V6 News

నీటి వనరుల పునరుద్ధరణతోనే నీళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం !

నీటి వనరుల పునరుద్ధరణతోనే నీళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం !

సాగునీరు, తాగునీరు సమస్యలు రోజురోజుకూ విస్తృతమవుతున్నాయి. ఎండిపోతున్న  నీటి వనరుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నది. నదులు ఎండిపోతున్నాయి. కొన్ని నదులు మురికి కూపాలుగా మారుతున్నాయి. నదిలో నీళ్లు లేకపోతే  ఇంకో నది నుంచి తెస్తామని పాలకులు ప్రగల్భాలు పలుకుతారు. ప్రకృతి వినాశనం వల్ల సహజ నీటిచక్రం ధ్వంసం చేస్తున్న రీతి, పనుల గురించి పాలకులలో  కనీస  ప్రస్తావన ఉండదు. కోట్ల రూపాయల ప్రాజెక్టులు కట్టడమే పరిష్కారంగా రాజకీయులు మాట్లాడుతుంటే ప్రశ్నించేవారే లేరు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విభజించిన తరువాత  కూడా  రెండు రాష్ట్రాలలో రాజకీయ, సాంఘిక, ఆర్థిక పరిణామాలు నీటితో ముడిపడి ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ నిర్మాణం పుంజుకున్నది కూడా నీళ్లను మొదటి  ప్రస్తావించిన తరువాతనే. నీళ్లు ఒక రాజకీయ అస్త్రం. ఇది రాజకీయ అస్త్రంగా మారడానికి ఇంకొక కారణం కూడా ఉన్నది. దాని నుంచి లభించే ఆర్థిక ప్రయోజనాలు. సాగు,  తాగునీరు ప్రాజెక్టులు వలన నిలబడిన రాజకీయ జీవితాలు, కోట్లకు  పడగలెత్తిన  కాంట్రాక్టర్ల కుటుంబాలు, తరగని ఆస్తులకు అధిపతులైన అధికారులకు రెండు రాష్ట్రాలలోనూ కొదవలేదు. 

అధికారం కావాలనుకున్నా, అధికారం గుంజు కోవాలన్నా, కుర్చీలలో తిష్టవేసిన వారిని కదిలించాలన్నా  ఉపయోగపడే  పాశుపతాస్త్రాలు  నీళ్లు, నీటి ప్రాజెక్టులు. ప్రతి ఎండాకాలం  అనేక  కుటుంబాలు  నీళ్లులేక  కొరతతో,  కాలుష్యంతో  బాధపడుతుంటాయి.  గత 30 ఏండ్లుగా  నీటి కొరత  పెరుగుతోంది.  నీటి కరువు కొన్ని ప్రాంతాలలో శాశ్వతంగా ఉన్నా కూడా  పాలకులకు చీమ కుట్టినట్టు కూడా లేదు.  తాత్కాలిక ఉపశమనాలే  తప్ప శాశ్వత  పరిష్కారాలకు చర్యలు లేవు.  అధికారిక  నీటి తస్కరణ ఒక నీటి యుద్ధనీతి. ఒక ప్రాంతం నీటిని ఇంకొక ప్రాంతానికి తరలించడం ఆధునిక అభివృద్ధి. 

వర్షం నీటిని అంచనా వేయలేని వ్యవస్థ మాత్రం నదిలో పారే నీటికి  కాకి లెక్కలు చెప్పడం ఆశ్చర్యకరం. ఆ కాకి లెక్కల పునాదుల మీద కోట్ల రూపాయల ప్రాజెక్టులు నిర్మాణం చేయడం, దానికి కావాల్సిన నిధులు అప్పులుగా పుట్టడం కూడా అంతే ఆశ్చర్యం. ఉన్న చెరువులు  ఒండ్రు మట్టి తీయడానికి మాత్రం నిధులు దొరకవు.  కాలువల పూడికకు అసలే నిధుల కరువు. కొత్త ప్రాజెక్టు  కడితే అందరికీ సంబరం.  చెరువుల పునరుద్ధరణ  మాత్రం  తాహతుకు  మించింది. చెరువు పరీవాహకం పరిరక్షణ చేయలేని అసమర్థత  ప్రభుత్వాలలో  స్పష్టంగా  కనిపిస్తోంది.

తగ్గుతున్న నీటి లభ్యత
వర్షాలు పడుతున్నా క్రమంగా నీటి లభ్యత తగ్గుతున్న వాస్తవం  మరుగునపడుతున్నది.  సౌత్ ఆఫ్రికా దేశంలో  కేప్​టౌన్​లో  సైన్యాన్ని పెట్టి నీటిని పంచితే వార్త అయ్యింది. ఇట్లాంటి వార్తలు తరువాత బెంగళూరు నగరాన్ని,  ఇటీవల టెహరాన్ నగరాన్ని తాకినా  కొద్దిగా  ఆందోళనపడడం ఆ తరువాత మరిచి పోవడం  సమాజంలో ఒక వింత ధోరణి.  నీటికి, తద్వారా పచ్చదనానికి, ఆలవాలమైన గోదావరి జిల్లాలలో నీటి లభ్యత తగ్గడం మన దగ్గర పెరుగుతున్న నీటి  సమస్యకు ఒక ఉదాహరణ. 

హైదరాబాద్ నగరంలో అయితే గత 30 ఏండ్లలో ప్రాజెక్టులు కడుతూనే ఉన్నారు. నీటి సరఫరా పెరిగింది.  కానీ, నీటి లభ్యత తగ్గింది.  నీటి వనరులు మారాయి. స్థానిక  గండిపేట్ నీళ్లు, సింగూర్  నీళ్లు,  నాగార్జునసాగర్  నీళ్లు,  గోదావరి నీళ్లు  వరుసగా వచ్చి దాహార్తిని  తీరుస్తున్నాయి.  ఇంకెక్కడికైనాపోయి నీళ్లు  తెస్తామంటారు పాలకులు.  బహుశా  మున్ముందు  గంగ  వరకు పోతామేమో. అట్లాంటి హామీ ఇవ్వడానికి వారికి  సోయి లేక కాదు.  అందులో ఉన్న ‘నిధుల’ ఆకర్షణ.

వర్షమే నీటికి ఆధారం 
నీరు  తగ్గుతున్నకొద్దీ  పరిణతి  చెందాల్సిన సంస్థాగత  వ్యవస్థ  కూడా బలహీనపడడం చూస్తున్నాం. నీటి ప్రాజెక్టుల మీద కోట్ల రూపాయలు కుమ్మరించినా.. వాటి ఉద్దేశ్యాలలో,  ఆలోచనలలో, డిజైన్​లో  ఉన్న లోపాల వల్ల ఫలితాలు  తక్కువ,  దుష్ఫరిణామాలు ఎక్కువ అవుతున్నాయి. కాళేశ్వరం మీద ఒక లక్ష కోట్లు కుమ్మరించినా నీటి సమస్య పరిష్కారం కాకపోగా ఇంకా జటిలం అయ్యింది. ఇప్పుడు కూడా కోట్లకు కోట్ల నిధులు కుమ్మరించి అప్పులతో   చేస్తున్న పాలక వర్గాల  నీటి ఉపాయాలు ఎందుకూ కొరగావు.

ఒకవైపు  నీటి లభ్యత తగ్గుతున్న తరుణంలో ఉన్న నీటిని అందరికి సమానంగా పంచే వ్యవస్థను  కదిలించడం లేదు.  ఇంకొకవైపు కొందరికే  నీరు అందించే ఏర్పాట్లు  అధికారికంగా  చేస్తున్నారు పాలకులు.  భూగర్భ నీటిని, స్థానిక తటాకాలను కలుషితం చేసే కంపెనీలకు ‘మంచి’ నీరు అందిస్తున్నారు. మిషన్ భగీరథ మీద దాదాపు రూ.60 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినా పనికి రాకుండా పోవడం దేనికి నిదర్శనం?  వర్షమే నీటికి ఆధారం అయినప్పుడు  వర్షాన్ని  తెచ్చే ప్రకృతి గురించి, వాతావరణం గురించి, పర్యావరణం గురించి మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? 

పెట్టుబడి మీద ఉన్న శ్రద్ధ నిర్వహణపై లేదు
కాపిటల్ పెట్టుబడి మీద ఉన్న శ్రద్ధ నిర్వహణ మీద లేకపోవడం అతిపెద్ద లోపం.   ప్రతి సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులలో ఈ లోపం కొనసాగుతున్నది.  100  ఏండ్ల క్రితం కట్టిన  ప్రాజెక్టులు బహుళార్థక  ప్రయోజనాలు అందిస్తుండగా,  గత 30  ఏండ్లలో  ప్రకటించినవి,  దశాబ్దాలుగా నిర్మిస్తున్నవి, ఇటీవల నిర్మాణం పూర్తి అయినవి మాత్రం చతికిలపడడానికి ప్రధాన కారణం  ప్రాజెక్టు వెనుక ఆలోచనలో, ప్రణాళికలలో, అమలులో ఇమిడి ఉన్న డొల్లతనం.  నిర్మాణానికే  కోట్లాది రూపాయలు పెట్టి,  నిర్వహణకు  నిధులు కేటాయించని ప్రాజెక్టుల సంఖ్య ఈ మధ్య ఇంకా ఎక్కువ అవుతున్నది. 

వర్షాలు ఎప్పుడు వస్తాయో, ఎంత పడతాయో తెలియని అయోమయం ఇంకా లోతుగా మారుతుంది అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎల్ నినో  పరిస్థితుల వల్ల వర్షాలు పడకపోవచ్చు. తీవ్రమైన కరువు వస్తుంది అని ఇటీవల హెచ్చరిక  కూడా వచ్చింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల వర్షాలు నగరాలలోనే  పడుతున్నాయి. అడవులలో పడడం లేదు. అడవులలో నీరు లేక వన్యప్రాణులు బయటకు వస్తున్నాయి.  రాన్రాను నగరాలలోనే వర్షాలు పడితే నీటి వనరులు లేని  గ్రామీణ ప్రాంతాలు కూడా ఖాళీ అవుతాయి. ఉత్తరాఖండ్  రాష్ట్రంలో ఈ  పరిస్థితి  ఇప్పటికే  చూడవచ్చు.  ఇదొక  సమస్యాత్మక చక్రంగా  మారుతున్నది.  

పర్యావరణాన్ని పరిరక్షించాలి
పర్యావరణ పునరుద్ధరణ  కేంద్రంగా నీటి వనరుల  ప్రాజెక్టులు సాధ్యమే.  వివిధ రాష్ట్రాలలో, సుస్థిర ఆలోచనల అమలుతో నీటి వనరుల వ్యవస్థలను  పునఃనిర్మాణం చేసుకున్నాయి. నీటి లభ్యతను పెంచుకున్నాయి. వాటిని అనుసరించడం ప్రస్తుత తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యం. ఆ పంథా అనుసరిస్తే పెట్టుబడులు, ఖర్చులు, అప్పులు కూడా తగ్గుతాయి.   నీటి సమస్య పరిష్కారానికి అధిక పెట్టుబడులు అవసరం లేదు. 

లక్షల కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చి పెట్టాల్సిన పని లేదు. సంప్రదాయ నీటి నిర్వహణ నుంచి నేర్చుకోవాల్సిన  పాఠాలు చాలా ఉన్నాయి. కీర్తి, రాజకీయ లబ్ధి, రాజకీయ ప్రాబల్యం కోసం సాగు నీటి  ప్రాజెక్టులను నిత్యం ప్రతిపాదించడం మానేస్తే నీటి సమస్యకు పరిష్కారం ప్రజల ఆలోచనల నుంచి వస్తుంది. ప్రజల భాగస్వామ్యంతో ఫలితాలు వస్తాయి. నీటి సమస్యల పరిష్కారానికి సమగ్ర ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రకృతి  ఉంటేనే నీరు. పర్యావరణం లేనిదే నీరు లేదు.

నీటి వనరుల పునరుద్ధరణకు కృషి చేయాలి
నీటి కొరత, నీటి వనరులను ఎండబెడుతున్న ఆధునిక అభివృద్ధి, నీటి ప్రాజెక్టుల మీద  సమీక్ష చేయకుంటే నీటి కరువు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరినైనా తాకవచ్చు. ప్రభుత్వం, పౌర సమాజం, రైతు సంఘాలు, స్థానిక సంస్థలు అన్నీ కలిసి నీటి వనరుల పునరుద్ధరణకు కృషి చేయాలి. ముఖ్యంగా, మన పాత చెరువులను,  కుంటలను, వాగులను  పునరుజ్జీవింప చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవడం అత్యవసరం. 

నీటి వనరులు బాగుండాలంటే, నీటితో కళకళలాడాలంటే అడవులను పెంచాలి. నీళ్లు లేనిదే పచ్చదనం లేదు.  ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, రాజకీయ సంకల్పానికి సంబంధించిన విషయం కూడా. నీటి వనరుల పునరుద్ధరణకు కృషి చేస్తేనే నీళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. నీటి నిర్వహణలో పారదర్శకత,  జవాబుదారీతనం లేకుండా ఎంత డబ్బు పెట్టినా వృథాయే. భావితరాలకు సురక్షితమైన నీటి వనరులు అందించాలంటే ఇప్పుడే మేల్కొనాలి.  అన్ని వర్గాల ప్రజలకు సమానంగా నీరు అందించే వ్యవస్థను నిర్మించడం మన తక్షణ కర్తవ్యం.

డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ​ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.