పులి గోర్లు, దంతాలు అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్

పులి గోర్లు, దంతాలు అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్

అమ్రాబాద్, వెలుగు : చిరుతపులి దంతాలు, గోరును అమ్ముతున్న వ్యక్తులను వలపన్ని పట్టుకున్నట్లు డీఎఫ్ వో రోహిత్ గోపిడి తెలిపారు. ఆదివారం మన్ననూర్ ఈసీసీ సెంటర్ లో మీడియాకు వివరాలు వెల్లడించారు. గత నెలలో ఇన్​ఫార్మర్ల ద్వారా గోర్లు, దంతాలు అమ్మకానికి ఒప్పందం కుదిరినట్లు సమాచారం అందిందని, దీంతో ఫారెస్ట్  సిబ్బంది మఫ్టీలో వెళ్లగా అమ్మడానికి ఒప్పుకున్నారన్నారు. నాగర్​కర్నూల్​ జిల్లా అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి సమీపంలోని దాబా వద్దకు పదర మండలం ఇప్పలపల్లికి చెందిన నరేశ్, బోయిన చిన్న ఆంజనేయులు రాగా వారిని  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు. వారి నుంచి గోరు, రెండు దంతాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. 

నిందితులను విచారించగా నాలుగు నెలల కింద మద్దిమడుగు రేంజ్ పరిధిలోని సోమచెల్క బీట్ లో చిరుతపులి చనిపోయి ఉండగా, దాని గోరు, రెండు కోర దంతాలు తీసుకున్నామని చెప్పారన్నారు. గ్రామంలో తనిఖీలు నిర్వహించగా గుర్రం ఆంజనేయులు, మండ్లి ఆంజనేయులు వద్ద మరొక గోరు, రెండు దంతాలు దొరికాయన్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని చెప్పారు. మాడబోయిన చిన్న ఆంజనేయులు మద్దిమడుగు ఉప సర్పంచ్​ కావడం గమనార్హం. మండ్లి చిన్న ఈదయ్య పరారీలో ఉన్నాడు.