బురద ఉందని అంబులెన్స్ రాలేదు.. ఎండ్లబండిలో వెళ్లేసరికి పానం పోయింది

బురద ఉందని అంబులెన్స్ రాలేదు.. ఎండ్లబండిలో వెళ్లేసరికి పానం పోయింది

అంబులెన్స్ రాలేక.. వాగు దాటేసరికి పానం పోయింది
బురద రోడ్డు పై నరకయాతన
గిరిజనుడి మృతి

బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని అడవిలో ఉన్న మారుమూల గిరిజన గ్రామమది. వాగు దాటి రెండు కిలోమీటర్లు బురద దారిలో వెళ్తేగాని ఆ గ్రామానికి చేరుకోలేని పరిస్థితి. అత్యవసర సమయాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తోందని, వాగుపై వంతెన నిర్మించి రోడ్డువేయాలని గ్రామ గిరిజనులు ప్రజా ప్రతినిధులు, అధికారులను పదే పదే వేడుకున్నారు. అయినా వారు కనికరించలేదు. చివరికి ఓ ప్రాణం బలైంది. సరైన సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో పసుల బాపు(45) అనే గిరిజనుడు మృతిచెందాడు. ఈ ఘటన ఖర్జీజంగాల్ పేట పంచాయతీ పరిధిలోని దమ్మిరెడ్డిపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నెన్నెల మండలం దమ్మిరెడ్డిపేట గ్రామానికి చెందిన పసుల బాపు(45) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. శుక్రవారం కుటుంబసభ్యులు 108 అంబులెన్స్ కు ఫోన్ చేశారు. బురద రోడ్డు కావడంతో అక్కడికి రాలేమని అంబులెన్స్ సిబ్బంది చెప్పారు. గత్యంతరం లేక కుటుంబీకులు బాపును ఎడ్లబండిలో ఎక్కించుకొని బురద రోడ్డుగుండా తీసుకెళ్లివాగు దాటేసరికి మూడు గంటల సమయం పట్టింది. ఖర్జీ నుంచి ఆటోలో ఎక్కించుకొని బెల్లంపల్లి ఆస్పత్రికి బయలు దేరారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో నెన్నెల –బెల్లంపల్లి మార్గమధ్యలో బాపు మృతి చెందాడు. మృతుడికి భార్య వెంకటమ్మతో పాటు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

For More News..

సింగరేణికి ఇద్దరు కొత్త డైరెక్టర్లు

కరెంట్ కట్ చేశారని యువతి సూసైడ్