కరోనా తర్వాత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న ప్రజలు

కరోనా తర్వాత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న ప్రజలు
  • మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుకు సర్కారు చర్యలు 
  • ప్రజలకు పోషకాహారం చేరువ చేసేందుకే..   
  • క్రమంగా గ్రామాలకు విస్తరించేలా ప్లాన్​

 కామారెడ్డి , వెలుగు:  కరోనా తర్వాత ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు.  పాత కాలం నాటి ఆహారపు అలవాట్లపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా  రోగనిరోధక శక్తిని పెంచే  చిరుధాన్యాలు (మిల్లెట్స్​) ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు  ఈ పోషకాహార ఉత్పత్తులను చేరువ చేసేందుకు  రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో మిల్లెట్స్​ ఫుడ్ ​ప్రొడక్ట్స్ సెంటర్​ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించేందుకు కసరత్తు  ప్రారంభించింది.  ఐక్యరాజ్య సమితి ఈ చిరుధాన్యాల  ప్రాధాన్యాన్ని చాటి చెప్పడానికి 2023 సంవత్సరాన్ని  ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది.  జొన్నలు, సజ్జలు, రాగులు, సామలు, అరికలు, కొర్రలు, అండు కొర్రలు, ఊదలు లాంటి  చిరుధాన్యాల వినియోగం ఇటీవల బాగా పెరిగింది.  దీంతో అంతటా ప్రత్యేక షాపులు పెట్టి  మిల్లెట్లు అమ్ముతున్నారు.  వాటితో తయారు చేసిన ఉత్పత్తులకు కూడా మార్కెట్​లో బాగా డిమాండ్​వస్తోంది.  యూఎన్​వో ప్రకట నేపథ్యంలో   కేంద్ర ప్రభుత్వం కూడా వీటికి  బ్రాండ్‌‌ విలువను తీసుకు రావాలని ప్రకటించింది. దీంతో అగ్రికల్చర్​డిపార్ట్​మెంట్​ఆధ్వర్యంలో ఈ పంటలు సాగు చేయాలని అంతటా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ఇటీవల అక్కడక్కడ స్టాల్స్​ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే వీటిని గ్రామ స్థాయిలోకి అందుబాటులోకి తేవాలని  ప్రభుత్వం నిర్ణయించింది.  

 ముందు జిల్లా కేంద్రాల్లో..

 ఫస్ట్ ​ ప్రతి జిల్లా కేంద్రంలో మిల్లెట్స్​ ప్రొడక్ట్స్​  సెంటర్​ ఏర్పాటు చేస్తారు.  టౌన్​ ఏరియాల్లో  మహిళా సంఘాలను  కోఆర్డినేట్​చేసే మెప్మా ఆధ్వర్యంలో  మిల్లెట్స్​ప్రొడక్ట్స్​సెంటర్​ ఏర్పాటు చేయనున్నారు.  పట్టణంలో మహిళా సంఘాల సభ్యుల్లో ఆసక్తి ఉన్న వారిని సెలక్ట్​ చేస్తారు.  ఇందుకు పెట్టుబడి  రూ. 3 లక్షల  నుంచి రూ.10 లక్షల వరకు అవుతుండడంతో మెప్మా ద్వారా బ్యాంక్​లోన్​ ఇప్పిస్తారు. ఇందులో  25 నుంచి 30 శాతం వరకు సబ్సిడీ  కూడా ఇవ్వనున్నారు.    చిరుధాన్యాలను పండించే రైతుల నుంచి వాటిని సేకరించటం,  ప్రాసెసింగ్​చేసి షాపులకు సప్లై చేయడంతో పాటు,  పలు రకాల  ప్రొడక్ట్స్​  తయారు చేసి  మార్కెటింగ్​కు అవకాశాలు కల్పిస్తారు.  పట్టణంలో సక్సెస్​గా నడిచిన తర్వాత రూరల్​ ఏరియాల్లో కూడా యూనిట్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆఫీసర్లు తెలిపారు.   

మహిళా సంఘాల లీడర్లకు ట్రైనింగ్​

 యూనిట్​ ఏర్పాటు చేయటానికి ఆసక్తి చూపే  మహిళ సంఘాల ప్రతినిధులకు ముందుగా ట్రైనింగ్​ఇస్తారు.  హైదరాబాద్​లో  ఐఐఎంఆర్( ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ఆఫ్ మిల్లెట్స్​రీసెర్చ్ ) లో ట్రైనింగ్ ఇస్తారు. చిరుధాన్యాలతో బిస్కట్లు,  పట్టీలు , ఇతర స్నాక్స్​ తయారీ చేయిస్తారు. ప్రాసెసింగ్, ప్రొడక్ట్స్​ తయారీ, మార్కెటింగ్​పై శిక్షణ​ఇస్తారు.  

ఆదేశాలు రాగానే  అమలు చేస్తాం

జిల్లా కేంద్రంలో  మహిళ సంఘాల ద్వారా మిల్లెట్స్​ ప్రొడక్ట్స్​ సెంటర్​ ఏర్పాటు చేయాలని స్టేట్​ఆఫీసర్లు ఓరల్​గా చెప్పారు. ఇంకా ఆదేశాలు ఇవ్వలేదు. మిల్లెట్స్​ఫుడ్​తినేవారి సంఖ్య పెరిగిన నేపథ్యంలో ప్రొడక్ట్స్​సెంటర్​ఏర్పాటు చేస్తే బాగుంటుంది.  అందరికీ మిల్లెట్ఉత్పత్తులు అందడంతో పాటు,  తయారు చేసే వారికి ఉపాధి దొరుకుతుంది.  

  – శ్రీధర్​రెడ్డి, మెప్మా పీడీ, కామారెడ్డి