మనుషుల మధ్య చిచ్చుపెడుతున్నకరోనా

మనుషుల మధ్య చిచ్చుపెడుతున్నకరోనా

వెలుగు నెట్​వర్క్​:కరోనా ఇప్పుడు మనుషుల మధ్యే కాదు.. మనసుల మధ్య కూడా దూరం పెంచుతోంది. మానవ సంబంధాల నడుమ చిచ్చుపెడుతోంది. తమ వారికి కరోనా సోకిందని తెలియగానే స్నేహితులు, చుట్టాలు డిఫరెంట్​గా ప్రవర్తిస్తున్నారు. అటువైపు వెళ్లడం లేదు. కనీసం సానుభూతి చూపడంలేదు. మాట మాత్రంగా కూడా ఫోన్​లో పలకరించడం లేదు. ‘మేమున్నాం. భయపడొద్దు’ అనే భరోసా ఇవ్వడం లేదు. చివరికి పక్క వాళ్లు పొరపాటున దగ్గినా తుమ్మినా వణికిపోయేంతలా పరిస్థితి మారుతోంది. తెలిసినోళ్లు, తెలియనోళ్లు అనే తేడా లేదు.. ప్రతి ఒక్కరినీ అనుమానిస్తున్న దుస్థితి.

అవగాహన కావాలె..

కరోనా ఒక అంటువ్యాధి. కానీ క్యాన్సర్, ఎయిడ్స్​లా ప్రాణాంతకమైతే కాదు. జాగ్రత్త పడితే వైరస్ సోకకుండా ఉండొచ్చు. ఒకవేళ వైరస్ సోకినా.. ట్రీట్​మెంట్​తో బయటపడొచ్చు. మరణాల శాతం చాలా తక్కువ. వీలైనంత వరకు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. దీనిపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. మన దేశంలో కరోనా మరణాల రేటు 3.3 శాతమే. రాష్ట్రంలోనైతే 2.5 శాతం మాత్రమే. అంటే కరోనా సోకిన ప్రతి వంద మందిలో ఇద్దరి నుంచి ముగ్గురు వ్యక్తులు చనిపోతున్నారు. అందులోనూ చాలాకాలంగా వివిధ వ్యాధులతో బాధపడే వారే ఎక్కువగా ఉంటున్నారు.

భరోసా ఇచ్చేదెవరు?

జిల్లాల్లో ఏర్పాటు చేసిన కాల్​సెంటర్లకు వందలాది మంది ఫోన్లు చేస్తున్నారు. తమకు పొడిదగ్గు, జలుబు ఉన్నాయని, జ్వరం కూడా వస్తోందని, కరోనా సోకిందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైంలో అవసరమైన వారికి టెస్టులు చేసి, కరోనా ఉందో లేదో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ వేలాది మందికి పరీక్షలు చేసే పరిస్థితి లేదు. కనీసం ఎవరైనా డాక్టర్ సలహా తీసుకుందామంటే చాలామంది అందుబాటులో ఉండడం లేదు. కరోనా కారణంగా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఓపీ సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేట్ యాజమాన్యాలు ఇన్​పేషెంట్ విభాగాలను కూడా బంద్ చేశాయి. ఒకట్రెండు కార్పొరేట్ హాస్పిటల్స్ తప్ప జిల్లాల్లో నూటికి 99 శాతం ప్రైవేట్ ఆసుపత్రులు మూతపడ్డాయి. ప్రభుత్వ ఆసుపత్రులేమో కరోనా ఐసోలేషన్ సెంటర్లుగా మారిపోయాయి. అక్కడికి వెళ్లాలంటే జనాల్లో ఏదో తెలియని భయం. దీంతో కరోనా లక్షణాలు ఉన్నా.. డాక్టర్లను కలిసే చాన్స్ లేక, టెస్ట్ చేయించుకునే పరిస్థితి లేక అనేకమంది తెలిసిన మందులేవో వేసుకుంటూ కాలం గడుపుతున్నారు.

బయటికి చెప్పుకోగలిగితేనే..

కరోనా లక్షణాలు కనిపిస్తే ఇంటా, బయటా చెప్పుకునే పరిస్థితి ఉండాలి. టెస్టు చేయించుకొని డౌట్ తీర్చుకోగలగాలి. ఒకవేళ పాజిటివ్ వస్తే మేమున్నామంటూ స్నేహితులు, బంధువులు భరోసా కల్పించాలి. ట్రీట్ చేసే హాస్పిటళ్లలోనూ మెరుగైన ఫెసిలిటీస్ కల్పించాలి. వైరస్ సోకిన వారిని ఎంత త్వరగా గుర్తించి, ఐసోలేషన్​కు పంపగలిగితే అంత త్వరగా మనకు కరోనా నుంచి విముక్తి కలుగుతుందని డాక్టర్స్ చెబుతున్నారు. ఆ దిశగా ప్రజలకు ప్రభుత్వాలు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.

ప్రజల్లో భయం ఉంది

ఇంట్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే బయటికి చెప్పుకునే పరిస్థితి లేదు. కనీసం సన్నిహితులతో కూడా పంచుకోవడం లేదు. కరోనాపై సమాజంలో ఉన్న భయమే ఇందుకు కారణం. కరోనా వచ్చిందని చెబితే తమ కుటుంబాన్ని వెలివేస్తారనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. అది వారి తప్పు కాదు. అలా అని సైలెన్స్ కరెక్ట్ కాదు. కరోనా లక్షణాలు ఉన్నవారు బయటికి చెప్పుకునే పరిస్థితి ఉండాలి. అప్పుడే వైరస్​ను పూర్తిగా కంట్రోల్​ చేయగలం.

– డాక్టర్ రావులపాటి సతీష్ బాబు, సైకియాట్రిస్ట్

నెగెటివ్ సైడే ఆలోచిస్తున్నరు

కరోనా వస్తే చనిపోతారనే భావన చాలా మంది మనసుల్లో ఫిక్స్​అయిపోయింది. నమోదైన కేసులు చూసి అంతా భయపడుతున్నారు. కానీ పేషెంట్లు రికవరీ అయి బయటకు వస్తున్న దాని గురించి ఎవరూ ఆలోచించడం లేదు. దీని వల్లే ధైర్యం చెప్పాల్సిన సన్నిహితులు కూడా దూరం అవుతున్నారు. చాలా మంది చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఇలా నెగెటివ్ సైడ్ ఆలోచించే వారి వల్లే నెగెటివ్ ప్రచారం ఎక్కువ జరుగుతోంది. ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది.

– బండారి జగదీశ్​బాబు, మెంటల్ హెల్త్ ఎక్స్​పర్ట్, హన్మకొండ