కొత్త పెన్షన్లకు పక్కాగా ఏజ్​ ప్రూఫ్

కొత్త పెన్షన్లకు పక్కాగా ఏజ్​ ప్రూఫ్

ఓటర్, ఆధార్ కార్డుల్లోని వయసును పరిశీలించనున్న ఆఫీసర్లు
తనిఖీలకు స్పెషల్​ క్యాంపులు పెట్టాలని ఆలోచిస్తున్న సర్కారు
జూన్​లో వెరిఫికేషన్​ మొదలయ్యే చాన్స్​

హైదరాబాద్, వెలుగు: ఆసరా పథకానికి కొత్తవాళ్లను  ఎంపిక చేసేందుకు స్క్రీనింగ్  విధానం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. తొలుత నియోజకవర్గాల వారీగా క్యాంపులు పెట్టాలనుకున్నప్పటికీ కరోనా వ్యాప్తి, వృద్ధుల వయోభారం, ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని గ్రామ స్థాయిలోనే క్యాంపులను నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు  సమాచారం. ఇప్పటి వరకు 65 ఏండ్లు నిండితేనే వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేస్తుండగా.. ఇక మీదట 57 ఏండ్లు నిండినవారికి కూడా పెన్షన్​ ఇస్తామని గత ఎన్నికల్లో టీఆర్ఎస్​ హామీ ఇచ్చింది. ఈ మేరకు 2018లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగా 57 ఏండ్లు నిండిన 6.62 లక్షల మందిని అప్పట్లో అర్హులుగా గుర్తించారు. ఓటరు జాబితాలో వయస్సుకు, ఆధార్​ కార్డులోని వయస్సుకు తేడాలు, కొన్ని తప్పులు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం అర్హులను ఎంపిక చేసేందుకు ప్రత్యేక టీమ్​లతో వెరిఫికేషన్​ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. 

ఆధార్  కార్డు, ఇతర ఏజ్​ ప్రూఫ్స్​తో చెక్​ చేస్తరు

ఆసరా పెన్షన్​తో పాటు ఇతర ప్రభుత్వ పథకాలకు ఆధార్​ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే  ఓటరు జాబితాలో ఉన్న వయస్సును నిర్ధారించుకునేందుకు ఆధార్​ను చెక్​ చేయనున్నారు. అలాగే ఏజ్​ ప్రూఫ్​కు ఇతర ఆధారాలు  ఉంటే వాటినీ పరిశీలిస్తారు. ఓటరు జాబితాలో ఎవరైనా చనిపోయినవారుంటే వారి పేర్లు తొలగిస్తారు.  కరోనా సెకండ్​ వేవ్​ వల్ల ఈ తనిఖీలు ఇప్పట్లో ఉండకపోవచ్చని, పరిస్థితులు చక్కబడితే జూన్​లో నిర్వహించవచ్చని తెలిసింది. ఈ ప్రక్రియ పూర్తయితేనే కొత్త వాళ్లకు పెన్షన్​ మంజూరు కానుంది. 
ప్రస్తుతం ఆసరా లబ్ధిదారులు 37.72 లక్షలు
ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, బోదకాల బాధితులు, ఎయిడ్స్​ వ్యాధిగ్రస్తులు, నేత కార్మికులు, గీత కార్మికులు కలిపి 37,72,350 మంది ఆసరా పెన్షన్​లబ్ధిదారులుగా ఉన్నారు. వీరిలో ఓల్డేజ్ పెన్షన్​ 11,68,756 మంది, వితంతువులు 14,23,427, దివ్యాంగులు 4,79,733 మంది, చేనేత కార్మికులు 36,015 మంది, గీత కార్మికులు, 61,600 మంది, హెచ్​ఐవీ పేషెంట్లు 31,891 మంది, పైలేరియా పేషెంట్లు 16,104 మంది, బీడీ వర్కర్స్​ 4,21,024 మంది, ఒంటరి మహిళలు 1,33,800 మంది ఉన్నారు.  ఏడాది క్రితం ఆసరా లబ్ధిదారుల సంఖ్య 39,31,976గా ఉంది. ఏడాదిలోనే మరణించడం లేదా ఇతర కారణాలతో పెన్షన్​ తీసుకునేవాళ్లలో 1,59,626 మందిని జాబితా నుంచి తొలగించారు.  

కొత్తగా 9.5 లక్షల మందికి..
రాష్ట్ర ప్రభుత్వం 57 ఏండ్లు నిండిన వారికి పెన్షన్​ ఇచ్చేందుకు బడ్జెట్​లో కేటాయింపులు పెంచింది. గత బడ్జెట్‌‌‌‌లోనే వీరి కోసం రూ. 11,758 కోట్లు కేటాయించినా  ఖర్చు చేయలేదు. ఈసారి రూ. 11,728 కోట్లు కేటాయించింది. సుమారు 9.50 లక్షల మందికి కొత్తగా పెన్షన్​ ఇవ్వొచ్చని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. రెండేండ్ల కింద ఓటరు జాబితా ఆధారంగా 6.62 లక్షల మందికి 57 ఏండ్లు నిండినట్లుగా గుర్తించారు. వీరితోపాటు వితంతువులు, బీడీ కార్మికులు, బోదకాల బాధితులు, ఎయిడ్స్​ వ్యాధిగ్రస్తులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, దివ్యాంగుల కేటగిరీ ల్లో అర్హులు ఉంటే మరో 3 లక్షల మందికి లబ్ధి  కలిగే అవకాశం ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు.