లబ్ధిదారులు మండిపడ్డారు. జీహెచ్​ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఇప్పుడు మళ్లీ డబుల్​ బెడ్రూం ఇండ్లంటున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెన్నేండ్లు ఇండ్లు కడతరని, ఇంకెన్నాళ్లు తాము అద్దెకుండాలని ప్రశ్నించారు. కిరాయిలు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని, కనీసం ఆ కిరాయి అయినా ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఇళ్లు ఎప్పుడిస్తరని అడిగితే టీఆర్​ఎస్​ కార్యకర్తలు దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు నేతల పర్యటన శుక్రవారం కూడా కొనసాగనుంది.

పాతవాటినే కూలగొట్టి కడుతున్నరు: భట్టి

2లక్షల 68 వేల డబుల్​ బెడ్రూం ఇళ్లను కడుతున్నట్టు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించిందని, ఇప్పటికే లక్ష ఇళ్లు పూర్తయ్యాయని చెప్పిందని భట్టి విక్రమార్క అన్నారు. సవాల్​ మేరకు తమకు ఇప్పటిదాకా 3,428 ఇళ్లను తలసాని చూపించారన్నారు. ఇప్పటిదాకా చూసిన వాటిలో పాత వాటినే కూలగొట్టి కడుతున్నారన్నారు. దీంతో ఆ ఇండ్లు ఖాళీ చేసిన వాళ్లు అద్దెలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారన్నారు. లక్ష ఇండ్లు చూపించే వరకు హైదరాబాద్​లో పర్యటిస్తూనే ఉంటానని చెప్పారు. తనతో పాటు క్వాలిటీ టీంను కూడా తీసుకొచ్చామని, వాళ్లు రిపోర్ట్​ ఇచ్చాక డబుల్​ బెడ్రూం ఇళ్ల గురించి మాట్లాడుతామని అన్నారు. కొత్తగా కేవలం 400 మందికే డబుల్​ బెడ్రూం ఇళ్లు ఇచ్చారని ఆయన అన్నారు. బాధితులు చెప్పిన అన్నీ అంశాలను నోట్​ చేసుకున్నానని చెప్పారు.

ఒక్క డబుల్ ఇల్లు కోటి రూపాయలు: తలసాని

ఇంతకుముందు ఇచ్చే ఇళ్లకు ప్రభుత్వాలు కొంత డబ్బులు వసూలు చేసేవని, ఇప్పుడు ప్రభుత్వమే పూర్తి ఫ్రీగా పేదలకు ఇళ్లు ఇస్తోందని మంత్రి తలసాని అన్నారు. సర్కారు ఇస్తున్న ఒక్కో డబుల్​ బెడ్రూం ఇంటి విలువ రూ.కోటి ఉంటుందన్నారు. గ్రేటర్​​లో లక్ష ఇళ్ల నిర్మాణానికి రూ.10 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామ న్నారు. దేశ చరిత్రలో మొదటిసారి ఇంత మంచి ఇళ్లు కట్టించి ఇస్తున్న ఘనత టీఆర్​ఎస్​ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బస్తీ ప్రజల సమక్షంలోనే ఇళ్లను పంచుతామని, లేట్​ అయినా క్వాలిటీతోనే కట్టిస్తామని అన్నారు. హైదరాబాద్​లో కడుతున్న మొత్తం ఇళ్లను భట్టికి చూపిస్తానని హామీ ఇచ్చానన్నారు. ఒక్కరోజే అన్ని ఇండ్లను చూపించడం సాధ్యం కాదని, ఇంకా 60 ప్రాంతాలు తిరగాల్సి ఉందన్నారు. కొల్లూరు, మేడ్చల్​, జవహర్​నగర్​, కుత్బుల్లాపూర్​లలో శుక్రవారం పర్యటిస్తామన్నారు.