పురుగు మందుల అమ్మకాల్లో మోసాలు..లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ల తనిఖీలు

పురుగు మందుల అమ్మకాల్లో మోసాలు..లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ల తనిఖీలు
  • కంపెనీ, డీలర్ పై కేసు నమోదు 

శాయంపేట, వెలుగు: రైతులు కొనుగోలు చేసే పురుగుల మందుల్లో కంపెనీలు, డీలర్లు మోసాలకు పాల్పడుతున్నట్లు లీగల్​మెట్రాలజీ ఆఫీసర్లు గుర్తించారు.  హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తిలోని శ్రీవెంకటేశ్వర ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్​షాపులో ట్రైకమ్ అగ్రి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పురుగుమందు సీల్ బాటిల్​లో 250 ఎంఎల్ బదులు150 ఎంఎల్​నింపి అమ్ముతున్నట్లు సూరంపేటకు చెందిన రైతు రమేశ్ గుర్తించి గత జులై 31న ఏఓకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏఓ గంగా జమున అదేరోజు షాపులో తనిఖీ చేసి 23 బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడికి నోటీసులు ఇచ్చారు.

అనంతరం లీగల్​మెట్రాలజీ డిపార్టుమెంట్​కు సమాచారం ఇచ్చారు.  సోమవారం లీగల్​మెట్రాలజీ ఆఫీసర్లు వెళ్లి తనిఖీ చేసి ట్రైకమ్ అగ్రి ప్రైవేటు లిమిటెడ్​కంపెనీ బాటిళ్లను  ప్రొసీజర్ మేరకు మందు ఎంత ఉందనేది కొలిచారు. 250ఎంఎల్​బదులు150 ఎంఎల్​గా ఉన్నట్టుగా గుర్తించారు. షాపులోని 23 బాటిళ్లను సీజ్ చేసి కంపెనీపై, డీలర్ పైన కేసు నమోదు చేయనున్నట్టు లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ విశ్వేశ్వర్​  తెలిపారు. రైతులు కూడా పురుగు మందులు కొనుగోలు చేసేటప్పుడు  సరి చూసుకోవాలని సూచించారు.