కరోనా వేళ.. షుగర్ ఉన్నొళ్లు బీ కేర్ ఫుల్

కరోనా వేళ.. షుగర్ ఉన్నొళ్లు బీ కేర్ ఫుల్

షుగర్ పేషెంట్లలో మాటిమాటికీ బ్లడ్ షుగర్ లెవల్స్ మారిపోతుంటాయి. దీంతో శరీరానికి సరైన పోషకాలు అందవు. దీనికోసం ఎంత తిన్నా ఇమ్యూనిటీ తక్కువగానే ఉంటుంది. అలాగని ఎక్కువగా తినలేరు. మితంగా, సరైన మోతాదుల్లో కొద్దికొద్దిగానే తినాలి. దీనివల్ల వేరే జబ్బులు ముఖ్యంగా కరోనా వైరస్ లాంటివి సోకే అవకాశం ఎక్కువగా ఉంటోంది. అందుకే కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్నవారిలో షుగర్‌‌ పేషెంట్లే మొదటి వరుసలో ఉంటున్నారు. డయాబెటిక్స్​కు కోవిడ్ 19 సోకకుండా ఉండాలంటే వాళ్లలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాలి. పోషకాలున్నవే తినాలి. అయితే.. ఏది తింటే షుగర్ అటాక్ అవుతుందో, ఏది తినకపోతే కరోనా ఎఫెక్ట్ అవుతుందో తెలియక షుగర్ పేషెంట్లు కన్​ఫ్యూజ్​ అవుతున్నారు. ఇది ముఖ్యంగా మానసిక స్థితి పై ఎక్కువ ప్రభావం చూపుతోంది.

షుగర్‌‌ ఉన్నోళ్లందరికీ ముప్పేనా?

అంటే.. కానే కాదు. షుగర్ కంట్రోల్​లో ఉంచుకుని, డాక్టర్ల సలహాలు తూ.చ. తప్పకుండా పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, కంటినిండా నిద్ర పోయి, మానసికంగా ప్రశాంతంగా ఉన్నవాళ్లకి కరోనా సోకినా కోలుకోవచ్చు. షుగర్ లెవల్స్ కంట్రోల్​లో లేనివాళ్లు మాత్రమే దీనికి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా షుగర్ ఉన్న వృద్ధులు తొందరగా ఎఫెక్ట్ అయి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. కొంతమందికి షుగర్​తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉంటున్నాయి. షుగర్ వచ్చినా దాన్ని సరిగ్గా కంట్రోల్లో పెట్టుకోవడం విషయంలో మనదేశంలో అవగాహన చాలా తక్కువ. దీంతో ఆహారనియమాలు పాటించకపోవడం, మందులు సరిగ్గా టైంకి వేసుకోకపోవడంలాంటి నిర్లక్ష్యాలు షుగర్ ను పెంచుతాయి. ఈ పరిస్థితి కరోనా బారిన పడేలా చేస్తోంది.

మరేం చేయాలి...

చక్కెర వ్యాధి ఉన్నవాళ్లు కూడా కరోనా నుండి తప్పించుకోవచ్చు. అయితే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా షుగర్ లెవల్స్ టెస్ట్​ చేయించుకోవాలి. అది టైప్ 1 అయినా, టైప్ 2 అయినా ఇలా చేయడం తప్పనిసరి. మందులు వాడుతున్నాం కదా.. చెకప్ అవసరం ఏంటి? అనుకుంటారు చాలామంది. కానీ, అది తప్పు. మందులు వాడుతున్నా కూడా ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్ టెస్ట్ చేయించుకోవాల్సిందే.

టైంకి మందులు వేసుకోవాలి

ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేయడం మన అలవాటు. అచ్చం అలానే మెడిసిన్​ వేసుకోవడంలో కూడా స్ర్టిక్ట్​గా రూల్​ పాటించాలి. గుర్తుకొచ్చినప్పుడు వేసుకోవడం కాకుండా డైలీ ఒకే టైంకి మెడిసిన్​ వేసుకోవాలి. ఉదాహరణకు రాత్రి 8 గంటలకు  షుగర్ టాబ్లెట్ వేసుకుంటే కచ్చితంగా తర్వాత రోజు ఉదయం 8 గంటల లోపే మళ్లీ  టాబ్లెట్ వేసుకోవాలి. అలాకాకుండా ఉదయం ఎప్పుడో పది, పదకొండు గంటలకు మెడిసిన్​ వేసుకుంటామంటే కుదరదు. ఎందుకంటే ముందురోజు వేసుకున్న టాబ్లెట్ ప్రభావం దాదాపు 10 నుంచి 12 గంటలపాటు మాత్రమే  ఉంటుంది. అయితే ఆ టైం దాటి మందులు వేసుకుంటే చక్కెర స్థాయిలో తేడాలు వస్తాయి. కాబట్టి టైంకి తిని.. టైంకి మందులు వేసుకోవాలి.

ఇమ్యూనిటీ పెంచుకోవడం ఎలా?

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు తినే ఫుడ్​లో తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండాలి. ముఖ్యంగా విటమిన్– సి, డి, జింక్ ఉన్న ఫుడ్​ తినాలి. గుడ్లు, మెంతికూర, పాలకూరలు ప్రతి రోజూ తింటే బెటర్​. వీటివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. మటన్, చికెన్ తింటే ప్రొటీన్స్ అందుతాయి. అయితే వాటిని బాగా ఉడికించిన తర్వాతే తినాలి. వెజిటేరియన్స్ అయితే రాజ్మా, గింజధాన్యాల వంటివి ఎక్కువగా తినాలి.

రెండింటికీ ఒకటే మంత్రం… శుభ్రత

షుగర్ ఉన్నవాళ్లు ఫుడ్​, మెడిసిన్​ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటారో శుభ్రత విషయంలోనూ అంతే శ్రద్ధ తీసుకోవాలి.  ఎప్పటికప్పుడు చేతులు క్లీన్ చేసుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. వేసుకునే బట్టలు, తినే తిండి, ఉండే వాతావరణం అంతా శుభ్రంగా ఉండాలి. వీటన్నింటితో పాటు స్టే హోం.. స్టే సేఫ్ పాలసీ పాటించాలి. అలా కుదరదనుకుంటే అన్ని జాగ్రత్తలు తీసుకుని బయటకు అడుగుపెట్టాలి. అలాగే ‘అమ్మో కరోనా వస్తుందేమో’ అనే భయం కాకుండా.. వస్తే జయించగలం అనే మానసికస్థైర్యం మెండుగా కావాలి. అలా ఉంటే కరోనాను కర్రపట్టుకుని తరిమికొట్టచ్చు.

..సమస్యలు ఎక్కువ

డయాబెటిస్‌ ఉన్నవాళ్లకు కరోనా వస్తే సమస్యలు ఎక్కువ. అలాగే కరోనా వచ్చిన వాళ్లకి ఇన్ఫెక్షన్ కాంప్లికేట్​ అయ్యే అవకాశం కూడా ఎక్కువ. కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పు రావచ్చు. అయితే అందరిలో ఇలానే ఉంటుందని అనుకోనవసరంలేదు. కానీ, కచ్చితంగా ప్రతి డయాబెటిక్ పేషెంట్ షుగర్ లెవల్స్​ను కంట్రోల్​లో ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ బలమైన ఆహారం తీసుకోవాలి. విటమిన్– సి, డి లతో పాటు జింక్ తీసుకుంటే చాలా మంచిది. అయితే ఇవన్నీ మెడిసిన్స్ రూపంలో కాకుండా ఫుడ్​ రూపంలోనే తింటే బెటర్‌‌. డయాబెటిక్ పేషెంట్లు.. కోవిడ్ వచ్చినా, అది రాకుండా ఉండాలన్నా ముఖ్యంగా పాటించాల్సింది శుభ్రత. దీంతోపాటు ప్రతి ఒక్కరూ బలమైన ఆహారం తినాలి. అలాగే దానికి తగ్గట్టు వాకింగ్, చిన్న చిన్న ఎక్సర్​సైజులు చేయాలి. ఫిట్​నెస్​తో ఉంటే డయాబెటిక్ పేషెంట్ అయినా కోవిడ్ 19 ఏమీ చేయలేదన్నది ప్రతి పేషెంట్ గ్రహించాలి.

డా. గీతా ఔరంగభత్కర్, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, కేర్ హాస్పిటల్, హైదరాబాద్‌

ఈ గింజలతో అంతా మేలే

శరీరంలో యాంటీఆక్సిడెంట్లను పెంచాలంటే.. మంచి డైట్ తీసుకోవాలి. అందులోనూ కరోనా టైం కావడంతో మరికాస్త ఎక్కువగా ఇమ్యూనిటీని పెంచే ఫుడ్ తినాలి. అయితే దీనికోసం ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉండే పళ్లు, కూరగాయలు, నట్స్ మాత్రమే అందరూ తింటుంటారు..  అయితే ఇప్పుడు వీటికి కొన్ని గింజలను కూడా కలపాలి. డైలీ డైట్‌లో ఐదు రకాల గింజలను కూడా కలిపితింటే.. రోజంతా హెల్దీగా.. యాక్టివ్‌గా ఉంటాం. ఇమ్యూనిటీని పెంచుకోగలుగుతాం. రోజూ ఉదయాన్నే 15 గ్రాముల వరకు ఈ ఐదు గింజలను కలిపి తింటే ఫలితం ఉంటుంది.

సన్ ఫ్లవర్ గింజలు మనకు ఎంతో మేలు చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు అందిస్తాయి.

నువ్వులు ఎక్కువగా తీసుకోవడంతో శరీరం చురుకుగా ఉంటుంది. షుగర్ పేషెంట్లకు ఇది ఎంతో మేలు. గుమ్మడి గింజలు ఇమ్యూనిటీని పెంచుతాయి. ఎముకలు బలంగా తయారవుతాయి.

సబ్జా గింజలను  ఏ కాలంలో తిన్నా బెనిఫిట్ ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచి.. జలుబు, ఫ్లూ బారిన పడకుండా కాపాడతాయి.

జనపనార గింజలు రోజూ ఒక టేబుల్ స్పూన్ తింటే.. శరీరానికి ఇరవై అమైనో యాసిడ్స్ అందుతాయి. వీటిని తినడం వల్ల  శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి.