శ్రీమద్రామాయణంలో...ఆలోచన

శ్రీమద్రామాయణంలో...ఆలోచన

ఆలోచన అనే పదానికి.. అవధానం, ధ్యానం, ఉద్దేశం, చింతన, యోచన, మెదడు విధి నిర్వహణ, మనస్తత్వం, ఉపాయం లాంటి అర్థాలు ఉన్నాయి. అలాగే... ఆలోచనల్లో స్వాతంత్య్ర, కోరుకున్న, మునుపటి, సృజనాత్మక, విపరీత, అనుకూల, మొదటి ఆలోచన, మరో ఆలోచన, ఆలోచన పూర్వకం అంటూ వివిధ రూపాలుగా వివరించారు వ్యాకరణ పండితులు. వాస్తవానికి ఆలోచన అనేది ‘మనుషుల బుద్ధికి సంబంధించిన విశేష లక్షణం’. అంటే ఇది మెదడుకి సంబంధించిన విషయమన్నమాట.

భూమ్మీద నివసిస్తున్న మనుషుల ఆలోచనా విధానం మీదే వారి జీవితాలు ఆధారపడి ఉంటాయి. దురాలోచన ప్రవేశిస్తే, సృష్టి వినాశనం అవుతుంది. సదాలోచన చేస్తే, పురోగతి వైపుగా అడుగులు వేయగలుగుతాం. ఒక వ్యక్తి ఆలోచనా విధానాన్ని బట్టి ఆ వ్యక్తిలోని మంచిచెడులను తెలుసుకోవచ్చు. ‘మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు’ అంటాడు వివేకానందుడు.

శ్రీమద్రామాయణంలో...

కైకమ్మలోని దురాలోచన కారణంగా దశరథుడు మరణించాడు. రామకార్యార్థం సముద్రాన్ని దాటవలసిన సందర్భంలో, హనుమంతుడు తనకు శక్తి లేదనే భావించుకుంటాడు. వానరులంతా హనుమలో నిక్షిప్తమై ఉన్న శక్తిని స్తుతిస్తారు. అప్పుడు హనుమకు తాను శక్తిమంతుడననే ఆలోచన కలిగి, నూరు యోజనాల సముద్రాన్ని అవలీలగా లంఘిస్తాడు. శూర్ఫణఖ మెదడులో నిండుగా ఉన్న దురాలోచన ఫలితంగానే రావణుడు సీతమ్మను అపహరించి, తన వంశ నాశనంతో పాటు లంకానగర వినాశనానికి కారకుడయ్యాడు. ‘మీ ఆలోచనలు మీ జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందువల్ల మంచిగా ఆలోచన చేయాలి’ అంటారు పెద్దలు. 

శ్రీకృష్ణుడు చేసిన సదాలోచన వల్ల పాండవులను రాజ్యలక్ష్మి వరించింది. దుర్యోధనుడు చేసిన దురాలోచన కారణంగా కురువంశం సర్వనాశనం అయింది. మహాభారతమంతా దుర్యోధనుడి దురాలోచనలతోనే నడుస్తుంది. అడుగడుగునా కుతంత్రాలు చేస్తూనే ఉంటాడు దుర్యోధనుడు. చివరకు అందరినీ కోల్పోయి తాను కూడా మరణిస్తాడు. దుర్యోధనుడికి దురాలోచనలు రావటానికి కారణం గాంధారి. కుంతీదేవి కుమారుడిని ప్రభవించిందని వినగానే ఆమెలో దురాలోచన బయలుదేరి, గర్భతాడనం చేసుకున్న కారణంగా నూరుగురు కౌరవులు దురాలోచనపరులయ్యారు. 

‘గర్భవతి ఆలోచనల మీదే పుట్టబోయే బిడ్డ ఆలోచనలు ఆధారపడి ఉంటాయి’ అని శాస్త్రం చెబుతోంది. అందుకు అభిమన్యుడు ఉదాహరణ. సుభద్ర గర్భవతిగా ఉన్న సమయంలో సదాలోచనలతో గడిపింది. గర్భంలో ఉండగానే  పద్మవ్యూహంలోకి ప్రవేశించటం ఎలాగో విన్నాడు. బయటకు ఎలా రావాలో వినలేదు. అందుకే పద్మవ్యూహంలోనే మరణించాడు అభిమన్యుడు. గర్భవతి చేసే ఆలోచనలు మన జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయి.‘ఇనుముని ఎవరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పు దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరూ నాశనం చేయలేరు. అతని చెడు ఆలోచనలే అతడిని నాశనం చేస్తాయి’ అనే మాటలు దుర్యోధనాదుల విషయంలో తేటతెల్లమవుతాయి. ‘ఆకలి గొప్పదా? ఆలోచన గొప్పదా? అని ప్రశ్నించుకుంటే, ఆకలి అవసరాన్ని తీరుస్తుంది. ఆలోచన బతకటం నేర్పుతుంది’ అంటారు విజ్ఞులు. 

పంచతంత్రంలో సింహం, కుందేలు కథ తెలిసిందే. అడవికి రాజయిన సింహం రోజుకొక జంతువుని తింటూ ఉంటుంది. ఒకరోజు కుందేలు వంతు వస్తుంది. ఎలాగైనా తనను తాను రక్షించుకోవాలనే ఆలోచన చేసింది కుందేలు. పథకం ప్రకారం సింహాన్ని నూతి దగ్గరకు తీసుకునివెళ్లి, ఆ నూతిలో మరో సింహం ఉందని సింహానికి ఆవేశం కలిగించింది. నిజంగానే నూతిలో మరో సింహం ఉందనుకుని, దాని సంహరించాలే ఉద్దేశంతో నూతిలోకి దూకింది. సింహం మరణించింది. జంతువులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. 

‘ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తారు’, ‘విత్తు మంచిదైతే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది. నీ ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తావు’ వంటి సామెతలు ఈ కథను నిరూపిస్తున్నాయి.
 –డా. వైజయంతి పురాణపండ, ఫోన్: 80085 51232

ఆవేశం ముందడుగు వేసిన ప్రతిసారీ, ఆలోచన వెనకడుగే వేస్తుంది.మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలరు.ఒక మంచి ఆలోచన లక్షలాదిమందిని కదిలిస్తుంది. లక్షలాదిమందిలో కదలిక ఒక సమాజాన్ని కదిలిస్తుంది.ఒక మంచి ఆలోచన పది చెడు ఆలోచనలను మంచి వైపుకి మళ్లిస్తుంది. ఒక చెడు ఆలోచన వేయి మంచి ఆలోచనలను కలుషితం చేస్తుంది.కార్యాచరణ మంచిదే, కానీ దానికి మూలం ఆలోచన, కాబట్టి బుద్ధిని ఉన్నత విషయాలలో అద్వితీయమైన ఆదర్శాలతో నింపుకోండి. రేయింబవళ్లు వాటినే స్మరించండి. అప్పుడే అద్భుతాలను సాధించగలరు.మీ అంతరాత్మకు మించిన గురువు లేడు.– స్వామి వివేకానంద