
గత కొన్ని రోజులుగా మీడియాలో నానుతున్న పేరు ఆన్‌లైన్ గేమ్ షో పబ్ జీ. ఈ ఆటలో గెలుపు ఓటములు సంగతి ఏమో కానీ దీని బారిన పడి చాలామంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు. సరదాగా మొదలుపెట్టిన ఈ గేమ్ షో వ్యసనంగా మారి అనేక మందిని విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తుంది. కొన్ని రోజుల క్రితం ఓ విద్యార్ధి తన పరీక్షా పేపర్‌లో సమాధానానికి బదులు.. పబ్ జీ ని ఎలా ఆడాలో.? ఆటకు గల నియమనిబంధనలు రాస్తూ వ్యాసం రాశాడు. ఫలితంగా ఫెయిలయ్యాడు. తాజాగా మరో యువకుడు పబ్ జీ ఆడి ప్రాణం కోల్పోయాడు. గత కొన్ని రోజులుగా అదే పనిగా పబ్ జీ ఆడటం వల్ల మెడ నరాలన్నీ బిగుసుకు పోయి ఆసుపత్రి పాలయ్యాడు. ఐదు రోజుల క్రితం చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆ యువకుడు పరిస్థితి విషమించడంతో ఈ రోజు మృతి చెందాడు. మెడ నరాలు పూర్తిగా దెబ్బతినడం వల్లే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని రాజారంపల్లికి చెందిన సాగర్(20)గా గుర్తించారు.