
- వనస్థలిపురం పీఎస్ పరిధిలో ఘటన
అనారోగ్య సమస్య బాధపడుతున్న యువకుడు కడుపునొప్పి తట్టుకోలేక ఫ్యాన్ కు ఉరి పెట్టుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం..సాహెబ్ నగర్ లో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోన్న జటోత్తు సంతోశ్(25) ఎంబీఏ పూర్తి చేశాడు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సంతోశ్ మంగళవారం సాయంత్రం కడుపునొప్పి తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంతోష్ కి అనారోగ్య సమస్య ఉన్నట్టు అతడి తల్లి ధనమ్మ తన కంప్లయింట్ లో పేర్కొంది. పోలీసులు డెడ్ బాడీని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజు తెలిపారు.
గచ్చిబౌలిలో అత్తింటి వేధింపులకు వివాహిత బలి
భర్త, అత్తింటి వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై మురళి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఏపీలోని వైజాగ్ ప్రాంతానికి చెందిన కందిపుడి ప్రవీణ్ కుమార్ కు అదే ప్రాంతానికి చెందిన లీలశ్రీతో 2013లో పెళ్లైంది. పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు గుంటూరులో ఉన్న ప్రవీణ్ కుమార్, లీలశ్రీ మూడేళ్ల తర్వాత సిటీకి వచ్చి చిత్రపురికాలనీ బ్లాక్ నం.6లో ఓ ఇంట్లో రెంట్ కి ఉంటున్నారు.
కొన్ని రోజుల తర్వాత ప్రవీణ్ కుమార్ తన భార్య లీలశ్రీని వేధించడం మొదలుపెట్టాడు. లీలశ్రీ కుటుంబీకుల దగ్గరి నుంచి ప్రవీణ్ కుమార్ తీసుకున్న అప్పును తిరిగిఇవ్వకుండా ప్రతి రోజూ ఆమెను వేధించేవాడు. బావమరిది ప్రదీప్, అత్త శ్రీదేవి, మరదలు రేఖ ప్రతి నిత్యం వేధింపులకు గురిచేసేవారు. వీరి వేధింపులు తట్టుకోలేక లీలశ్రీ ఈ నెల 27న సాయంత్రం 5.30గంటలకు ఇంట్లో ఫ్యాన్ కి చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై మురళి అన్నారు.
కుటుంబ సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపల్లి మండలం రాఘవపల్లి గ్రామానికి చెందిన పాసులడి బాలయ్య(30) భార్య సావిత్రి పిల్లలతో కలిసి మణికొండలోని పోచమ్మ దేవాలయం వద్ద ఉంటూ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కుటుంబ వివాదాలతో బాలయ్య ఇటీవలే గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ లో భార్య పిల్లలతో కలిసి కౌన్సిలింగ్ కు హజరయ్యాడు. మంగళవారం ఉదయం భార్య పని మీద బయటికి వెళ్లడంతో బాలయ్య తన పిల్లలకు షాప్ కి పంపించి ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన కంప్లయింట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు