ఇల్లు గడవక గోల్డ్​ లోన్​ కంపెనీలకు క్యూ కడుతున్న జనం

V6 Velugu Posted on Jun 17, 2021

  • ఇల్లు గడవక బంగారం తాకట్టు
  • గోల్డ్​ లోన్​ కంపెనీలకు క్యూ కడుతున్న జనం 
  • రోజూ 100 కోట్ల బిజినెస్​
  • వ్యాపారాలు నడ్వక కొందరు.. నౌకర్లు పోయి ఇంకొందరు...
  • హైదరాబాద్​లో రోజూ 200 కిలోల బంగారం కుదువ
  • కిస్తీలు కట్టలేక ఇడిపించుకునెటోళ్లూ తక్కువే
  • టైమ్​ దాటగానే అర్రాస్​ వేస్తున్న కంపెనీలు
  • హైదరాబాద్​లో ఏడాదిలో రూ.250 కోట్ల గోల్డ్​ వేలం
  • కరోనా, లాక్​డౌన్​తో బతుకులు ఆగం

హైదరాబాద్​లో గోల్డ్​ లోన్​​ కంపెనీల బ్రాంచ్​లు వెయ్యికిపైగా ఉన్నాయి. ఇవి కాకుండా లైసెన్స్​డ్​ పాన్​ బ్రోకర్లు కూడా ఉంటారు. వీళ్లు తక్కువ మొత్తంలో బంగారం కుదవ పెట్టుకుంటారు. అయితే వడ్డీ తక్కువ అని జనం మణప్పురం, ముత్తూట్​ ఫిన్​ కార్ప్​, ముత్తూట్​ మినీ, ఐఐఎఫ్​ఎల్​లాంటి నాన్​ బ్యాంకింగ్​ ఫైనాన్షియల్​ కంపెనీల్లో గోల్డ్​ లోన్లు తీసుకునేందుకు ఇష్టపడుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కో బ్రాంచ్​లో రోజూ 20 తులాలకు పైగా బంగారం తాకట్టుపెడుతున్నారు. గతంలో ఇది 10 తులాల కన్నా తక్కువే ఉండేది. అన్ని కంపెనీలకు కలిపి హైదరాబాద్​లో వెయ్యి బ్రాంచ్​లు ఉండగా.. ఈ లెక్కన రోజుకు 20 వేల తులాల బంగారాన్ని జనం తాకట్టు పెడుతున్నారు. అంటే 200 కిలోల బంగారం అన్నమాట. ప్రస్తుతం ఈ కంపెనీలు రూ. 30 వేలకు తులం చొప్పున లెక్క గడుతున్నాయి. ఈ లెక్కన రోజూ రూ. 60 కోట్ల బంగారం కంపెనీల వద్దకు చేరుతున్నది. బయట మార్కెట్లో తులం గోల్డ్​ రూ. 50 వేల దాకా ఉంది. దీన్నిబట్టి హైదరాబాద్​లోని గోల్డ్​ కంపెనీలకు రోజూ రూ. వంద కోట్ల బంగారం తాకట్టుకు వెళ్తోంది. 

హైదరాబాద్​, వెలుగు: కరోనా కష్టకాలంలో ఇల్లు గడవక జనం బంగారం కుదువ పెడుతున్నారు. పైసా పైసా కూడబెట్టుకొని కొనుక్కున్న బంగారమే ఆపతిలో అక్కరకు వస్తున్నది. కొందరైతే పుస్తెల తాడును కూడా తాకట్టు పెడుతున్నారు. కాలం మంచిగుంటే తిరిగి విడిపించుకోవచ్చన్న  నమ్మకంతో ఇప్పుడు కష్టాలు గట్టెక్కే దారిని లెంకుకుంటున్నారు. ఒకప్పుడు అడ్వర్టయిజ్​మెంట్లు ఇచ్చి, ఆఫర్లు అనౌన్స్​ చేసినా  బంగారం తాకట్టు పెట్టడానికి ముందుకు రాని జనం ప్రస్తుతం పాన్​ బ్రోకర్ల  ముందు క్యూ కడుతున్నారు. మణప్పురం, ముత్తూట్​ ఫిన్​ కార్ప్​, ముత్తూట్ మినీ, ఐఐఎఫ్ఎల్​ లాంటి నాన్​ బ్యాంకింగ్​ ఫైనాన్షియల్​ కంపెనీల బ్రాంచ్​లు కస్టమర్లతో ఫుల్​ బిజీగా కనిపిస్తున్నాయి. అనేక బ్రాంచుల్లో కస్టమర్లు గతంలోకన్నా డబుల్​ అయ్యారు.

రోడ్డున పడేసిన కరోనా 

కరోనా, లాక్​డౌన్​ కారణంగా చిరుద్యోగులు, చిరు వ్యాపారులు ఎక్కువగా సఫర్​ అవుతున్నారు. చిన్న చిన్న కంపెనీలు, సంస్థల్లో చిరుద్యోగాలు చేసుకునే చాలా మందికి ప్రస్తుతం కొలువులు లేకుండా పోయాయి.  హోటళ్లు, రెస్టారెంట్లలో పని చేసుకునెటోళ్లకు కూడా  ఉపాధి కరువైంది. చాయ్​ దుకాణాలు, మిర్చి బండ్లు, ఫాస్ట్​ ఫుడ్​ సెంటర్ల మీద ఆధారపడే వారి జీవితాలూ ఆగమయ్యాయి.  ఏ రోజుకారోజు అప్పు  చేసి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసెటోళ్లంతా వ్యాపారం సాగక  తిప్పలుపడుతున్నారు. కొందరికి వ్యాపారమే లేక, మరికొందరికి ఉన్నా నడవక భార్యా బిడ్డలకు తిండి పెట్టలేని పరిస్థితికి వచ్చారు. బయట అప్పు కింద పైసలు పుట్టక కొందరు, అడగడానికి నోరు రాక ఇంకొందరు ఇంట్లోనో, ఒంటి మీదనో ఉన్న బంగారం తాకట్టు పెట్టి ఇల్లు ఎల్లదీస్తున్నారు. 

ఒక్కో బ్రాంచ్​కు డబుల్​ గిరాకీ
హైదరాబాద్​లో దాదాపు పేద, మధ్యతరగతి ప్రజలు కిరాయి ఇండ్లల్లోనే ఉంటారు. రెంట్​ వేలల్లో ఉంటుంది. తిన్నా తినకపోయినా ఠంచన్​గా రెంట్​ కట్టాల్సిందే. తిండీతిప్పలకు మరికొంత ఖర్చవుతుంది. ఎంత లేదన్నా నెలకు ఏడెనిమిది వేల నుంచి 15 వేలన్నా ఆదాయం లేకపోతే ఇట్లాంటి కుటుంబాలకు కాలం గడవడం కష్టమవుతుంది. కరోనా కష్టకాలంలో చాలా మందికి నాన్​ బ్యాంకింగ్​ ఫైనాన్షియల్​ గోల్డ్​ కంపెనీలు, లోకల్​ పాన్​ బ్రోకర్లు దిక్కవుతున్నారు. ఇంట్లోనో, ఒంటిమీదనో ఉన్న కొద్దిపాటి బంగారాన్ని కుదువపెడ్తున్నారు. కరోనాకు ముందు ఒక్కో బ్రాంచ్​కు  30 మంది కస్టమర్లు వస్తే ఇప్పుడు ఆ సంఖ్య 70కి చేరిందని ముత్తూట్​ ఫైనాన్స్​ కంపెనీ మేనేజర్​ ఒకరు చెప్పారు. గతంలో గోల్డ్​ లోన్లు తీసుకునే వాళ్లు, తాకట్టు పెట్టిన బంగారం తీసుకునేవాళ్లు సమ సంఖ్యలో వచ్చేవాళ్లని, ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉందని ఆయన అన్నారు. ‘‘ప్రస్తుతం కొత్తగా లోన్లు తీసుకునే వాళ్లే ఎక్కువగా వస్తున్నారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకునే వాళ్లు బాగా తగ్గారు’’ అని వివరించారు. లోన్లు తీర్చలేక బంగారాన్ని వదులుకుంటున్నోళ్లు ఎక్కువవుతున్నారని చెప్పారు.  తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి తీసుకొని వెళ్లే వాళ్లు 40–60 శాతం మందే ఉన్నారని అన్నారు.

హైదరాబాద్​లో 250 కిలోల బంగారం వేలం 
‘‘పోయినేడాది లాక్​డౌన్​ తర్వాత బంగారాన్ని విడిపించుకుంటున్న వాళ్లకన్నా లోన్లు తీసుకునే వాళ్లే ఎక్కువయ్యారు. గోల్డ్​ లోన్​ టైమ్​ అయిపోయినా కిస్తీలు కట్టడం లేదు. దాంతో మేం నగలను అమ్మేయాల్సి వస్తోంది’’ అని హైదరాబాద్​ తార్నాకలోని మణప్పురం గోల్డ్​ కంపెనీ ఉద్యోగి ఒకరు చెప్పారు. ఏడాది కాలంలో హైదరాబాద్​లో గోల్డ్​ లోన్​ ఆఫర్​ చేసే ప్రముఖ నాన్​ బ్యాంకింగ్​ ఫైనాన్షియల్​ సంస్థలు 250 కిలోల బంగారాన్ని  వేలం వేసినట్లు ఒక కంపెనీ ప్రతినిధి తెలిపారు. కొన్ని కంపెనీలు మూడు నెలల వరకు కస్టమర్లు కిస్తీ కట్టకపోతే వారికి నోటీసులు ఇచ్చి బంగారం వేలం వేస్తే.. మరికొన్ని కంపెనీలు మరో ఒకట్రెండు నెలలు అదనంగా ఓపిక పడుతున్నాయి. సమయం ముగిసిన తర్వాత మాత్రం వేలం వేసి ఫైనల్​ సెటిల్​మెంట్​ చేస్తున్నాయి. చాలా మంది తీసుకున్న లోన్​ కన్నా వడ్డీలే పెరిగిపోవడంతో సెటిల్​మెంట్లకు కూడా వెళ్లడం లేదు. ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న బంగారాన్ని పేద, మధ్య తరగతి జనం చూస్తూ చూస్తూ వదులుకోవాల్సి వస్తోంది. లోన్​ టర్మ్​ పూర్తయినా తిరిగి చెల్లించలేని వారు ఏడాది కాలంలో లక్ష మంది వరకు ఉంటారని అంచనా. 

జనం చేతిలో పైసలు తిరుగుతలేవ్​
కరోనాకు ముందు మా దగ్గరికి గోల్డ్​ లోన్‌ కోసం 30 నుంచి 40 మంది వచ్చేవాళ్లు. ఇప్పుడు 60 నుంచి 85 మంది వరకు వస్తున్నారు. గతంలో రోజూ మా బ్రాంచ్​కు 6 నుంచి 10 తులాల బంగారం తాకట్టుకు వస్తే ఇప్పుడు 15 నుంచి 20 తులాల వరకు వస్తోంది. హైదరాబాద్​లో గోల్డ్​ లోన్​  కంపెనీల బ్రాంచ్​లు వెయ్యిదాకా ఉన్నాయి. అన్ని బ్రాంచ్​ల్లో కలిపి రోజుకు 150 నుంచి 200 కిలోల బంగారం కుదవకు వస్తోంది. జనం చేతిలో పైసలు తిరుగుతలేవు. తిరిగి బంగారాన్ని విడిపించుకుపోతలేరు. ఏడాదిలో హైదరాబాద్​లో అన్ని కంపెనీలు కలిపి 250 కిలోల బంగారం వేలం వేశాయి.  
- ఓ బ్రాంచీ మేనేజర్, మణప్పురం గోల్డ్​లోన్‌

భార్య మెడల బంగారం కుదువబెట్టిన
కరోనా కారణంగా టీ షాప్ సరిగా నడుస్త లేదు. బతుకుడు కష్టమైతున్నది. అప్పులెక్కువైనయ్​. ఆ బాధ తట్టుకోలేక నా భార్య మెడలోని బంగారం తాకట్టు పెట్టిన. కొన్ని అప్పులు తీర్చి వాటితో హోటల్​, ఇంటి రెంట్​ కడుతున్న. అయినా నాతో అయితలేదని భార్య, పిల్లల్ని ఊరికి పంపిన. ఒక్కన్నే ఉంటున్న. వ్యాపారం మంచిగ నడిస్తే బంగారం ఇడిపించుకునుడు.. లేకపోతే ఆశలు వదులుకునుడే. 
‑ అనిల్, టీ షాప్ నిర్వాహకుడు, తార్నాక, హైదరాబాద్

తాకట్టుపెట్టిన గోల్డ్​ వదిలిపెట్టిన
ఓ ప్రైవేట్​ సంస్థలో ఉద్యోగం చేసేటోడ్ని. నెలకు రూ. 15 వేల జీతం వచ్చేది. నిరుడు లాక్​ డౌన్​లో ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి ఓ బట్టల షాపులో నెలకు రూ. 8 వేలకు పనిచేస్తున్న. అయినా కష్టాలు తీరలే. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైనయ్​. నా దగ్గర ఉన్న అద్ద తులం బంగారం తాకట్టు పెట్టి రూ. 15 వేలు తీసుకున్న. తిరిగి కట్టలేక బంగారాన్ని వదిలిపెట్టుకున్న. 
‑ సాయికుమార్​, రంగారెడ్డి జిల్లా
 

Tagged Hyderabad, Telangana, lockdown, manappuram Gold Loan, no work, small merchants, Gold Loan Companies, gold loan

Latest Videos

Subscribe Now

More News