- పక్కపక్కనే అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబం
భోపాల్: యజమానిపై అమితమైన ప్రేమను పెంచుకున్న ఓ పెంపుడు శునకం ఆయన అంతిమ యాత్రలోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో జరిగింది. బేతుల్ జిల్లాకు చెందిన ప్రదీప్ జైన్ (67) అనారోగ్యంతో భోపాల్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం ఆయన భౌతికకాయాన్ని ఇంటికి తీసుకువచ్చినప్పటి నుంచి పెంపుడు కుక్క డుగ్గు తీవ్ర ఆందోళనకు లోనైంది. యజమాని విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయింది.
బంధువులు ఎక్కువగా ఉండటంతో దాన్ని వేరే గదిలో ఉంచినప్పటికీ.. ఆ రాత్రంతా తలుపులు బాదుతూ మొరుగుతూనే ఉంది. సోమవారం ఉదయం ప్రదీప్ జైన్ అంతిమ యాత్ర ప్రారంభం కావడానికి కొద్దినిమిషాల ముందు కుటుంబ సభ్యులు డుగ్గును ఆయన భౌతికకాయం వద్దకు తీసుకువచ్చారు. ప్రదీప్‌ను ఆఖరు సారి చూసిన డుగ్గు ఆ తర్వాత నెమ్మదిగా లోపలికి వెళ్లిపోయింది. అంతిమ యాత్ర ప్రారంభమై ఆయన పాడెను ముందుకు తీసుకెళ్తుండగా డుగ్గు పరుగెత్తుకుంటూ బయటకు వచ్చింది. పాడె వెంటే కొద్ది దూరం నడిచి అకస్మాత్తుగా అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది.
యజమాని మరణాన్ని తట్టుకోలేకే పెంపుడు కుక్క ప్రాణాలు విడిచిందని ప్రదీప్ జైన్ కుటుంబ సభ్యులు తెలిపారు. కుక్క చూపిన విశ్వాసానికి గౌరవంగా కుటుంబ సభ్యులు అదే స్మశానవాటికలో ప్రదీప్ జైన్ పక్కనే పూర్తి గౌరవంతో ఖననం చేశారు. మరణంలోనూ విడిపోని వారి బంధాన్ని చూసి అంత్యక్రియలకు హాజరైన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ హృదయ విదారక ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
