ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కావొద్దు : రాష్ట్ర బాలల హక్కుల కమిషన్

ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కావొద్దు : రాష్ట్ర బాలల హక్కుల కమిషన్
  • ..స్టూడెంట్ల విద్య, రక్షణపై అధికారులకు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ దిశానిర్దేశం 

హైదరాబాద్, వెలుగు: బెస్ట్ అవైలబుల్ స్కూలింగ్ స్కీమ్ కింద 25 వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్లు అర్ధాంతరంగా తొలగించడంపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలను వెంటనే అమలు చేయాలని, ఏ ఒక్క విద్యార్థి విద్యకు దూరం కాకూడదని డీఈఓలను ఆదేశించింది.

 రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల డీఈఓలు, ఎంఈఓలతో హైదరాబాద్‌‌‌‌ బేగంపేట్‌‌‌‌లోని టూరిజం ప్లాజాలో గురువారం సమీక్షా సమావేశం జరిగింది. కమిషన్ చైర్‌‌‌‌ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి కమిషన్ సభ్యులతో పాటు విద్యా శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 ప్రభుత్వ స్కూళ్లలో డ్రాపౌట్‌‌‌‌లు, టీచర్ల కొరత, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దందా, బాల్య వివాహాలు, పిల్లలపై దాడులు వంటి అంశాలపై చర్చించారు. బాల్య వివాహాలను ఆపిన తర్వాత పిల్లలు మళ్లీ బడికెళ్లేలా చూడాలని, ఇందుకోసం ట్రాకింగ్ వ్యవస్థ ఉండాలని కమిషన్ స్పష్టం చేసింది. స్కూళ్లలో మౌలిక వసతులు, పరిశుభ్రమైన టాయిలెట్లు, తాగునీరు వంటి సౌకర్యాలపై దృష్టి పెట్టాలని సూచించింది.