తహసీల్దార్, ఆర్డీఓ, ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ ఆఫీసులకుశాశ్వత భవనాలు..హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం: మంత్రి పొంగులేటి 

తహసీల్దార్, ఆర్డీఓ, ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ ఆఫీసులకుశాశ్వత భవనాలు..హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం: మంత్రి పొంగులేటి 
  • ఆధునిక వసతులతో ఒకే నమూనాలో నిర్మించనున్నట్లు వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ప్రజలకు సౌకర్యవంతమైన, గౌరవప్రదమైన సేవలు అందించడమే లక్ష్యంగా తహసీల్దార్, ఆర్డీవో, సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ (ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ)లకు హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శాశ్వత భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి తెలిపారు. గురువారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో రెవెన్యూ, హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఎలాంటి ముందు చూపు లేకుండా మండలాల పునర్విభజన చేయడం వల్లే కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.

మొదటి దశలో భాగంగా అద్దె భవనాల్లో, శిథిలావస్థలో కొనసాగుతున్న 125 తహసీల్దార్ కార్యాలయాలు, 11 ఆర్డీవో కార్యాలయాలకు ఆధునిక వసతులతో, ఒకే నమూనాలో (యూనిఫామ్ డిజైన్) నూతన భవనాలను నిర్మించనున్నామని, ఇందుకు అవసరమైన స్థలాలను వెంటనే సేకరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి సమీకృత భవనాల నిర్మాణ పనులను ప్రారంభించామని వెల్లడించారు.

జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న రెండు డీఐజీ, నాలుగు జిల్లా సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్, 52 సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్ కార్యాలయాలను డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల సంఖ్యకు అనుగుణంగా 4 వేల నుంచి 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకే మోడల్‌‌‌‌‌‌‌‌లో నిర్మించబోతున్నట్లు స్పష్టం చేశారు. అలాగే కొత్త మండలాల్లో ఖాళీ పోస్టుల భర్తీతో పరిపాలనను బలోపేతం చేశామని గుర్తుచేసిన మంత్రి.. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాల గుర్తింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని, దీనిపై త్వరలో జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.