2022 దాకా ప్రజలు ఆస్పత్రుల్లో తగలబడాల్నా?

2022 దాకా ప్రజలు ఆస్పత్రుల్లో తగలబడాల్నా?
  • ఫైర్ సేఫ్టీ నిబంధనల్లో గుజరాత్ సర్కారు మినహాయింపు ఇవ్వడంపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ: కొవిడ్ ఆస్పత్రులకు ఫైర్‌‌ సేఫ్టీ నిబంధనల విషయంలో 2022 మార్చి వరకు మినహాయింపు ఇస్తూ గుజరాత్‌ సర్కారు నోటిఫికేషన్ జారీ చేయడం సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటి వరకు ప్రజలు ఆస్పత్రుల్లో తగలబడాల్సిందేనా అంటూ జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. కరోనా ట్రీట్‌మెంట్ ఇస్తున్న ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పక్కా పాటించాలని గత ఏడాది డిసెంబర్‌‌లో సుప్రీం ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు పోతున్నా మేల్కోకపోతే  ఎలా అని ప్రశ్నించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వమే హాస్పిటళ్లకు చెబుతున్నట్టుగా ఉందని, చట్టాలు పాటించాల్సిన అవరం లేదంటూ స్వేచ్ఛ ఇస్తే ఎలా అని అన్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ పెట్టుకునేందుకు వచ్చే ఏడాది వరకూ సమయం ఇవ్వడమంటే, అప్పటి వరకూ ప్రజలు అగ్ని ప్రమాదాల్లో ప్రజలు చనిపోయినా ఫర్వాలేదనేనా అని ప్రశ్నించారు. గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు, గతంలో ఆ రాష్ట్రంలో కరోనా ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాల కారణంగా పేషెంట్లు మరణించిన ఘటనలకు సంబంధించి న్యూస్‌ పేపర్లలో వచ్చిన వార్త కథనాల ఆధారంగా సుమోటోగా సుప్రీం కోర్టు విచారణకు తీసుకుంది. సోమవారం ఉదయం ఈ విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఫైర్‌‌ సేఫ్టీ నిబంధనలను ఆస్పత్రులు పక్కా పాటించేలా చర్యలు తీసుకోవాలని గత డిసెంబరులో తాము ఆదేశాలిచ్చామని, కానీ ఈ ఏడాది మే నెలలో కూడా కొన్ని చోట్ల కరోనా ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయని ఈ సందర్భంగా న్యాయస్థానం గుర్తు చేసింది. తమ ఆదేశాలను పక్కా పాటించి ఉంటే మళ్లీ రోగుల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేది కాదని, ఇప్పటికైనా మేలుకోవాలని సూచించింది. 2020 డిసెంబర్‌‌ తర్వాత ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేపట్టారా? లేదా? అన్న అంశంతో పాటు గుజరాత్ ప్రభుత్వం ఇచ్చి ఉత్తర్వులకు సంబంధించి పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ఇందుకోసం కొంత సమయం కావాలని గుజరాత్ సర్కారు కోరగా, కోర్టు అందుకు అంగీకరించలేదు. ఇయ్యాల్నే ఉత్తర్వులకు సంబంధించిన అఫిడవిట్ వేయాలని ఆదేశించింది.