- కంప్లైంట్ చేస్తే పట్టించుకోని ఎస్సై
- ఎస్సై నుంచి ప్రాణహాని ఉందంటున్న బాధితుడి భార్య
ఆస్తి వివాదంలో ఎస్సై తలదూర్చి తమపై దాడి చేశారంటూ జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని తిరుమలాపూర్‌కు చెందిన కోలకాని గంగ మల్లయ్య, సత్యం అన్నదమ్ములు. గంగ మల్లయ్య 20 ఏళ్ల క్రితం ముంబై వలస వెళ్లి.. ఇటీవలే గ్రామానికి తిరిగి వచ్చాడు. అయితే తమ్ముడు సత్యం మాత్రం అన్నను, ఆయన కుటుంబాన్ని ఇంట్లోకి రానివ్వలేదు. దాంతో ఇదే విషయాన్ని కొడిమ్యాల ఎస్సైకి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాల్సిందిపోయి.. ఎస్సై శివకృష్ణ తమ భర్తపైనే దాడి చేశారని గంగ మల్లయ్య భార్య లక్ష్మి ఆరోపించారు. స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లాక.. సోదరుడు సత్యం, అతని భార్య, కొడుకు కలిసి తమపై దాడిచేసి కొట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ్ముడి కుటుంబం దాడిచేయడంతో మనస్తాపానికి గురైన గంగ మల్లయ్య.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఆయన కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తమకు కొడిమ్యాల ఎస్సై శివకృష్ణ, మరిది సత్యంతో ప్రాణభయం ఉందని.. తమకు రక్షణ కల్పించాలని గంగ మల్లయ్య భార్య లక్ష్మి అధికారులను కోరుతున్నారు.
