రేషన్ కోసం జనం క్యూలు.. పట్టించుకోని అధికారులు

రేషన్ కోసం జనం క్యూలు.. పట్టించుకోని అధికారులు
  • రేషన్ అందక జనం పరేషాన్​
  • కార్డుదారులకు తప్పని పడిగాపులు 
  • ప్రతి నెలా ఇదే సమస్యతో డీలర్లకూ అవస్థలు

సర్వర్ డౌన్ సమస్యతో రేషన్  షాపుల్లో బయోమెట్రిక్​ పనిచేయడం లేదు. కొన్ని నెలలుగా ఈ సమస్య వేధిస్తున్నా అధికారులు చర్యలు చేపట్టడం లేదు. వినియోగదారులు బియ్యం కోసం గంటల తరబడి​ షాప్​ల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తోంది.  

మెదక్/పాపన్నపేట, వెలుగు: సర్వర్ డౌన్ సమస్యతో అటు రేషన్ డీలర్లు, ఇటు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని నెలలుగా ఈ సమస్య వేధిస్తున్నా పరిష్కారం దిశగా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా ప్రతి నెలా వినియోగదారులు బియ్యం కోసం గంటల తరబడి రేషన్​ షాప్​ల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు రేషన్​షాపుల్లో రూపాయికే కిలో బియ్యం పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 16,996 రేషన్ షాప్ లు ఉండగా.. ఆహార భద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ  కార్డులన్నీ కలిపి 90,47,615 వరకు ఉన్నాయి. కార్డుదారులకు ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేస్తారు. గతంలో మాన్యువల్​విధానంలో, కొన్నాళ్లు కూపన్​ విధానంలో బియ్యం పంపిణీ చేశారు. పేదల కోసం అందజేస్తున్న రేషన్​ బియ్యం దుర్వినియోగం అవుతున్నాయన్న ఉద్దేశంతో అక్రమాలకు చెక్​పెట్టేందుకు ప్రభుత్వం రేషన్​ షాప్​లలో బయోమెట్రిక్​ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదివరకు రేషన్​ కార్డు తీసుకొని వెళితే ఎవరైనా బియ్యం తీసుకునే వీలుండేది. కానీ కొత్త విధానం అమలులోకి వచ్చాక బయోమెట్రిక్​లో వేలిముద్ర నమోదై ఉన్న వినియోగదారులు తప్పనిసరిగా రేషన్​షాప్ నకు వెళ్లాల్సి వస్తోంది. 

సాల్వ్​కాని టెక్నికల్​ప్రాబ్లమ్స్​
కొత్త విధానం ప్రవేశపెట్టిన తరువాత ఎదురవుతున్న టెక్నికల్​ప్రాబ్లమ్స్​ను సాల్వ్​చేయడంపై అధికారులు ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదు. బయోమెట్రిక్​విధానం ప్రారంభించిన తర్వాత చాలాచోట్ల రేషన్​షాప్​లలో ఇంటర్ నెట్ సిగ్నల్స్ సరిగా రాక ఇబ్బందులు ఎదురయ్యాయి. సిగ్నల్ కోసం డీలర్లు బిల్డింగ్​లపైకి  ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కొత్తగా పలు జిల్లాల్లో సర్వర్ డౌన్ సమస్య మొదలైంది. దీంతో బియ్యం పంపిణీకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. సర్వర్​కనెక్ట్​అయ్యేవరకు బయోమెట్రిక్ పని చేయడం లేదు. దీంతో వినియోగదారులు గంటల తరబడి రేషన్ షాపుల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల అయితే రెండు మూడు రోజులు తిరగాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూలీ పనులకు వెళ్లాల్సినవారు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునేవారు బియ్యం కోసం పలుసార్లు రేషన్​ షాప్ దగ్గరకు వెళ్లాల్సి రావడం, అక్కడ గంటల తరబడి వెయిటింగ్​చేయాల్సి రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఆఫీసర్లు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 

ఎన్ని రోజులు తిరగాలె
రేషన్ బియ్యం తీసుకునేటందుకు రోజుల తరబడి రేషన్​షాప్ చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రతి నెలా నాలుగైదు రోజులు సర్వర్ ప్రాబ్లం సమస్య ఎదురైతోంది. ఇట్ల ఎన్ని రోజులు తిరగాలి. ఇంకో రెండు రోజులు అయితే రేషన్ దుకాణాలు బంద్ అవుతాయి. బియ్యం ఎట్ల మరి.  
– దుర్గయ్య, పాపన్నపేట, మెదక్​జిల్లా