మూసీ ఉధృతి..నీటమునిగిన చాదర్ ఘాట్

మూసీ  ఉధృతి..నీటమునిగిన చాదర్ ఘాట్

హైదరాబాద్ వ్యాప్తంగా వరుణుడు విధ్వంసం సృష్టించాడు. కుండపోత వానకు నాలాలు పొంగిపొర్లాయి. భారీగా వరదనీరు చేరడంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.  దీంతో అధికారులు నది పరిసర ప్రాంతాల్లో  రెడ్ అలర్ట్ జారీ చేశారు. అటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్  జలాశయాలకు భారీగా వరద నీరు చేరడంతో..అధికారులు గేట్లు ఎత్తారు.  ఈ వరదల కారణంగా మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. చాదర్​ఘాట్, మూసారంబాగ్ వంతెనలపై నుంచి మూసీ ప్రవహిస్తోంది.  దీంతో చాదర్ ఘాట్, మూసారాంబాగ్, శంకర్ నగర్ కాలనీలు నీటమునిగాయి. ఇండ్లలోకి నడుము లోతు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో  సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. వరదల కారణంగా ఆ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

తిండి లేక అవస్థలు..
భారీ వరదలతో చాదరఘాట్ నీటమునిగింది. నిన్నటి నుంచి ప్రజలు తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇండ్లలో నీరు చేరడంతో వస్తువులు నీటమునిగాయి. మేము అద్దె ఇంట్లో నివసిస్తున్నాము, అది ముంపులో ఉంది. మేము నిస్సహాయులం. వరదల వల్ల ఉదయం నుంచి పిల్లలకు ఏమీ లేదు అని స్థానికంగా నివాస ముండే మహిళ షాహీన్ తన బాధను వ్యక్తం చేశారు. 

రెడ్ అలర్ట్..
మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో.. పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.  మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.  నదికి ఇరువైపులా ఉన్న వారిని ఖాళీ చేయించారు. అఫ్జల్ గంజ్ వద్ద మూసీ బ్రిడ్జి్  కింద  గుడిసెల్లో నివాసముంటున్న వారిని ఖాళీ చేయించారు. వారందరిని  కమ్యూనిటీ హాల్‌లోకి తరలించారు . చాదర్‌ఘాట్, మలక్‌పేట్, ముషారాంబాగ్ బ్రిడ్జిల దగ్గర వరద ప్రవాహం పెరుగుతుండడంతో రాకపోకలను నిలిపి వేశారు. 

వాహనదారుల ఇబ్బందులు..
ముసారాంబాగ్ బ్రిడ్జి్ పై నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ఎల్‌బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్ నుండి అంబర్ పేట్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. అటు వైపు వెళ్లాల్సిన ప్రజలు  ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యం చేరుకుంటున్నారు. వరదల కారణంగా అధికారులు పలు రోడ్లను మూసివేయడంతో...దిల్‌సుఖ్‌నగర్ నుండి మలక్ పేట్ మీదుగా కోఠిపైపు వచ్చే రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది.  కిలోమీటర్ల మేర వెహికిల్స్ బారులు తీరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.